Palm Oil: పామాయిల్ రైతులకు ఊరట
ABN, Publish Date - Sep 15 , 2024 | 04:12 AM
పామాయిల్ రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పంట పండించే రైతులకు ఊరట కలిగిస్తూ.. ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
దిగుమతి సుంకాన్ని 27.5 శాతానికి పెంచిన కేంద్రం
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి తుమ్మల
హైదరాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పామాయిల్ రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పంట పండించే రైతులకు ఊరట కలిగిస్తూ.. ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి 27.5శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగం తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. దిగుమతి సుంకం పెంపు వలన పామాయిల్ పండించే రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.14,392గా ఉండగా.. అది టన్నుకు రూ.1,500 నుంచి రూ.1,700 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉన్నదని, వెరసి మొత్తంగా ఒక్కో ఆయిల్ పామ్ గెల ధర రూ.16,500గా పెరిగే అవకాశం ఉన్నదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 44,400 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుంచి 2.80 లక్షల టన్నుల ఆయిల్‌పామ్ గెలలు దిగుబడి వస్తున్నదని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో తెలంగాణలో పామాయిల్ సాగును పెద్ద ఎత్తున చేపట్టడానికి అవకాశాలు మరింత మెరుగుపడ్డాయన్నారు. రైతులు పామాయిల్ సాగు విరివిగా చేపట్టాలని తుమ్మల పిలుపునిచ్చారు. కాగా ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడం వలన ఆయిల్ పామ్ గెలల ధర తగ్గడంతో రైతుల్లో నిరాశ నెలకొందని, ఈ పంట సాగు చేయాలనుకున్నవారిపై ప్రతికూల ప్రభావం చూపిందని ఇటీవల మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖ రాశారు.
ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు అధిక ధరలు అందేలా చర్యలు తీససుకోవడంతో పాటు, దిగుమతి చేసుకుంటున్న ముడి పామాయిల్‌పై సుంకాన్ని పెంచాలని ఆ లేఖలో కోరారు. అదే విధంగా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌తోనూ తుమ్మల ప్రత్యేకంగా మాట్లాడారు. స్పందించిన కేంద్రం తాజాగా సుంకాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Updated Date - Sep 15 , 2024 | 08:08 AM