ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘గ్రేటర్‌’లో అసెంబ్లీ సీట్లు డబుల్‌!

ABN, Publish Date - Oct 30 , 2024 | 04:46 AM

దేశవ్యాప్తంగా జనగణనను 2025 మొదట్లో ప్రారంభించి.. 2026లో పూర్తిచేసి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారు.

  • 24 నుంచి 50కు చేరే చాన్స్‌.. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే సీట్లు తక్కువే

  • నియోజకవర్గాల పునర్విభజనకు అడుగులు

  • మొత్తం సీట్లలో మహిళలకు మూడో వంతు!

  • 2025-26లో దేశవ్యాప్తంగా జనగణన

హైదరాబాద్‌, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా జనగణనను 2025 మొదట్లో ప్రారంభించి.. 2026లో పూర్తిచేసి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు రాష్ట్రంలో అడుగులు పడుతున్నాయి. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 26(1) ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలనే అంశం పొందుపరిచారు. అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలయ్యే ప్రక్రియలో ముందుకు సాగనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 153కు పెరగనుంది. అంటే కొత్తగా 34 అసెంబ్లీ స్థానాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలు ఉండగా మరో 26 పెరిగి 50కు చేరే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నగర జనాభా అసాధారణ స్థాయిలో పెరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను జనాభా ప్రాతిపదికన చేపడుతుండటంతో రాష్ట్రంలో పెరిగే 34 సీట్లలో 26 సీట్లు గ్రేటర్‌లోనే పెరగనున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాలకు వస్తే సగటున ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున 8 సీట్లు పెరిగే అవకాశాలున్నాయి.

  • రాష్ట్రంలో మహిళలకు 50 సీట్లు?

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ల చట్టం కూడా అమలుచేసి 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించనున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు గత ఏడాది పార్లమెంటు ఆమోదముద్ర వేయటంతో చట్టంగా మారింది. ఈ బిల్లు ఆమోదించిన తర్వాత జరిగే జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని చట్టం చెబుతోంది. అసెంబ్లీ సీట్లు 153కు పెరిగితే ఇందులో 50 సీట్ల దాకా మహిళల కోటాకింద వచ్చే అవకాశాలున్నాయి.


  • లోక్‌సభ సీట్ల పెంపుపై వివాదం

పార్లమెంటు స్థానాల సంఖ్యను పెంచటం మాత్రం 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రాతిపదికన చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడు జనగణన 2025-26లోనే పూర్తవుతుంది. దీంతో ఈ జనగణననే పరిగణనలోకి తీసుకొని పార్లమెంటు స్థానాలు పెంచేలా మరో రాజ్యాంగ సవరణ అవసరం కావొచ్చని నియోజకవర్గాల పునర్విభజన నిపుణుడు ఇనగంటి రవికుమార్‌ తెలిపారు. ప్రస్తుత లోక్‌సభలో 545 సీట్లు ఉండగా పునర్విభజన తర్వాత 888కి పెంచుతామని ఎన్‌డీఏ ప్రభుత్వం లోపాయికారీగా చెబుతోంది. దీన్ని 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. మరోవైపు లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే సీట్ల పెరుగుదల జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించటంతో జనాభా తక్కువగా ఉంది. ఈ విషయంలో ఉత్తరాది రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో అక్కడ జనాభా పెరిగింది. ఇప్పుడు లోక్‌సభ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయి. దీంతో దక్షిణాది నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - Oct 30 , 2024 | 04:47 AM