Hyderabad: మళ్లీ కోతలు ..
ABN, Publish Date - May 27 , 2024 | 04:12 AM
రాష్ట్రంలో కడుపు కోతలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించే ప్రతీ వంద డెలివరీల్లో 75 సిజేరియన్లే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మొత్తం ప్రసవాల్లో 46.4 శాతం కడుపుకోతలే ఉండటం గమనార్హం.
రాష్ట్రంలో పెరుగుతున్న సిజేరియన్లు
ప్రైవేటు ఆస్పత్రుల్లో 75ు ప్రసవాలు అవే
సర్కారు దవాఖానల్లో 46.4 శాతం
అగ్రస్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా
నిరుటితో పోలిస్తే పెరిగిన ఆపరేషన్లు
వైద్యశాఖ తాజా నివేదికలో వెల్లడి
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కడుపు కోతలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించే ప్రతీ వంద డెలివరీల్లో 75 సిజేరియన్లే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మొత్తం ప్రసవాల్లో 46.4 శాతం కడుపుకోతలే ఉండటం గమనార్హం. మార్చి నెలలో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన డెలివరీలపై సర్కారుకు వైద్యశాఖ ఇటీవలే ఓ నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం ఆ నెలలో జరిగిన మొత్తం ప్రసవాల్లో 57ు సీ సెక్షన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ వంద కాన్పుల్లో సిజేరియన్లు 21 ఉండగా, భారత్‌లో అది 23.29గా ఉంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సిజేరియన్ డెలివరీలు సగటున 28.5 శాతానికి పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
కానీ మనదగ్గర ఇప్పుడే దానికి రెట్టింపు స్థాయిలో కడుపుకోతలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సిజేరియన్ ప్రసవాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. కాగా, గతేడాది వరకు సర్కారీ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 66.8 శాతం ఉండగా... ఇప్పుడవి 54 శాతానికి తగ్గాయి. దాదాపు 12 శాతం మేరకు నార్మల్ డెలివరీలు తగ్గి సిజేరియన్లు పెరిగాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇక ప్రైవేటులో సాధారణ ప్రసవాలు గతేడాది వరకు 33-34 శాతం మధ్య ఉండగా... ప్రస్తుతం అవి 25 శాతానికి పడిపోయి, ఏకంగా 75 శాతం డెలివరీలు సిజేరియన్లే అవుతున్నాయి.
ప్రతీ గంటకు 29 సిజేరియన్ ఆపరేషన్లు
రాష్ట్రంలో ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలపి మొత్తం 39,188 ప్రసవాలు జరిగాయి. ఇందులో 22,046 డెలివరీలు సిజేరియన్లు. ఈ లెక్కన ప్రతీ గంటకు 29, రోజుకు సగటున 711 కడుపుకోతలు జరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ ప్రసవాలు కేవలం 43.75 శాతంగా నమోదయ్యాయి. అత్యధిక సిజేరియన్లు జరిగిన జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలిచింది. అక్కడ ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రతీ వంద డెలివరీల్లో 93.5 శాతం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 73.2 శాతం సీ-సెక్షన్స్ జరిగాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యల్పంగా సీ సెక్షన్స్ మేడ్చల్ జిల్లాల్లో జరుగుతున్నాయి. అక్కడ 51 శాతమే నమోదయ్యాయి.
మహబూబాబాద్ జిల్లాలో ప్రైవేటులో 91.6 శాతం, సర్కారీలో 62 శాతం సిజేరియన్స్ జరుగుతున్నాయి. 90 శాతం సీ సెక్షన్స్‌తో నిర్మల్ జిల్లా మూడోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ప్రైవేటు దవాఖానాల్లో సగటున అన్ని జిల్లాల్లో సీ సెక్షన్స్ 75 శాతం జరుగుతున్నాయి. 80 శాతానికిపైగా సిజేరియన్లు జరుగుతున్న జిల్లాలా జాబితాలో పెద్దపల్లి (89), వరంగల్, జనగాం (87), వికారాబాద్, మంచిర్యాల, జగిత్యాల (86), ఆదిలాబాద్, కామారెడ్డి (85), సిద్దిపేట (84), మెదక్, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, హన్మకొండ (83), ఖమ్మం (80)ఉన్నాయి. సుమారుగా సగం జిల్లాల్లో 80 శాతానికిపైగా కడుపుకోతలు జరుగుతుండం ఆందోళనకర అంశమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో 50 శాతానికిపైగా సిజేరియన్లు జరుగుతున్న జిల్లాల జాబితాలో నాగర్‌కర్నూల్ (50), కరీంనగర్ (69), సిద్దిపేట, వరంగల్ (57), మంచిర్యాల (60), జగిత్యాల, హన్మకొండ (67), జయశంకర్ భూపాలపల్లి (59), కామారెడ్డి, నల్గొండ (51), పెద్దపల్లి (67), ఖమ్మం (53) యాదాద్రి భువనగిరి (55), నిర్మల్ (65), నిజామాబాద్ (54), మహబూబాబాద్, జనగాం (62) జిల్లాలున్నాయి.
డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం 15 శాతమే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల మేరకు సీసెక్షన్ ప్రసవాలు ప్రతీ వందకు 10-15 మాత్రమే ఉండాలి. 1990లో ప్రపంచవ్యాప్తంగా సగటు సీ సెక్షన్ రేటు 7 శాతం ఉండగా, 2030 నాటికి అది 28.5 శాతానికి పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఆఫ్రికాలో 9.2 శాతం, ఆసియాలో 23.1 శాతం, యూర్‌పలో 25.7 శాతం, అమెరికాలో 39.3 శాతం కడుపుకోతలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Updated Date - May 27 , 2024 | 04:12 AM