CM Revanth Reddy: అంగరంగ వైభవంగా.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
ABN, Publish Date - Aug 29 , 2024 | 03:09 AM
తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది జనం సాక్షిగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
డిసెంబరు 9న లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
మిలియన్ మార్చ్ తరహాలో కార్యక్రమం
దసరా వరకు మంచిరోజులు లేనందునే హడావుడిగా భూమిపూజ: సీఎం
సచివాలయంలో విగ్రహ ఏర్పాటుకు రేవంత్ భూమిపూజ
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది జనం సాక్షిగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది డిసెంబరు9న ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్లుగా 2009 డిసెంబర్ 9న మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రకటించిందని, అదే రోజు తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన సోనియాగాంధీ జన్మదినమని తెలిపారు.
అందుకే తెలంగాణ ప్రజలకు ఆ రోజు పండగ దినంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనకు సచివాలయం గుండెకాయ లాంటిదని, అందుకే ఆ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు జరిగే చోటనే ప్రజలు తమ సమస్యలను తెలుపుకొనే అవకాశం ఉంటుందని, కానీ.. అలాంటి చోటికి గత పాలకులు ప్రవేశం కల్పించలేదని మండిపడ్డారు.
పదేళ్లలో రూ.22.50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన వారికి కోటి రూపాయలతో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు మనసు రాలేదని విమర్శించారు. తానే తెలంగాణ, తెలంగాణే తాను అనే రీతిలో గత పాలకులు వ్యవహరరించారని, అందుకే తెలంగాణ తల్లిని తెరమరుగు చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇలాంటి విధానాలకు విరుద్ధమన్నారు. ప్రగతి భవన్ పేరిట గడీ నిర్మించుకొని ప్రజలు ఆ పరిసరాల్లోకి రాకుండా చేశారని సీఎం ధ్వజమెత్తారు.
రాజీవ్ విగ్రహం లేని లోటు కనిపించింది..
సచివాలయం పరిసరాల్లోని నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో అంబేద్కర్, ఇందిరాగాంధీ, అంజయ్య, పీవీ నర్సింహారావు, కాకా వెంకటస్వామి, జైపాల్‌రెడ్డిల విగ్రహాలో, స్మృతివనాలో ఉన్నాయని సీఎం గుర్తు చేశారు. దేశంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన రాజీవ్‌గాంధీ విగ్రహం లేకపోవడం లోటుగా కనిపించిందన్నారు. సచివాలయం ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కొందరు తమ స్వార్థ ప్రయోజనం కోసం వాడుకోవాలని చూశారని, మేధావుల సూచన మేరకు తాము అక్కడ రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ విగ్రహాన్ని పెట్టడం జీర్ణించుకోలేని కొందరు.. తెలంగాణ తల్లి విగ్రహంతో ముడిపెట్టి వివాదం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని తాను జూన్ 2నే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దొరల గడీల ఆనవాళ్లతో విగ్రహం ఉండకూడదని, అందుకే ప్రజల మనోభావాలను ప్రతిబింబించే రీతిలో తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించే బాధ్యతను జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి అప్పగించామని తెలిపారు.
భూమిపూజను ఘనంగా నిర్వహించాలనుకున్నామని, కానీ.. ఈరోజు మినహా దసరా వరకు మంచి రోజులు లేవనే వేద పండితుల సూచన మేరకు హడావుడిగా నిర్వహించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.
Updated Date - Aug 29 , 2024 | 03:09 AM