CAT: ఇంట్లో కూర్చొనే పని చేస్తారా?
ABN, Publish Date - Oct 16 , 2024 | 03:45 AM
క్యాడర్ వివాదంలో ఉన్న ఏడుగురు ఐఏఎ్‌సలకు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
సరిహద్దుల్లో సమస్యలు వస్తే వెళ్లరా?
విజయవాడ వరదలు వంటి
ఘటనల్లో బాధితులకు సేవ చేయరా?
నేడు ఎక్కడివారు అక్కడికి వెళ్లాల్సిందే
డీవోపీటీ ఉత్తర్వులపై స్టే ఇవ్వం
కేంద్రం కౌంటర్ దాఖలు చేయాలి: క్యాట్
క్యాడర్ అంశంలో ఐఏఎస్‌లకు ఎదురుదెబ్బ
క్యాట్ తీర్పుపై నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): క్యాడర్ వివాదంలో ఉన్న ఏడుగురు ఐఏఎ్‌సలకు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా జరిగిన క్యాడర్ కేటాయింపులకు విరుద్ధంగా తెలంగాణ, ఏపీలో పనిచేస్తున్న ఏడుగురు ఐఏఎ్‌సలు వాకాటి కరుణ, ఆమ్రపాలి కాట, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ (తెలంగాణ); సి.హరికిరణ్, లోతేటి శివశంకర్, జి.సృజన(ఏపీ) తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లిపోవాలని క్యాట్ స్పష్టం చేసింది. ఐఏఎస్ అధికారులు ఇళ్లలోనే కూర్చొని సేవ చేస్తామంటే కుదరదని వ్యాఖ్యానించింది. ఈ నెల 16న ఎక్కడి అధికారులు అక్కడికి వెళ్లిపోవాలంటూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి క్యాట్ నిరాకరించింది.
ఈ ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎ్‌సలు ఏపీకి.. ఏపీలో పనిచేస్తున్న వారు తెలంగాణకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తాము ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడే ఉంటామని.. డీవోపీటీ ఇచ్చిన ఆర్డర్‌ను కొట్టేయాలని పేర్కొంటూ ఏడుగురు ఐఏఎ్‌సలు హైదరాబాద్ క్యాట్‌లో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై లత బస్వరాజ్ పాట్నే, శాలినీ మిశ్రా బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ఐఏఎ్‌సల తరఫున సీనియర్ న్యాయవాదులు జి.విద్యాసాగర్, కేఆర్‌కేవీ ప్రసాద్, వి.మల్లిక్, కె.లక్ష్మీనర్సింహ తదితరులు వాదనలు వినిపించారు. క్యాడర్ విభజన కోసం 2014లో ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ సీనియారిటీని నిర్ణయించకుండానే విభజన చేయడం వల్ల సీనియారిటీకి విరుద్ధంగా ఏపీకి కేటాయించారని.. ఈ కేటాయింపు చెల్లదని, తెలంగాణలోనే ఉండేలా ఆదేశాలివ్వాలని రోనాల్డ్ రోస్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా డీవోపీటీ వ్యవహరించిందని.. వ్యక్తిగతంగా వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వలేదని, ఏకసభ్య కమిటీ రిపోర్ట్ తమకు అందజేయలేదని వాకాటి కరుణ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తెలంగాణ స్థానికత ఉన్నా ఏపీకి కేటాయించడం అక్రమమన్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వచ్చిన అన్ రిజర్వుడు కోటా ఐఏఎ్‌సలకు పరస్పర అంగీకారంతో బదిలీ(స్వాపింగ్) అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని ఆమ్రపాలి తరఫు న్యాయవాది తెలిపారు.
పుట్టినప్పటి నుంచి ఉన్నత విద్య వరకు తాను తెలంగాణలోనే ఉన్నప్పటికీ తన పేరును ఏపీ స్థానికత జాబితాలో పెట్టడం చెల్లదని వాణీప్రసాద్ న్యాయవాది వాదించారు. తాము ఏపీకి చెందిన వారమని, తమ స్థానికతను తప్పుగా చూపారని సృజన, శివశంకర్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. తాను ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అయినా జనరల్ కోటాలో ఎంపికయ్యానని, ఎస్టీ కోటాలో చూపడం చెల్లదని హరికిరణ్ న్యాయవాది పేర్కొన్నారు. డీవోపీటీ ఉత్తర్వులను కొట్టేయడంతోపాటు 16న రిపోర్ట్ చేయాలన్న ఆదేశాలపై తక్షణం స్టే ఇవ్వాలని కోరారు. డీవోపీటీ తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాల ప్రకారమే ఐఏఎస్ అధికారుల రిప్రజెంటేషన్లపై చట్టబద్ధంగా అన్ని అంశాలు విచారించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఏకసభ్య కమిటీని నియమించి రిపోర్ట్ సైతం తీసుకున్నామన్నారు. ప్రస్తుతానికి ఆ రిపోర్ట్ అందుబాటులో లేదని, దాంతోపాటు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.
వాదనలు నమోదు చేసుకున్న బెంచ్.. ఐఏఎ్‌సల తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. ‘‘ఐఏఎస్ అధికారులు ఇళ్లలోనే కూర్చొని సేవ చేస్తామంటే కుదరదు. సరిహద్దుల్లో సమస్యలు వస్తే అక్కడికి వెళ్లి పనిచేయరా? విజయవాడ వంటి ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి చోట్లకు వెళ్లి ప్రజలకు సేవ చేయాలని లేదా? ఎక్కడికీ కదలబోమంటే కుదరదు. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు దేశం కోసం పనిచేయరా? ఈ పిటిషన్లన్నీ మేము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయి. ముందు ఏ రాష్ట్రం వాళ్లు అక్కడ రిపోర్ట్ చేయండి. తర్వాత తుది విచారణ చేపడతాం. స్థానికత, స్వాపింగ్, ఇతర అన్ని అంశాలతో కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి. ఈ పిటిషన్లను అడ్మిట్ చేసుకున్నాం. కేంద్రానికి నోటీసులు ఇస్తున్నాం’’ అని పేర్కొంది.
క్యాట్ తీర్పుపై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు
క్యాడర్ వివాదంలో ఉన్న ఐఏఎస్ అధికారులు గురువారం తమ తమ రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని డీవోపీటీ స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొంది. మంగళవారం క్యాట్‌లో సైతం ఎలాంటి ఊరట లభించకపోవడంతో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే క్యాట్ తీర్పుపై హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో అత్యవసరంగా పిటిషన్‌లు దాఖలు చేస్తామని ఐఏఎస్ అధికారులు పేర్కొన్నారు. హైకోర్టులో వెలువడే తీర్పు ఆధారంగా.. ఆయా రాష్ట్రాల్లో రిపోర్ట్ చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. క్యాట్ తీర్పు అంశాన్ని పలువురు ఐఏఎ్‌సలు తెలంగాణ సీఎస్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ఏంచేయాలనేదానిపై చర్చలు జరిపినట్లు తెలిసింది.
Updated Date - Oct 16 , 2024 | 03:45 AM