రానివ్వొద్దని హెచ్చరించినా..
ABN, Publish Date - Dec 17 , 2024 | 05:26 AM
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షోకి ఎలాంటి సెలబ్రిటీలనూ అనుమతించొద్దని.. వారు వస్తే అభిమానులను, జనాన్ని నియంత్రించడం కష్టమవుతుందని పేర్కొంటూ చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యానికి రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బెనిఫిట్ షోకి సెలబ్రిటీల రాకపై సంధ్య థియేటర్ వారికి పోలీసుల సూచన
అనుమతి కోసం రాసిన లేఖ వెనుకే హెచ్చరిక..పట్టించుకోని యాజమాన్యం
ఆలస్యంగా వెలుగులోకి పోలీసుల లేఖ
హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షోకి ఎలాంటి సెలబ్రిటీలనూ అనుమతించొద్దని.. వారు వస్తే అభిమానులను, జనాన్ని నియంత్రించడం కష్టమవుతుందని పేర్కొంటూ చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యానికి రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెనిఫిట్ షోకి అనుమతి కోరుతూ థియేటర్ యాజమాన్యం ఇచ్చిన వినతిపత్రం వెనుకనే పోలీసులు ఈ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. వారు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది! పోలీసుల హెచ్చరికను థియేటర్ యాజమాన్యం పెడచెవిన పెట్టడం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగి.. ఒక మహిళ ప్రాణం పోయిందనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాగా.. ఈ లేఖ ఆధారంగానే నాంపల్లి న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించడంతో 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అల్లు అర్జున్‌కు 14 రోజులు రిమాండ్ విధించినట్టు తెలిసింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు.. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
తొక్కిసలాట జరగడానికి అల్లు ఆర్జున్ కారణం కాదని, ప్రీమియర్ షోకు వస్తున్నట్లు పోలీసులకు ముందుగానే థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారని, అయినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన తరఫు లాయర్లు వాదించారు. అయితే.. పోలీసులు రాసిన లేఖ ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) వారి వాదనలను తిప్పికొట్టినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. థియేటర్ యాజమాన్యం సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించారని, ప్రీమియర్ షోకు రావొద్దంటూ హీరో, హీరోయిన్లకు, నిర్మాతకు, యూనిట్‌కు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారని పీపీ కోర్టుకు తెలిపారు. అది రద్దీ ప్రాంతం కావడం.. రెండు థియేటర్లు (సంధ్య 70ఎంఎం, సంధ్య 35 ఎంఎం) పక్క పక్కనే ఉండడం.. రోడ్డుమీద రెస్టారెంట్లు ఉండటం వల్ల అభిమానులను నియత్రించడం కష్టమవుతుందని హెచ్చరించారని ఆయన వివరించారు. ఈమేరకు చిక్కడపల్లి పోలీసులు రాసిన లేఖను న్యాయమూర్తికి అందజేశారు. ముందే హెచ్చరించినా థియేటర్ యాజమాన్యం, సినిమా హీరో అల్లుఅర్జున్ బాధ్యతారహితంగా వ్యవహరించారని తెలిపారు. పీపీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి అల్లు అర్జున్‌కు 14 రోజులు రిమాండు విధించారు. హైకోర్టులో సైతం ఇవే వాదనలు వినిపించినా.. మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు.
Updated Date - Dec 17 , 2024 | 05:26 AM