Telangana: సీఎం రేవంత్‌లో విషయం తక్కువ.. విషం ఎక్కువ: హరీష్ రావు
ABN, Publish Date - Nov 20 , 2024 | 06:46 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌కు వచ్చేది అయితే ఒట్లు.. లేదంటే తిట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. బుధవారం నాడు మహబూబ్‌నగర్ జిల్లా సీసీకుంట మండలం కురుమూర్తి స్వామి ..
హైదరాబాద్, నవంబర్ 20: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌కు వచ్చేది అయితే ఒట్లు.. లేదంటే తిట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. బుధవారం నాడు మహబూబ్‌నగర్ జిల్లా సీసీకుంట మండలం కురుమూర్తి స్వామి ఆలయానికి వచ్చారు హరీష్ రావు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. పాలకుడు ప్రజలను మోసం చేయకుండా ఉండాలని కురుమూర్తి స్వామిని వేడుకున్నట్లు హరీష్ రావు చెప్పారు. కురుమూర్తి స్వామి మీద ఒట్టు పెట్టి.. ఋణ మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్.. ఇప్పుడు ఆ మాట తప్పాడని ఎద్దేవా చేశారు. ఆలయానికి వస్తున్న దారిలో ఎంతో మంది రైతులను అడిగామని.. ఏ ఒక్కరూ సంతోషంగా లేరని చెప్పుకొచ్చారు.
పాలకుడు మాట తప్పితే.. ఆ ప్రాంతానికి నష్టం జరుగుతదన్నారు హరీష్ రావు. ‘మొన్న ఇక్కడికి వచ్చి స్వామి వారిని క్షమించమని అడుగుతారేమో అనుకున్న.. కానీ సీఎం రేవంత్ మరోసారి మోసం చేశాడు. అందుకే.. సీఎం రేవంత్‌ను క్షమించు.. ప్రజలను కాపాడమని స్వామి వారిని కోరుకున్నాను.’ అని హరీష్ రావు చెప్పుకొచ్చారు. వరంగల్‌లో ఏదైనా హామీలు నెరవేర్చే అంశంపై మాట్లాడుతారు అనుకున్నానని చెప్పారు. సీఎం రేవంత్‌కు అయితే ఒట్లు వేయడం.. లేదంటే తిట్లు మాత్రమే వచ్చునని విమర్శించారు. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాలేదని దుయ్యబట్టారు. ప్రజలను దగా చేయడం.. ప్రతిపక్షాలపై పగపట్టడం తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ ఏమీ కొల్పోలేదని రేవంత్ చెబుతున్నారని.. ప్రజలు రైతుబంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, చేపలు, గొర్రెలు సహా అనేక పథకాలను కోల్పోయారని హరీష్ రావు గుర్తు చేశారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. బి ట్యాక్స్ వచ్చిందని హరీష్ రావు విమర్శించారు. హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బి ట్యాక్స్ కట్టాల్సి వస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను రేవంత్ దూషించడంపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. సీఎం స్థానంలో ఉండి అలాంటి భాష మాట్లాడటం ఏంటి? అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని హరీష్ రావు హెచ్చరించారు. కేసీఆర్‌ను రైతు ముఖ్యమంత్రిగా.. రేవంత్‌ను బూతుల ముఖ్యమంత్రిగా ప్రజలు పిలుచుకుంటున్నారని చెప్పారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఎగబెట్టారు కాబట్టే ఎనుముల రేవంత్ రెడ్డిని.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తున్నామన్నారు హరీష్ రావు. గట్టిగా పని చేస్తే నాలుగు నెలల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తవుతుందని చెప్పారాయన. ఈసారి చాలా నీళ్ల సముద్రంలో కలిశాయని గుర్తు చేశారు. పాలమూరును దగా చేసింది కాంగ్రెస్, టీడీపీలే అని హరీష్ రావు విమర్శించారు. వీరివల్లే వలసల జిల్లాగా మహబూబ్‌నగర్ మారిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వలసలను వాపస్ తెచ్చామని హరీష్ రావు చెప్పారు. గతంలో కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే పండేవని.. కేసీఆర్ ప్రభుత్వం చివరి నాటికి కోటి యాభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండాయని హరీష్ రావు వివరించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేశారు కనుకే అది సాధ్యమైందన్నారు. సీఎం రేవంత్ నిద్రలో కూడా కేసీఆర్‌ను కలవరిస్తున్నాడంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఎనిమిది నెలలుగా మహిళా రుణాలు ఆగిపోయాయని చెప్పారు. ఇక్కడ ఇచ్చిందేమీ లేదుగానీ.. మహారాష్ట్రలో రుణాలు ఇస్తామని చెప్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి మాటలపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు.
వరంగల్‌లో జరిగిన కాంగ్రెస్ మీటింగ్‌లో తిట్ల పురాణం తప్ప.. ఇచ్చింది ఏమీ లేదన్నారు. కేసీఆర్ కలుపు మొక్క అని రేవంత్ అనడంపై స్పందించిన హరీష్ రావు.. కేసీఆర్ తెలంగాణకు కల్ప వృక్షం అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ మాటల్లో శబ్ధం ఎక్కువ.. విషయం తక్కువ.. విషం ఎక్కువ అంటూ తనదైన శైలిలో హరీష్ రావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వడ్లు కొనడం కూడా చేతకావడం లేదని విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెబితే.. సివిల్ సప్లై కమిషనర్ 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పారని.. కానీ, ఇప్పటికీ 20 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేశారని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ చర్యల కారణంగా రైతులు తాము పండించిన పంటను దళారులకు అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. 100 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
Also Read:
కోహ్లీ కొట్లాట.. విరాట్ తిక్కకు ఓ లెక్కుంది
కేసీఆర్, కేటీఆర్ లను టచ్ చేస్తే..
గుంటూరు మేయర్‌పై హైకోర్టు ఆగ్రహం.. ఇదేం భాష?
For More Telangana News and Telugu News..
Updated Date - Nov 20 , 2024 | 06:46 PM