ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఆక్రమణల కూల్చివేతలు.. భగవద్గీత స్ఫూర్తితోనే..

ABN, Publish Date - Aug 26 , 2024 | 03:02 AM

నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతకు స్ఫూర్తి ‘భగవద్గీత’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ధర్మాన్ని రక్షించేందుకు ‘గీత’లో శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధనీతి స్ఫూర్తితోనే ప్రజల జీవన విధానంలో,

  • చెరువుల్లో శ్రీమంతుల ఫాంహౌస్‌లు

  • తాగునీటి జలాశయాల్లోకి వాటి మురుగుకాల్వలు

  • అలా వదిలేస్తే ముఖ్యమంత్రిగా విఫలమైనట్టే కదా!

  • కబ్జాల నుంచి చెరువులకు విముక్తే లక్ష్యం

  • హైదరాబాద్‌ను విపత్తుల నుంచి కాపాడేందుకే..

  • ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులైనా వదలం

  • కక్షసాధింపుల్లేవు.. రాజకీయాలకు సంబంధం లేదు

  • ధర్మయుద్ధంలో ప్రజలు అండగా నిలవాలి: సీఎం

  • హరేకృష్ణ టవర్స్‌ అనంత శేష స్థాపనలో రేవంత్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతకు స్ఫూర్తి ‘భగవద్గీత’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ధర్మాన్ని రక్షించేందుకు ‘గీత’లో శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధనీతి స్ఫూర్తితోనే ప్రజల జీవన విధానంలో, సంస్కృతిలో భాగమైన చెరువులను సంరక్షించే మహాయజ్ఞానికి తమ ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ‘‘ప్రజా ప్రతినిధులు విధి నిర్వహణలో భాగంగా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని సవరించుకోడానికి తెలిసి కొన్ని మంచిపనులు కూడా చేయాలన్నది నా ప్రగాఢ విశ్వాసం.


ఆ క్రమంలోనే చెరువులను కబ్జాదారుల చెర నుంచి విముక్తి చేయాలన్న ఏకైక లక్ష్యంతో.. మా మీద ఎంత ఒత్తిడి వచ్చినా, ఎవరినీ వదలకుండా ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్నాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఆదివారం హరేకృష్ణ భక్తి ఉద్యమం ఆధ్వర్యంలో కోకాపేటలో చేపట్టిన హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్స్‌ నిర్మాణ ప్రక్రియలోని అనంత శేష స్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఆయనకు విద్యార్థులు వేద మంత్రోచ్ఛారణలతో ఘనస్వాగతం పలికారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన భూమి పూజలో పాల్గొన్న అనంతరం సీఎం కీలకోపన్యాసం చే శారు. ‘‘హైదరాబాద్‌ను వరదల నుంచి సంరక్షించడం కోసం ఆనాడు నిజాం ప్రభుత్వం.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి నిపుణుల సూచనలతో హియాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాలను నిర్మించింది.


మొన్నటికి మొన్న కృష్ణా, గోదావరి ఎండిపోయి, వేసవిలో తాగునీటి సమస్య వస్తే.. ఈ జలాశయాలే నగరవాసుల దాహార్తిని తీర్చాయి. అలాంటిది కొంతమంది శ్రీమంతులు, గొప్పవ్యక్తులుగా పేరుపొందిన వారు చెరువుల్లో ఫాంహౌ్‌సలు నిర్మించుకొని, వాటి నుంచి పారే మురుగు కాల్వలను నగరానికి తాగునీరు సరఫరా చేసే జంట జలాశయాల్లో కలిపారు. సామాన్యుల తాగునీటి చెరువుల్లో మురుగు నీరు కలపడాన్ని చూస్తూ ఊరుకొంటే, అక్రమ నిర్మాణాలను అలానే వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టా? కాదా?’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే తనపై ఎంత ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫాంహౌ్‌సలున్నా.. ఏవీ వదలకుండా హైడ్రా సంస్థను ఏర్పాటు చేశామని, చెరువుల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నామని ఆయన వివరించారు.


  • కక్ష సాధింపులకు తావు లేదు..

చెరువులను ఆక్రమించిన వారిలో కొందరు ప్రభుత్వాన్ని, సమాజాన్ని అత్యంత ప్రభావితం చేయగలిగిన స్థానాల్లో ఉన్నారని సీఎం రేవంత్‌ తెలిపారు. మరికొందరు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములుగానూ ఉండవచ్చునని, అయినా.. వాటన్నింటినీ పట్టించుకోదలచుకోలేదన్నారు. ఇది రాజకీయాలకు సంబంధం లేనిదని, కొందరు రాజకీయ నాయకులను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన కార్యక్రమం కాదని స్పష్టం చేశా రు. ఇందులో ఎలాంటి కక్ష సాధింపులకు తావు లేదని పేర్కొన్నారు. ‘‘ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే అది మన మీద కక్ష కడుతుంది.


ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో చెన్నై, ఉత్తరాఖండ్‌, కేరళలోని వయనాడ్‌ ఉదంతాలను చూశాం. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అయినా హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే నగరంలోని చెరువులను కాపాడే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంది. ఎవరేమి అనుకున్నా, మా మీద ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా.. వాటన్నింటినీ పక్కనబెట్టి మరీ చెరువులను ఆక్రమించుకున్న వాళ్ల భరతం పడతాం. మా ప్రభుత్వం తలపెట్టిన ఈ ధర్మ యుద్ధానికి ప్రజలంతా అండగా నిలవాలి, సహకరించాలి’’ అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.


  • మధ్యాహ్న భోజనానికి హరేకృష్ణ సహకారం..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు హరేకృష్ణ సంస్థ సహాయం కోరినట్లు సీఎం రేవంత్‌ తెలిపారు. దీంతోపాటు నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌, నిలోఫర్‌, క్యాన్సర్‌ ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు నాణ్యమైన భోజనం అందించేందుకు అక్షయపాత్ర సహకారం అవసరమని అన్నారు. భోజన కేంద్రాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. హరేకృష్ణ సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమానికీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.


మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్స్‌ నిర్మాణంతో నగరం ఆధ్యాత్మిక ధామానికి నెలవుగా మారుతుందన్నారు. చెరువుల పరిరక్షణకు సీఎం రేవంత్‌ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదన్నారు. హైడ్రా పనితీరును కొనియాడారు. కాగా, ప్రజలను చైతన్యమార్గంలో నడిపించడమే ఈ మహా నిర్మాణం ముఖ్య ఉద్దేశమని అక్షయపాత్ర వ్యవస్థాపకుడు మధుపండిట్‌ దాస తెలిపారు. శ్రీరామ, వెంకటేశ్వర, కృష్ణబలరామ అవతార తదితర దేవాలయాల సమూహంతోపాటు అత్యాధునిక వసతులతో కూడిన సభా మందిరాలు, ధ్యాన కేంద్రాలను హెరిటేజ్‌ టవర్స్‌లో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమం లో హరేకృష్ణ ఉద్యమం తెలుగు రాష్ట్రాల బాధ్యుడు సత్యగౌరస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా మందిర నిర్మాణానికి వాతం మహేశ్‌, ప్రదీప్‌ అగర్వాల్‌ రూ.7.5 కోట్ల చెక్కును సీఎం రేవంత్‌ చేతులమీదుగా నిర్వాహకులకు అందించారు.

Updated Date - Aug 26 , 2024 | 03:02 AM

Advertising
Advertising
<