ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gandipet Lake: బడా భవనాలపైకి బుల్డోజర్‌..

ABN, Publish Date - Aug 19 , 2024 | 02:51 AM

చెరువులను చెరబట్టి.. నిబంధనలను అతిక్రమించి కట్టిన నిర్మాణాల పైకి బుల్డోజర్‌ వెళ్తోంది..! ఎవరు అడ్డుపడినా ఆగకుండా దూకుడు పెంచుతోంది..!

  • హైదరాబాద్‌లో హైడ్రా హల్‌చల్‌

  • గండిపేట ఎఫ్‌టీఎల్‌లోని నిర్మాణాల కూల్చివేత

  • మొత్తం 20కి పైగా భవనాలు, ప్రహారీ గోడలు నేలమట్టం

  • కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తలవి కూడా

  • అర్ధరాత్రి యంత్రాలు.. తెల్లవారుజామున రంగంలోకి

  • వ్యూహాత్మకంగా వ్యవహరించిన హైడ్రా అధికారులు

  • వాగ్వాదానికి దిగిన నిర్మాణదారులు అదుపులోకి!

  • భూములు విక్రయించిన నాయకుల ఫోన్లు స్విచ్ఛాఫ్‌

  • ఒకటి రెండు రోజుల్లో మరిన్ని కూల్చివేతలు

  • హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలపై దృష్టి

హైదరాబాద్‌ సిటీ/నార్సింగ్‌, మొయినాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): చెరువులను చెరబట్టి.. నిబంధనలను అతిక్రమించి కట్టిన నిర్మాణాల పైకి బుల్డోజర్‌ వెళ్తోంది..! ఎవరు అడ్డుపడినా ఆగకుండా దూకుడు పెంచుతోంది..! ఉల్లంఘనలపై ఉప్పందితే చాలు.. మొత్తం వివరాలను తవ్వి తీస్తోంది..! నిజానిజాలను నిర్ధారించుకుని నేరుగా రంగంలోకి దిగుతోంది..! హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) అక్రమార్కుల్లో దడ పుట్టిస్తోంది. గండిపేట చెరువు పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం (ఎఫ్‌టీఎల్‌)లో వెలసిన నిర్మాణాలపై ఆదివారం కన్నెర్ర జేసింది.


జంట నగరాలకు తాగునీటి వనరైన గండిపేట (ఉస్మాన్‌ సాగర్‌) ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. 20కి పైగా భవనాలు, ప్రహరీ గోడలను యంత్రాలతో కూల్చివేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులకు చెందిన భవనాలు ఉండడం గమనార్హం. గండిపేట పరిసర ప్రాంతాల్లో ఈ స్థాయిలో కూల్చివేతలు ఇదే ప్రథమమని స్థానికులు చెబుతున్నారు. కాగా, గండిపేట మండలం ఖానాపూర్‌ గ్రామ పరిధిలోని పలు సర్వే నంబర్లలో కొందరు భవనాలు నిర్మించారు. వాణిజ్య సముదాయాలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, స్పా, ఇతర అవసరాలకు వాటిని వినియోగిస్తున్నారు.


ఇవన్నీ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయని.. ఓ సామాజిక కార్యకర్త నుంచి ఫిర్యాదు అందింది. దీనిపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవనాలు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని నిర్ధారించుకుని చర్యలకు శ్రీకారం చుట్టారు. వ్యూహాత్మకంగా శనివారం అర్ధరాత్రే యంత్రాలతో సహా సిబ్బందిని తరలించారు. ఆదివారం తెల్లవారుజామునే కూల్చివేత మొదలుపెట్టారు. నార్సింగ్‌ పట్టణ ప్రణాళికా విభాగం, సాగునీటి, జల మండలి అధికారులు వీరి వెంట ఉన్నారు. గండిపేట ఎఫ్‌టీఎల్‌లో ఉన్న మరిన్ని నిర్మాణాలపై ఒకటి, రెండు రోజుల్లో చర్యలు ఉంటాయని హైడ్రా వర్గాలు పేర్కొన్నాయి.


  • ఆక్రమించి.. క్రికెట్‌ మైదానం..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు, అప్పోజిగూడ పంచాయతీలలో కొన్నేళ్ల కిత్రం వెస్ట్‌సైడ్‌ పేరిట భారీ వెంచర్‌ వేశారు. ఇక్కడ ప్లాట్లు కొన్న కొంతమంది 500, 1000 గజాల్లో రెండు, మూడు అంతస్తుల్లో పెద్ద భవనాలు నిర్మించారు. ఈ వెంచర్‌లో కొంతభాగం గండిపేట ఎఫ్‌టీఎల్‌లో ఉంది. వారం రోజులుగా ఈ ప్రాంతాన్ని హైడ్రా అధికారులు పరిశీలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య వెస్ట్‌సైడ్‌ వెంచర్‌లో కూల్చివేతలు ప్రారంభించారు. కాగా, దీనిపక్కనే కొందరు చెరువు ఎఫ్‌టీఎల్‌ను కొంత ఆక్రమించి ఏకంగా క్రికెట్‌ మైదానం నిర్మించారు. దీన్ని సైతం ద్వంసం చేశారు. అప్పోజిగూడ పంచాయతీలోకి వచ్చే మూడు భవనాలు, చిలుకూరు పరిధిలోని ఒక భవనాన్ని నేలమట్టం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూల్చివేతలు చేపట్టారు.


  • మట్టి పోసి.. ఎత్తు పెంచి

గండిపేట జలాశయం ఎఫ్‌టీఎల్‌ సముద్ర పట్టానికి 1,790 అడుగుల ఎత్తున ఉంటుందని ప్రభుత్వ విభాగాలు గతంలో నిర్ధారించాయి. దీనికి సంబంధించి జలమండలి కూడా ప్రాథమిక నోటిఫికేషన్‌ ప్రకటించింది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఉండదు. కానీ, కొందరు ప్రముఖులు ‘ఎత్తులు’ వేశారు. ఎఫ్‌టీఎల్‌లో భూములు/ప్లాట్లను వ్యర్థాలతో నింపారు. 1,780 అడుగుల ఎత్తులో ఉన్న స్థలంలో 15 అడుగుల మేర వ్యర్థాలు పోశారు.


ప్లాట్‌ 1,795 అడుగుల ఎత్తులో ఉన్నట్లు చూపి యథేచ్ఛగా భవనాలు నిర్మించారు. వీరికి స్థానిక మునిసిపల్‌, సాగు నీటి శాఖ అధికారుల్లో కొందరు సహకరించినట్లు గుర్తించారు. ఆదివారం కూల్చివేసినవాటిలో అత్యధిక భవనాల విషయంలో ఇదే జరిగిందని అధికారులు చెబుతున్నారు. గండిపేట జలాశయంలో నీటి మట్టం పెరిగితే ఈ భవనాల చుట్టూ నీరు చేరుతోంది. కాగా, ఇక్కడి భవనాల పక్కనున్న స్థలం ఎత్తును పరిశీలించిన అధికారులు.. వ్యర్థాలు డంప్‌ చేసి నిర్మాణాల స్థలం ఎత్తును పెంచినట్లుగా నిర్ధారించుకున్నారు.


  • గప్‌చు్‌పగా వెళ్లి..

అక్రమ నిర్మాణాల పని పట్టే విషయంలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూల్చివేతలు ఎక్కడ చేపట్టనున్నారనే సమాచారం గోప్యంగా ఉంచడంతో పాటు.. ఎలాంటి అడ్డంకులు లేకుండా స్థానిక పోలీసుల సహకారం తీసుకున్నారు. అయితే, ఆదివారం కూల్చివేతల సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. భవనాలకు చెందిన కొందరు వ్యక్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమవద్ద రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఉన్నాయని, ప్రైవేట్‌ స్థలాల్లో నిర్మాణాలను ఎలా తొలగిస్తారని నిలదీశారు. ఇలాంటివి ఎదురవుతాయని భావించిన హైడ్రా అధికారులు పోలీసుల సాయం కోరారు. వాగ్వాదానికి దిగుతున్నవారిని సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేతల పరిసరాల్లోకి స్థానికులు, నాయకులతో పాటు మీడియాను కూడా అనుమతించలేదు.


  • పదిహేనేళ్ల కిందట పంచాయతీగా ఉన్నప్పుడు

2009లో గండిపేట గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో మహిళా సర్పంచ్‌ ఒకరు ఎఫ్‌టీఎల్‌లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఆ సర్పంచ్‌ ఇప్పటికీ పాత తేదీలతో భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని, దీనిపై చర్య తీసుకుంటామని రంగనాథ్‌ తెలిపారు. ప్రస్తుత నిర్మాణాలకు పాత తేదీలతో జారీ చేసిన అనుమతులు చెల్లవన్నారు. అక్రమ నిర్మాణాల కారణంగా గండిపేట చెరువులోకి వ్యర్థాలు చేరి నీరు కలుషితం అవుతోందని, ఈ మంచి నీటి చెరువును కాపాడాల్సిన అవసరం ఉందని ప్రజల ందరిపైనా ఉందని పేర్కొన్నారు.


  • ప్రభుత్వంలోని పెద్దలకు ఫోన్లు

గండిపేటలో కూల్చివేతల సమయంలో కొందరు ప్రభుత్వంలోని పెద్దలకు ఫోన్లు చేశారు. కల్పించుకునేందుకు వారు నిరాకరించారు. ఇక కొందరు నిర్మాణదారులు నాయకులకు ఫోన్లు చేసి.. ‘‘మీరు చెబితే ఇక్కడ స్థలాలు కొన్నాం. భవనాలు నిర్మించాం. ఇప్పుడు పడగొడతాం అంటున్నారు. సాయం చేయండి’’ అని కోరారు. ఆ నాయకులు స్పందించకపోగా ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో తమకు భూములు విక్రయించి రూ.కోట్లు సంపాదించిన నాయకులంతా మొహంచాటేయడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


  • గత సర్కారు హయాంలో..

ఖానాపూర్‌ గ్రామంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. జలాశయం ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌తో పాటు ఎగువ నుంచి వరద వచ్చే కాలువలకు అడ్డంగా భవనాలు వెలిశాయి. గండిపేట జలాశయం పరివాహక ప్రాంతం రక్షణకు ఉద్దేశించిన జీవో- 111 పరిధిలో ఖానాపూర్‌తో పాటు వట్టినాగులపల్లి కూడా ఉంది. ఈ రెండు గ్రామాలు గండిపేట మండలంలోకి, మిగతావన్నీ శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మండల పరిధిలోకి వస్తాయి. త్వరలో వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని మున్సిపల్‌ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Aug 19 , 2024 | 07:11 AM

Advertising
Advertising
<