ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hydra demolitions: కూల్చివేతలపై తగ్గేదేలే!

ABN, Publish Date - Aug 29 , 2024 | 03:03 AM

హైడ్రా కూల్చివేతల విషయంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు.

  • ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ఆగదు

  • తొలుత చెరువుల్లోని నిర్మాణాలను కూల్చడమే లక్ష్యం

  • తరువాత బఫర్‌జోన్లు, నాలాలు, పార్క్‌లపై దృష్టి

  • నా కుటుంబ సభ్యులకు ఆక్రమణలున్నాయని

  • ఎవరైనా ఆధారాలు చూపిస్తే.. వాటినీ కూల్చివేస్తాం

  • ప్రస్తుతానికి హైడ్రా విధానం హైదరాబాద్‌కే పరిమితం

  • హైడ్రా చర్యలకు.. పార్టీలో చేరికలకు సంబంధం లేదు

  • ప్రభుత్వ విధానాలు నచ్చి ఎవరైనా వస్తే చేర్చుకుంటాం

  • నేను రేవంత్‌రెడ్డిని.. నాకు కేసీఆర్‌తో పోలికేంటి?

  • కన్నకొడుకు కేటీఆర్‌నే కేసీఆర్‌ నమ్మడం లేదు

  • బీఆర్‌ఎ్‌స-బీజేపీ ఒప్పందం మేరకే కవితకు బెయిల్‌

  • ఐదు నెలల్లోనే 18 వేల కోట్ల రుణమాఫీ చేశాం

  • గత ప్రభుత్వం ఐదేళ్లలో 13 వేల కోట్లే మాఫీ చేసింది

  • విలేకరులతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): హైడ్రా కూల్చివేతల విషయంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఉన్న నిర్మాణాలు ఎవరివైనా సరే కూల్చివేస్తామని తేల్చిచెప్పారు. 30 ఏళ్ల కిందట నిర్మించిన కట్టడాలైనా ఆక్రమణల్లో ఉన్నాయని తేలితే చర్యలుంటాయన్నారు. బుధవారం సచివాలయంలో మీడియాతో సీఎం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మొదటగా చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై దృష్టి సారించామని, వాటిని తొలగించిన తరువాత బఫర్‌జోన్లు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన కుటుంబ సభ్యులకైనా ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో నిర్మాణాలున్నట్లు ఎవరైనా ఆధారాలు చూపిస్తే.. వాటిని కూడా కూల్చివేస్తామని స్పష్టం చేశారు.


ప్రస్తుతానికి హైదరాబాద్‌కే హైడ్రా పరిమితమని, దీనికి పోలీ్‌సస్టేషన్‌ హోదా కూడా కల్పిస్తున్నామని ప్రకటించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు బయట ఉన్న కొన్ని గ్రామపంచాయతీలు కూడా హైడ్రా పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరేందుకే హైడ్రాను తెరపైకి తెచ్చారన్న ఆరోపణల్ని సీఎం ఖండించారు. హైడ్రా తొలుత కూల్చిన భవనాలు కాంగ్రెస్‌ నేత పల్లంరాజుకు చెందినవేనని గుర్తుచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, పార్టీలోకి చేరికలకు ఎలాంటి సంబంధంలేదన్నారు. ఎవరినో భయపెట్టి పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని, తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని అన్నారు. అయితే ఎవరికైనా ప్రభుత్వ విధానాలు నచ్చి పార్టీలోకి వస్తే చేర్చుకుంటామన్నారు. చెరువులను కబ్జా చేసి నిర్మాణాలను చేపట్టినవారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని, ఈ విషయంలో మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి.. ఇలా ఎవరైనా ఉపేక్షించకూడదని బీఆర్‌ఎ్‌సకు సూచించారు.


  • విద్యాసంస్థలైనా మినహాయింపు లేదు..

చెరువులను ఆక్రమించి నిర్మించిన విద్యాసంస్థలకు ఎలాంటి మినహాయింపు లేదని సీఎం రేవంత్‌ అన్నారు. అయితే ఇప్పుడు విద్యాసంవత్సరం నడుస్తున్నందున విద్యార్ధులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనలో ఉన్నామని, ఆ తరువాతైనా ఆ నిర్మాణాలు కూల్చివేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా మాదాపూర్‌, అయ్యప్ప సొసైటీలోని గురుకుల ట్రస్టు భూముల్లోని ఆక్రమ నిర్మాణాలను, ఇతర ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారని గుర్తు చేశారు. అయితే కొద్దిరోజులకు ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఇప్పుడు హైడ్రా ఎలా ఉండబోతుందని విలేకరులు ప్రశ్నించగా, ‘‘నేను రేవంత్‌రెడ్డిని.


నాకు కేసీఆర్‌తో పోలికా? గతంలో కూల్చివేతలు స్వార్ధం కోసం జరిగాయి. హైడ్రా అనేది తాత్కాలిక అవసరాల కోసమో, నామమాత్రపు హడావిడి కోసమో వచ్చింది కాదు. దీని ఏర్పాటులో చాలా దూరదృష్టి ఉంది. కూల్చివేతలు ఆపాలంటూ నాకు చాలా ఒత్తిళ్లు, విజ్ఞప్తులు వస్తున్నాయి. అయినా ఆపబోం. ప్రజల ప్రయోజనాల కోసమే దీనిని తీసుకువచ్చాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు. చెరువులు, బఫర్‌ జోన్లలో ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టడం వల్లనే చిన్న వర్షానికి కూడా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోందని తెలిపారు. చెరువుల్లోనూ నిర్మాణాలు చేసుకుంటూ పోతే ఎలా? అంటూ కోర్టులు కూడా ప్రశ్నిస్తున్నాయని గుర్తు చేశారు. అదేవిధంగా హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ రెండింటినీ కాపాడడమే తమ లక్ష్యమని, ఇవి హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు. చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు చేపట్టొద్దని, ఏవైనా అపరాల పంటలు సాగు చేసుకుంటే మంచిదని సూచించారు.


  • ఆక్రమణలోనే జన్వాడ ఫామ్‌హౌస్‌..

జన్వాడలోని కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ కూడా ఆక్రమణలోనే ఉందని సీఎం రేవంత్‌ తెలిపారు. ఈ విషయాన్ని తాను 2020లోనే ఆధారాలతో సహా బయటపెట్టానని గుర్తుచేశారు. అప్పుడే కూలగొడతామన్నవారు.. 2024 వచ్చినా ఎందుకు కూలగొట్టలేదని ప్రశ్నించారు. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులను సమాజం ఆదర్శంగా భావిస్తుందని, అలాంటి వారే ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో నిర్మాణాలు చేపడితే ఎలా! అంటూ వ్యాఖ్యానించారు. జన్వాడ ఫామ్‌హౌస్‌ తనది కాదంటున్న కేటీఆర్‌.. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారా? అని ప్రశ్నించారు. నిర్మాణానికి అనుమతినిచ్చే అధికారం సర్పంచ్‌కు ఉండదని, గ్రామపంచాయతీ అధికారి (పంచాయతీ సెక్రటరీ)కి మాత్రమే ఉంటుందన్న విషయం కేటీఆర్‌కు తెలియదా? అని ఎద్దేవా చేశారు.


అక్రమ నిర్మాణాలు చెరువుల్లో ఉన్నాయా? లేదా? అనే దానిపైనే చర్యలుంటాయని, వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని తాము ఈ పనిచేయడంలేదని స్పష్టం చేశారు. హైడ్రా విధానాన్ని జిల్లాలకు కూడా విస్తరిస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా, ‘ఇప్పటికైతే హైదరాబాద్‌లో ఏర్పాటుచేశాం’ అని సీఎం సమాధానమిచ్చారు. హైడ్రాపై చాలామంది కోర్టుకు వెళ్లారని, డాక్యుమెంట్లు పరిశీలించిన తరువాతే చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించిందని తెలిపారు. చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు కూడా ఎప్పటికప్పుడు జిల్లాల కలెక్టర్లకు సూచిస్తోందన్నారు. హైడ్రాకు జ్యుడీషియల్‌ పరిధి ఉందని, దాని పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని అన్నారు. ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అసవరం లేదని పేర్కొన్నారు.


  • నిజనిర్ధారణ కమిటీకి హరీశ్‌రావునే నియమిద్దాం..

చెరువుల ఆక్రమణలపై ప్రజాకోర్టు, నిజనిర్ధారణ కమిటీలు వేద్దామని, అన్ని వివరాలను బయటకు తీద్దామని సీఎం రేవంత్‌ ప్రతిపాదించారు. వాటి బాధ్యతలు నిర్వహించేందుకు హరీశ్‌రావు ముందుకొచ్చినా ఫర్వాలేదన్నారు. ఇక 58, 59 జీవో కింద క్రమబద్ధీకరించుకున్న ప్రభుత్వ భూములను నిషేధిత జాబితాలో పెట్టామన్నారు. ఇక 111 జీవోను గత ప్రభుత్వం కేవలం వ్యాపారం చేసుకునేందుకే ఎత్తివేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.


సుంకిశాల ఘటనపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి కొత్త ఓటర్‌ జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్‌ వారం క్రితమే రాష్ట్రానికి ఇచ్చిందని, దాని ప్రకారం గ్రామ, మండలాల వారీగా వివరాలను సేకరించాలని, అందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఆగస్టు 31న ప్రస్తుత బీసీ కమిషన్‌ పదవీకాలం పూర్తవుతుందని, ఆ తరువాత కొత్త కమిషన్‌ వస్తుందని తెలిపారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ సొసైటీకి స్థలాలను అందించడంలో గత ప్రభుత్వం జాప్యం చేసిందని, తాము సాధ్యమైనంత త్వరగా ఆ సొసైటీకి స్థలాలను అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.


  • రుణమాఫీలో రికార్డు సృష్టించాం..

రుణమాఫీలో తమ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని సీఎం రేవంత్‌ అన్నారు. గత ప్రభుత్వం 2018 నుంచి 2023 దాకా రూ.13,329 కోట్ల రుణమాఫీ చేస్తే.. తమ ప్రభుత్వం ఐదు నెలల్లోనే రూ.17,934 కోట్ల రుణమాఫీ చేసిందని చెప్పారు. రుణమాఫీ అనేది తాను వ్యక్తిగతంగా రైతులకు ఇచ్చిన కమిట్‌మెంట్‌ అన్నారు. మాఫీ అందుకున్నవారిలో బీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఉన్నారని, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కూడా రూ.లక్షన్నర రుణమాఫీ అందుకున్నారని వెల్లడించారు. వాస్తవానికి మాఫీ కోసం రూ.31 వేల కోట్టు అవసరమవుతాయని అంచనా వేసి, ఆ మొత్తానికే పాలనాపరమైన అనుమతులు ఇచ్చామన్నారు. ఇంకా ఎవరెవరికి మాఫీ కాలేదన్న వివరాలను బీఆర్‌ఎస్‌ నేతలు సేకరించి, కలెక్టర్లకు సమర్పిస్తే గతంలో చేసిన పాపాలను కొంతమేరకైనా కడుక్కునే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.


కొడంగల్‌లోనూ వివరాలు సేకరిస్తామని కేటీఆర్‌ చెప్పిన విషయాన్ని విలేకరులు గుర్తుచేయగా, ‘నేను కొడంగల్‌కు సీఎంను కాదు. రాష్ట్రం మొత్తానికి సీఎంను. ఎక్కడికి వెళ్లి వివరాలు తీసుకుని ఇచ్చినా.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం’ అని రేవంత్‌ స్పష్టంచేశారు. ఇటీవల తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,500 కోట్ల చెల్లింపులు జరిగాయంటూ ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘పొత్తు లాభం’ కథనాన్ని ప్రస్తావించగా.. అవి ఉమ్మడి ఏపీ హయాంలో పలు నిర్మాణాల కోసం తీసుకున్న రుణాలకు చెల్లించాల్సినవన్నారు. అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే అసలు, వడ్డీని చెల్లిస్తోందని, ఆ మొత్తం ఇవ్వాల్సిందిగా ఏపీ కోరుతున్నా.. జనాభా ప్రాతిపదికన చెల్లిస్తామంటూ గత ప్రభుత్వం కాలం వెళ్లదీసిందని చెప్పారు. గత పదేళ్లగా ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని తెలిపారు.


  • వక్ఫ్‌బోర్డు చట్టాన్ని వ్యతిరేకించాం

వక్ఫ్‌బోర్డు చట్టాన్ని తాము వ్యతిరేకించామని, అది తమ పార్టీ నిర్ణయమని సీఎం చెప్పారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లీజు విషయంపైనా నివేదికలు సిద్ధమవుతున్నాయన్నారు. ఇక కర్ణాటకలోని ‘వాల్మీకి’ కేసులో తెలంగాణలోని కొంతమందికి నిధులు అందాయంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేయగా, ‘తెలంగాణలో ఖాతాలున్నంత మాత్రాన సంబంధాలున్నట్టేనా?’ అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు.


వాల్మీకి కేసులో బీఆర్‌ఎస్‌ నేతలకే లింకులు ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్నకు.. త్వరలోనే ఉంటుందని జవాబిచ్చారు. బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్‌ వచ్చిందని అన్నారు. ఆమె బెయిల్‌ కోసం బీఆర్‌ఎస్‌ పార్లమెంటు స్థానాలను త్యాగం చేసిందని ఆరోపించారు. కవితకు బెయిల్‌ రావడాన్ని తాను తప్పుబట్టడంలేదన్నారు. అయితే.. ఆ కేసులో ఉన్న సిసోడియాకు ఒక సమయంలో బెయిల్‌ రాగా, కవితకు ఇప్పుడొచ్చిందని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇంకా బెయిల్‌ రాలేదని ప్రస్తావించారు. కేసీఆర్‌ కన్నకొడుకునే నమ్మడంలేదని, అసెంబ్లీలో సమాధానం చెప్పేందుకు తాము చాలంటూ కేటీఆర్‌ మాట్లాడిన మరుసటిరోజే.. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చారని తెలిపారు.

Updated Date - Aug 29 , 2024 | 03:03 AM

Advertising
Advertising