Bhatti Vikramarka: ధరణితో 25వేల ఎకరాలు అన్యాక్రాంతం
ABN, Publish Date - Dec 19 , 2024 | 04:17 AM
బీఆర్‌ఎస్ హయాంలో తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ కారణంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున అక్రమార్కుల పాలయ్యాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఇందులో ఎక్కువ శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోనే 10వేల ఎకరాలు
ఫోరెన్సిక్ ఆడిట్‌తో ఆ భూముల్ని గుర్తించి స్వాధీనం: భట్టి
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ హయాంలో తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ కారణంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున అక్రమార్కుల పాలయ్యాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ధరణిలో లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను ఇతరుల పేరిట రిజిస్టర్ చేశారన్నారు. ఇలా రిజిస్టర్ చేయించుకున్న వ్యక్తులు ఆ భూములను ప్లాట్లుగా చేసి విక్రయించారని తెలిపారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో బుధవారం భట్టి విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి భూములు దాదాపు 25 వేల ఎకరాలుంటాయని, ఇందులో ఎక్కువ శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయని చెప్పారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 10వేల ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్లు వివరించారు.
ఈ భూములకు సగటున ఎకరాకు రూ.10 కోట్లు ఉంటుందని.. 25 వేల ఎకరాలకు దాదాపు రూ.2.50లక్షల కోట్లు వచ్చేవని, ఇదంతా ఖజానాకు నష్టమేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న భూభారతి చట్టం ద్వారా ఇలాంటి ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆడిట్ నిర్వహించి, అన్యాక్రాంతమైన భూములను గుర్తించి, స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. గత 12 నెలల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.38,400 కోట్ల నిధులను రాబట్టుకోగలిగినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మండలిలో మాట్లాడుతూ రాష్ట్రానికి 2023 డిసెంబరు నుంచి 2024 నవంబరునాటికి టాక్స్ డివొల్యూషన్ కింద రూ.28,171 కోట్ల్లు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రూ.2,819 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.6,442 కోట్లు, జీఎస్టీ కింద రూ.518 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం కింద రూ.450 కోట్లు నిధులు విడుదల చేసిందని తెలిపారు. .
Updated Date - Dec 19 , 2024 | 04:17 AM