ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కులోన్మాదానికి మహిళా కానిస్టేబుల్‌ బలిబలి

ABN, Publish Date - Dec 03 , 2024 | 03:11 AM

అక్క కులాంతర వివాహం చేసుకోవడాన్ని తమ్ముడు జీర్ణించుకోలేకపోయాడు. ఆమె పెళ్లాడిన వ్యక్తి తమ ఊరివాడే కావడంతో తలెత్తుకోలేకపోతున్నానని కక్ష పెంచుకున్నాడు.

  • కులాంతర వివాహం చేసుకుందని అక్కపై తమ్ముడి కక్ష

  • స్కూటీపై వెళ్తుండగా కారుతో ఢీ.. ఆపై కొడవలితో దాడి

  • మెడ నరికి దారుణ హత్య.. వివాహమైన 22 రోజులకే ఘోరం

  • రూ. కోట్ల విలువైన భూమి తగాదాలూ కారణమేనా?

ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): అక్క కులాంతర వివాహం చేసుకోవడాన్ని తమ్ముడు జీర్ణించుకోలేకపోయాడు. ఆమె పెళ్లాడిన వ్యక్తి తమ ఊరివాడే కావడంతో తలెత్తుకోలేకపోతున్నానని కక్ష పెంచుకున్నాడు. ఈ ఆగ్రహంతో ఉన్మాద స్థితికి చేరుకొని, పథకం ప్రకారం దారికాచి మరీ తోబుట్టువును వేటకొడవలితో నిర్దాక్షిణ్యంగా నరికి చంపాడు. ఈ కులోన్మాద హత్య రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిఽధిలోని రాయపోల్‌లో జరిగింది. ఈ హత్యకు భూ తగాదాలు కూడా కారణం అని స్థానికులు చెబుతున్నారు. హతురాలి పేరు కొంగర నాగమణి (28). ఆమె పోలీస్‌ కానిస్టేబుల్‌. తాను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లాడిన 22 రోజులకే ఆమె దారుణహత్యకు గురవడం మరీ విషాదం! హత్యకు ఒడిగట్టింది ఆమె సోదరుడు. అక్కా తమ్ముళ్లది రాయ్‌పోల్‌ గ్రామం. తల్లిదండ్రులు పద్మ-రమేశ్‌. ఈ దంపతులకు నాగమణి, పరమేశ్‌తో పాటు మరో కూతురు కూడా ఉంది.. 12 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు పద్మ-రమేశ్‌ చనిపోయారు. రెండో సంతానమైన నాగమణికి 8 ఏళ్ల క్రితం ఇబ్రహీంపట్నం మండలం పటేల్‌గూడకు చెందిన వ్యక్తితో పెద్దలు వివాహం జరిపించారు. అప్పటికే తమ గ్రామానికే చెందిన, వేరే కులానికి చెందిన డ్రైవర్‌ బండారి శ్రీకాంత్‌తో నాగమణి ప్రేమలో ఉంది. 2020లో నాగమణి పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తోంది.


మూడేళ్ల క్రితం నాగమణి తన భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి శ్రీకాంత్‌తో సహజీవనం చేస్తోంది. కొన్నాళ్లుగా నాగమణి-శ్రీకాంత్‌ వనస్థలిపురంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. గతనెల 10న నాగమణి-శ్రీకాంత్‌ యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. వేరే కులం యువకుడిని అక్క పెళ్లి చేసుకోవడంపై పరమేశ్‌ అగ్రహంతో రగిలిపోయాడు. రెండెకరాలు అమ్మి ఘనంగా పెళ్లి చేస్తే బావతో విడాకులు తీసుకోవడం... ఆపై వేరే కులానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేయడం, అతడిని పెళ్లి చేసుకొని, ఆ ఫొటోలను వాట్సాప్‌ స్టేట్‌సగా పెట్టడంతో తెలిసిన వాళ్ల మధ్య తలెత్తుకోలేకపోతున్నానని అక్కపై కోపం పెంచుకున్నాడు. ఇక శనివారం శ్రీశైలం వెళ్లి దైవదర్శనం చేసుకున్న నాగమణి-శ్రీకాంత్‌ దంపతులు ఆదివారం సెలవు కావడంతో రాయ్‌పోల్‌కు వచ్చారు. ఆ రోజు అత్తగారి ఇంట్లోనే ఆమె బస చేసింది. సోమవారం ఉదయం 8:30కు నాగమణి విధుల కోసం ఇంటి నుంచి స్కూటీపై హయత్‌నగర్‌వైపు బయలుదేరింది. పథకం ప్రకారం ఆమె కారులో పరమేశ్‌ అనుసరించాడు.


గుర్తించిన నాగమణి.. తమ్ముడు తనను కారులో వెంబడిస్తున్నట్లు తన భర్తకు ఫోన్‌చేసి వివరించేంతలోనే ఫోన్‌ కట్‌ అయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మన్యగూడ రోడ్డులో స్కూటీని పరమేశ్‌ తన కారుతో ఢీకొట్టాడు. స్కూటీ నుంచి ఆమె కింద పడిపోగానే కారులోంచి వెంట తెచ్చుకున్న వేట కొడవలితో దిగి, ఆమె మెడపై వేటు వేశాడు. ఈ ఘటనలో మెడ లోతుగా తెగి, తీవ్ర రక్తస్రావం కావడంతో నాగమణి అక్కడికక్కడే మృతిచెందింది. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్లూస్‌ బృందాన్ని రప్పించి వివరాలు సేకరించారు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. హత్యచేసిన వెంటనే నిందితుడు పరమేశ్‌ ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. కాగా శ్రీకాంత్‌ కుటుంబీకులు, దళిత సంఘాల నాయకులు ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, శ్రీకాంత్‌ కుటుంబానికి రక్షణ కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక కమిటీ జిల్లా అధ్యక్షుడు సామేల్‌ డిమాండ్‌ చేశారు.


  • అక్క దగ్గర ఉన్న ఎకరం కూడా రాయించుకొని..

గ్రామస్థుల వివరాల ప్రకారం.. పద్మ-రమేశ్‌ దంపతులకు రాయపోల్‌లో 8 ఎకరాల పొలం ఉండేది. వీరు చనిపోయాక.. బంధువులు, ఓ రెండు ఎకరాలు అమ్మేసి నాగమణి పెళ్లి జరిపించారు. మిగిలిన నాలుగు ఎకరాల్లో రెండెకరాలు పరమేశ్‌ పేరిట రాసి.. నాగమణి పేరిట, మరో కుమార్తె పేరిట చెరో ఎకరం రాశారు. పరమేశ్‌ ఓ ఎకరం అమ్మేసి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అక్కడ ఎకరం విలువ రూ.2 కోట్ల దాకా ఉంది. భూమికి భారీ ధర పలుకుతుండటంతో అక్క నాగమణిపై ఒత్తిడి తెచ్చి.. ఆమె పేరిట ఉన్న ఎకరం భూమిని తన పేరు మీద మార్చుకున్నాడు. వారసత్వ ఆస్తి కావడంతో రిజిస్ట్రేషన్‌ అనంతరం కూడా ఆ భూమిపై తనకు ఎలాంటి హక్కులు లేవని రాసివ్వాల్సిందిగా నాగమణిపై పరమేశ్‌ ఒత్తిడి చేస్తున్నట్లు స్థానికులు చెప్పారు.

Updated Date - Dec 03 , 2024 | 03:11 AM