ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Revanth Reddy : అలయ్‌ బలయ్‌తోనే రాజకీయ జేఏసీ

ABN, Publish Date - Oct 14 , 2024 | 03:56 AM

తెలంగాణ రాష్ట్ర సాధనకు ‘అలయ్‌ బలయ్‌’ స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన ఆలస్యమవుతోందని భావించిన తరుణంలో రాజకీయ జేఏసీ ఆవిర్భవించిందని.. దాని ఏర్పాటుకు స్ఫూర్తి అలయ్‌ బలయ్‌ కార్యక్రమమేనని చెప్పారు.

  • తెలంగాణ సాధనకు ఈ కార్యక్రమమే స్ఫూర్తి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

  • దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మికి అభినందనలు

  • సనాతన ధర్మంలో నేను ఉండదు.. మనం ఉంటుంది: వెంకయ్య

  • తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి పనిచేయాలి: దత్తాత్రేయ

  • రాజకీయాలంటే అసహ్యించుకునేలా విమర్శలు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

  • సీఎం సెక్యూరిటీ సిబ్బంది హత్యాయత్నం చేశారు: మాడభూషి శ్రీధర్‌

హైదరాబాద్‌/సిటీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనకు ‘అలయ్‌ బలయ్‌’ స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన ఆలస్యమవుతోందని భావించిన తరుణంలో రాజకీయ జేఏసీ ఆవిర్భవించిందని.. దాని ఏర్పాటుకు స్ఫూర్తి అలయ్‌ బలయ్‌ కార్యక్రమమేనని చెప్పారు. ఆ జేఏసీ ఫలితంగా ఆరెస్సెస్‌ నుంచి ఆర్‌ఎ్‌సయూ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్‌ వరకు.. అన్ని వర్గాలు కార్యోన్ముఖులయ్యాయని వివరించారు. తెలంగాణ ప్రజలకు అతిపెద్ద పండగ అయిన దసరా అనగానే పాలపిట్ట, జమ్మిచెట్టు గుర్తుకు వచ్చినట్లుగానే అలయ్‌ బలయ్‌ అనగానే బండారు దత్తాత్రేయ గుర్తుకొస్తారని చెప్పారు.

ఇలాంటి కార్యక్రమాలకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. అందుకే ప్రభుత్వం తరపున, కాంగ్రెస్‌ తరఫున తాను, మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారని రేవంత్‌ అన్నారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి రేవంత్‌ హాజరయ్యారు. అలయ్‌ బలయ్‌ నిర్వహణ కమిటీ చైర్‌పర్సన్‌, దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి అధ్యక్షతన కొనసాగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, మేఘాలయ గవర్నర్లు, వివిధ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ఉద్యమం సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించుకోగా.. దత్తాత్రేయ అలయ్‌ బలయ్‌తోనే జెండాలకు, అజెండాలకు అతీతంగా రాజకీయ జేఏసీ ఏర్పడిందని చెప్పారు. దత్తాత్రేయ వారసురాలిగా అలయ్‌ బలయ్‌ని నిర్వహిస్తున్న విజయలక్ష్మిని రేవంత్‌ అభినందించారు.


ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ మాట్లాడుతూ.. మన సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి ఎంతో ఉన్నతమైందని కొనియాడారు. సమాజంలో సమైక్యతా వారధుల నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా గుర్తించి, ఆ దిశగా కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పండగలకు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ప్రాముఖ్యత కూడా ఉందన్నారు. సనాతన ధర్మంలో నేను, నాది అన్నది లేదని.. మనది, మనందరిది అని ఉంటుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి మెలిసి పనిచేయాలని, రెండు రాష్ట్రాలను దేశంలో నంబర్‌ వన్‌గా నిలపాలని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆకాక్షించారు.

సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రేవంత్‌ ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముఖ్యమంత్రి కావడం గొప్ప విషయం అని ప్రశంసించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అలయ్‌ బలయ్‌ గొప్ప కార్యక్రమం అన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు విమర్శలు చేసుకోవచ్చు కానీ, ఎన్నికల తర్వాత పేదల సంక్షేమం, అభివృద్ధిపైనే దృష్టిపెట్టాలని చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో అది లోపించిందని, నోటితో చెప్పలేని విధంగా పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలంటే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. దత్తాత్రేయ పేరు వినగానే హోళీ, అలయ్‌ బలయ్‌ గుర్తుకొస్తాయని.. దత్తాత్రేయ హోళీ ఆడితే 3 నెలలపాటు రంగు పోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.


  • సీఎం వచ్చిన సందర్భంలో తోపులాట

సీఎం రేవంత్‌రెడ్డి వచ్చిన సమయంలో తోపులాట జరిగింది. సీఎంను వేదిక వద్దకు తీసుకెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేకంగా రోప్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సీఎంను కలిసేందుకు అభిమానులు ముందుకు రావడంతో పోలీసులు, వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డు వచ్చిన వారిని తోసేశారు. కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ను గొంతు పట్టేసి నెట్టేశారు. సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరిని బూటు కాళ్లతో తొక్కడంతో గాయమైంది.

సెక్యూరిటీ సిబ్బంది వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డ శ్రీధర్‌, యాదగిరి.. ‘సెక్యూరిటీ అంటే చంపడమా?’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గొంతును నొక్కేశారని శ్రీధర్‌ వాపోతే, తన కాలును తొక్కేశారని, మందులు వాడాల్సిన పరిస్థితి ఎదురైందని యాదగిరి వెల్లడించారు. బండారు దత్తాత్రేయ స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించడం వల్ల తాము ఈ కార్యక్రమానికి వెళ్లామని, ఇది సీఎం సెక్యూరిటీ సిబ్బంది చేసిన హత్యాప్రయత్నమేనని ఆరోపించారు. ‘సీఎం చుట్టూ ఉన్నవారు చంపేయడానికి సిద్ధమై ఉంటే, మా గతి ఏమిటి? ఉరి తీసినట్లయింది. ఒక దశలో చనిపోతాననే భయం వేసింది’ అని శ్రీధర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మమ్మల్ని పక్కకు వెళ్లమని చెప్పి, వారు ముఖ్యమంత్రికి కాపలాగా ఉండొచ్చని, ఆ ఇంగితం లేకపోతే వారు రక్షకులా, రజాకార్లా, కిరాయి గూండాలా? అని దుయ్యబట్టారు. ‘నా ప్రాణం పోతే ముఖ్యమంత్రిగారు బాధ్యత తీసుకుంటారా? ఒకవేళ చస్తే మీరు ఏం చేస్తారు? సంతాపం తెలియజేస్తారా? నా కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇస్తే చాలా?’ అని మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి గారూ మీరు వేదికపైకి వచ్చేముందు జనాన్ని చంపేయకండి’ అని విన్నవించారు. దత్తాత్రేయకు సైతం పలు సూచనలు చేశారు. ‘అలయ్‌ బలయ్‌ పేరుతో అందరినీ ఇబ్బంది పెట్టే బదులు తిండిలేని వారికి అన్నదానం చేయండి. ఇంకేం వద్దు. చిన్న తప్పుగా తీసి పడేయకండి’ అని సూచించారు.

  • నోరూరించిన వంటలు

అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వంటలు అతిథులకు నోరూరించాయి. ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలతో పాటు ఉత్తరాది వంటకాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వచ్చిన ముఖ్యఅతిథులకు విజయలక్ష్మి స్వయంగా వడ్డించారు.

Updated Date - Oct 14 , 2024 | 04:08 AM