Bandi Sanjay: భయపెట్టాలని చూస్తే భయపడతామా?
ABN, Publish Date - Oct 24 , 2024 | 03:53 AM
‘‘నాకు లీగల్ నోటీసులు ఇచ్చి భయపెట్టాలని చూస్తే భయపడేది లేదు, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక లీగల్ నోటీసులు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తుంది.
నేనూ నోటీసులతోనే బదులిస్తా
కేటీఆర్ సుద్దపూసేమీ కాదు: బండి సంజయ్
కేసీఆర్, కేటీఆర్ ఆరోపణలు చేస్తే రాజకీయం
మేం మాట్లాడితే పరువుకు భంగమా?: రాణి రుద్రమ
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘నాకు లీగల్ నోటీసులు ఇచ్చి భయపెట్టాలని చూస్తే భయపడేది లేదు, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక లీగల్ నోటీసులు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తుంది. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడను’’ అని కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్.. తనకు లీగల్ నోటీసులు పంపడంపై సంజయ్ స్పందించారు. తనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారన్న విషయాన్ని మీడియాలో చూసి తెలుసుకున్నానని తెలిపారు. మొదటగా కేటీఆరే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో పాటు అవమానించారని, అందుకు బదులుగానే తాను మాట్లాడానని పేర్కొన్నారు..
ఇప్పటివరకు మాటలకు.. మాటలతోనే బదులిచ్చానని, ఇకపై లీగల్ నోటీసులకు.. నోటీసులతోనే బదులిస్తానని పేర్కొన్నారు. తాము చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులమని, చట్టం, న్యాయం ప్రకారమే ముందుకువెళ్తామన్నారు. కేటీఆర్ ఏమైనా సుద్దపూస అనుకుంటున్నాడేమోనని, కానీ ఆయన భాగోతం ప్రజలకు తెలుసన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసంటూ బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా బీఆర్‌ఎస్ నేతల లీగల్ నోటీసులకు, తాటాకు చప్పుళ్లకు బీజేపీ నాయకులు భయపడరంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి అన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్.. కేంద్ర హోం శాఖ సహయమంత్రికి లీగల్ నోటీసులు పంపడంపై ఆమె స్పందించారు. కేటీఆర్ లీగల్ నోటీసులను ఖండిస్తున్నట్టు బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రజలు అధికారం నుంచి దిగిపొమ్మని ఇప్పటికే తీర్పు ఇచ్చారని, అయినా ఇంకా అధికారంలో ఉన్నారనుకుని ప్రతిపక్ష నాయకులకు నోటీసులు ఇస్తున్నారని అన్నారు. తాము తలుచుకుంటే భవిష్యత్తు మొత్తం నోటీసులు చదువుకోవడానికే సరిపోతుందంటూ హెచ్చరించారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ అనేకసార్లు ఇతర పార్టీల నాయకులపై ఇష్టారీతిన మాట్లాడారని, వారు మాట్లాడినా, ఆరోపణలు చేసినా రాజకీయం.. అదే బీజేపీ నాయకులు మాట్లాడితే పరువుకు భంగం కలుగుతుందా? అని నిలదీశారు. ఇప్పటికైనా నోరు అదుపులోపెట్టుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. ఈ సందర్భంగా గతంలో ఒక సభలో కేసీఆర్ మహిళలను కుక్కలు అంటూ దురహంకారంతో మాట్లాడారని రుద్రమ గుర్తుచేశారు.
Updated Date - Oct 24 , 2024 | 03:53 AM