Harish Rao: ఐదు రోజులుగా శ్రీ తేజకు జ్వరం
ABN, Publish Date - Dec 27 , 2024 | 03:54 AM
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ ఐదు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని వైద్యులు తెలిపారు.
బాలుడి ఆరోగ్య వివరాలను తెలిపిన కిమ్స్ వైద్యులు
పార్టీ నేతలతో కలసి హరీశ్‌రావు పరామర్శ..
హైదరాబాద్ సిటీ/బోయిన్‌పల్లి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ ఐదు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని వైద్యులు తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై గురువారం కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. జ్వరం మినహా బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వెంటిలేటర్ సాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నాడని వారు వివరించారు. శ్రీతేజ నాడి సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నాడని వైద్యులు తెలిపారు.
పది రోజులకు సీఎం స్పందించారు: హరీశ్
సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజను హరీశ్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ నేతల బృందం పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పింది. శ్రీతేజ కోలుకుని మళ్లీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నామని హరీశ్ అన్నారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్, ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించట్లేదని నిలదీశారు. సినీ పరిశ్రమతో ప్రభుత్వం చర్చల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసని, ప్రేమానురాగాలతో మనసులు గెలవాలి కానీ భయాందోళనలు సృష్టించి కాదని వ్యాఖ్యానించారు.
Updated Date - Dec 27 , 2024 | 03:54 AM