ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

chaderghat: గంజాయి కేసు బనాయించి హింసించారు!

ABN, Publish Date - Jul 03 , 2024 | 03:36 AM

గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం (టీఎస్‌ న్యాబ్‌) పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తనను చితకబాది అక్రమ కేసు బనాయించారని...

  • మా కుటుంబంపై ఓ కానిస్టేబుల్‌ కక్ష సాధింపునకు ‘టీఎస్‌ న్యాబ్‌’ అండ

  • హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయకుండా నా కుటుంబ సభ్యులను నిర్బంధించారు

  • టీఎస్‌ న్యాబ్‌, లంగర్‌హౌజ్‌ ఇన్‌స్పెక్టర్‌పై న్యాయ విచారణకు బాధితుడి విజ్ఞప్తి

చాదర్‌ఘాట్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం (టీఎస్‌ న్యాబ్‌) పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తనను చితకబాది అక్రమ కేసు బనాయించారని వంకడోతు వీరన్న అనే వ్యాపారి ఆరోపించారు. సినీ ఫక్కీలో సాగిన ఈ కేసులో టీఎస్‌ న్యాబ్‌ పోలీసులతో పాటు లంగర్‌హౌజ్‌ ఇన్‌స్పెక్టర్‌, కీలక పాత్రధారుడైన కానిస్టేబుల్‌పై న్యాయ విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డీజీపీ, ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేశారు. మంగళవారం మలక్‌పేటలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్‌ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వీరన్న వివరాలు తెలిపారు.

‘మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం అపూర్‌ గ్రామానికి చెందిన మా కుటుంబానికి, టీఎస్‌ న్యాబ్‌ కానిస్టేబుల్‌ అయిన తమ బంధువు భూక్య రాజేందర్‌తో పాత తగాదాలు ఉన్నాయి. నాపై కక్ష కట్టిన రాజేందర్‌ గంజాయి కేసు మోపి జైలు పాలుచేస్తానని బెదిరించేవాడు. మొదట్లో నేను అంతగా పట్టించుకోలేదు. రాజేందర్‌ టీఎస్‌ న్యాబ్‌, లంగర్‌హౌస్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అండతో నా మొబైల్‌ ఫోన్‌ను ట్రాక్‌ చేసి, గత ఏడాది ఆగస్టు 9న నేను కారులో డ్రైవర్‌తో కలిసి వస్తుండగా ఓఆర్‌ఆర్‌ ఘట్‌కేసర్‌ టోల్‌గేట్‌-9 వద్ద అడ్డుకున్నారు. కారు ఆపగానే పోలీసులు నన్ను అదుపులోకి తీసుకుని చితకబాదారు.

చిత్రహింసలు పెట్టారు. నా కుటుంబ సభ్యులు ఆరుగురిపై తప్పుడు కేసులు నమోదు చేశారు. ఎవరికైనా చెబితే ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరించార’ని వీరన్న కంటతడి పెట్టుకున్నారు. తన కారు నంబర్‌ ప్లేట్‌ తొలగించి అత్తాపూర్‌కు వచ్చిన తర్వాత తిరిగి బిగించారని తెలిపారు. అత్తాపూర్‌లో కారును చుట్టుముట్టి పట్టుకున్నట్లు మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేస్తూ.. కారులో గంజాయి తరలిస్తున్నట్టు టీఎస్‌ న్యాబ్‌, లంగర్‌హౌస్‌ పోలీసులు సీన్‌ సృష్టించారని చెప్పారు. తన భూమి కొనుగోలుదారుడి వద్దకు వెళ్లి రూ.33 లక్షలు వసూలు చేశారని పేర్కొన్నారు. తాను, తన కుటుంబ సభ్యులు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుని గౌరవంగా బతుకుతున్నామని, పాత కక్షలతో తమ కుటుంబాన్ని వేధించారన్నారు.

తనను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు తన కుటుంబ సభ్యులు కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయకుండా నిర్బంధంలో ఉంచి బెదిరించారని తెలిపారు. 10 నెలలుగా పోలీసుల వేధింపులతో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నామని విలపించారు. కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆరు నెలల రిమాండ్‌ తర్వాత విడుదల అయ్యానని తెలిపారు. అయినా పోలీసుల బెదిరింపులు ఆగడం లేదన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించి న్యాయ విచారణ చేపడితే టీఎస్‌ న్యాబ్‌ తనలాంటి వ్యక్తులపై బనాయించిన అక్రమ కేసులు వెలుగుచూస్తాయన్నారు.

Updated Date - Jul 03 , 2024 | 03:37 AM

Advertising
Advertising