ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘మూసీ పునరుజ్జీవం’పై నేడు యాత్ర

ABN, Publish Date - Nov 08 , 2024 | 03:16 AM

మూసీ పునరుజ్జీవనంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధృఢసంకల్పంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళతామని వివిధ వేదికలపై స్పష్టంచేశారు.

  • పుట్టినరోజున సంగెం - మూసీ మధ్య 2.5 కి.మీ. సీఎం పాదయాత్ర

  • ప్రాజెక్టుపై ప్రజలకు వివరణ.. సంకల్ప రథం పైనుంచి ప్రసంగం

  • కుటుంబంతో యాదగిరిగుట్టలో పూజలు.. ఆలయ అభివృద్ధిపై సమీక్ష

హైదరాబాద్‌/యాదాద్రి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మూసీ పునరుజ్జీవనంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధృఢసంకల్పంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళతామని వివిధ వేదికలపై స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా మూసీ వెంట పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. దానికి ‘మూసీ పునరుజ్జీవన సంకల్ప యాత్ర’గా నామకరణం చేశారు. మూసీ నది కాలుష్యం కారణంగా పరీవాహక గ్రామాల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చేయబోయే పాదయాత్రలో మూసీ పరీవాహక ప్రజలు, రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు.

అసలు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఎందుకు చేపట్టాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే విషయాలను ప్రజలకు వివరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. సీఎం రేవంత్‌ శుక్రవారం ఉదయం 9 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు వెళతారు. ఉదయం 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఉదయం 11:30 గంటలకు వైటీడీఏ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి సంగెం దగ్గరకు చేరుకుంటారు. సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవ సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు.


మూసీ నది కుడి ఒడ్డున ఉన్న భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్లు, అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్‌కట్ట వెంబడి సంగెం-నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర చేసి, అక్కడ మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు. సాయంత్రానికి హైదరాబాద్‌ చేరుకుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. వలిగొండ మండలం సంగెం వద్ద భీమలింగానికి పూజలు నిర్వహించిన అనంతరం రేవంత్‌రెడ్డి పునరుజ్జీవ యాత్రను చేపడతారు.

ఈ మేరకు భీమలింగం వరకు దారిని ఏర్పాటు చేశారు. గురువారం మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎం.హనుమంత్‌రావు, రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు, అధికారులు సంగెం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజును రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలతో పాటు అన్ని ఆదర్శ పాఠశాలల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. దశాబ్దకాలం తర్వాత విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడానికి 40 శాతం మేర మెస్‌ చార్జీలు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.

Updated Date - Nov 08 , 2024 | 05:26 AM