CM Revanth Reddy: గాంధీల గొప్పతనం గాడిదలకేం తెలుసు?
ABN, Publish Date - Sep 17 , 2024 | 02:13 AM
గాంధీల గురించి ఈ గాడిదలకు ఏం తెలుసు? అంటూ బీఆర్‌ఎస్ నేతలపై సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాణ త్యాగం, పదవుల త్యాగమంటే గాంధీ కుటుంబానిదేనని చెప్పారు.
మీ ఫాంహౌజుల్లో జిల్లేళ్లు మొలిపిస్తాం.. పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలే?
ఆ సన్నాసి విగ్రహం కోసం ఈ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నడు
కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరిచూపునకూ వెళ్లలే
ఇంతకంటే దుర్మార్గుడు, నీచుడు భూమ్మీద ఉంటాడా?
కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజం
రాజీవ్ విగ్రహాన్ని కూల్చడానికి ఎవడొస్తాడో రండంటూ సవాల్
కంప్యూటర్‌ను పరిచయం చేసింది రాజీవ్ అని తెలుసా?
అదే లేకపోతే గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకునేటోడివి
కేటీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎద్దేవా
సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం
నిమజ్జనంలో ఇబ్బందులు ఉండొద్దని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గాంధీల గురించి ఈ గాడిదలకు ఏం తెలుసు? అంటూ బీఆర్‌ఎస్ నేతలపై సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాణ త్యాగం, పదవుల త్యాగమంటే గాంధీ కుటుంబానిదేనని చెప్పారు. అలాంటి కుటుంబ వారసుడైన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామంటే.. కూలగొడతామంటున్నారని కేటీఆర్, తదితర నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘బిడ్డా.. వెయ్యి ఎకరాల్లో ఫాంహౌస్ కట్టుకున్నావ్. అందులో జిల్లేళ్లు మొలిపిస్తా’’ అంటూ కేసీఆర్‌ను హెచ్చరించారు. ‘బీఆర్‌ఎస్ మిడతల దండు మళ్లీ రాష్ట్రంపైకి వస్తోంది. ఆ దండును మీరు, నేను కలిసి పొలిమేరల వరకు తరిమికొడదాం’ అని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడదామనుకున్నామని అంటున్నారని, మరి పదేళ్ల పాటు పాలనలో ఉండి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. అందుకే తాము రాష్ట్రానికే గుండెకాయ వంటి సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిన, సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. సచివాలయం ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ విగ్రహాన్ని సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ‘‘ ఇది రాజకీయ వేదిక కాదు. కానీ, జరుగుతున్న పరిణామాలు, కొంత మంది మాట్లాడుతున్న మాటలను దృష్టిలో పెట్టుకుని, త్యాగమంటే ఏమిటో రాబోయే తరాలకు, ఈ రోజు చిల్లరమల్లరగా మాట్లాడుతున్నవారికి గుర్తు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాపై ఉంది. అడ్డగోలుగా వేల కోట్ల ఆస్తులు కూడబెట్టినవారికి గాంధీల కుటుంబ త్యాగాలు ఏం తెలుసు?’’ అని ప్రశ్నించారు. ‘‘ఈ రోజు ట్విటర్ పిట్ట అమెరికా వెళ్లి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నడు.
ఆ కంప్యూటర్‌ను ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్‌గాంధీ. ఆ కంప్యూటర్ లేకపోతే ఏ గుంటూరులోనో ఇడ్లీ, వడ అమ్ముకుంటూ తిరిగేటోడివి. సిద్దిపేట రైల్వే స్టేషన్‌లో చాయ్, సమోసా అమ్ముకుంటూ ఉండేటోడివి. రాజీవ్‌గాంధీ కంప్యూటర్‌ను పరిచయం చేయడం వల్లే నీ బతుక్కి ఒక కంప్యూటర్, ఒక ట్విటర్ అకౌంట్ ఉన్నాయి. ఒక ఐటీ మంత్రివి అయ్యావు. లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. దేశ సమగ్రతను కాపాడిన అంతటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే, ఎందుకు పెట్టారని అడుగుతావా? అధికారం పోయినా.. మదం దిగలేదు’’ అని కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ‘‘గాంధీలది కుటుంబ పాలన అంటున్నారు. కార్యకర్తలారా ఆ సన్నాసులకు చెప్పండి.. రాజీవ్‌గాంధీ చనిపోయిన తర్వాత దాదాపు 15 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సోనియాగాంధీ ఏ పదవీ తీసుకోలేదు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నా.. సోనియా, రాహుల్ ఏ పదవులూ తీసుకోలేదు.
పదవి, ప్రాణ త్యాగమంటే వాళ్లని చూడాలి. స్వాతంత్య్ర పోరాటమంటే ఆ కుటుంబాన్ని చూడాలి. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణ త్యాగాలు చేసి, దళిత, గిరిజన జాతులను ఆదుకున్నారు. సోనియా, రాహుల్‌గాంధీ పదవీ త్యాగం చేసి పీవీ నర్సింహారావు, మన్మోహన్‌సింగ్ వంటి మేధావులను ప్రధానమంత్రులుగా పరిచయం చేశారు. మరి ఈ సన్నాసుల సంగతి ఏంది? అయ్య ముఖ్యమంత్రి, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి, బిడ్డ ఎంపీ, సడ్డకుడి కొడుకు రాజ్యసభ సభ్యుడు. దుర్మార్గులారా రాష్ట్రాన్ని దోచుకు తిని, పదవులను పంచుకుని, వందలాది ఎకరాల్లో ఫాంహౌ్‌సలు కట్టుకున్నారు. మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతారా? ఈ గాడిదలకు తెలుసా గాంధీల కుటుంబం గురించి? ఆనాడు చాకలి ఐలమ్మ ఒక మాట చెప్పారు. గడీల్లో గడ్డి మొలవాల్సిందేనని.. సాయుధ రైతాంగ పోరాటంతో అది జరిగింది. ఈ రోజు చెబుతున్న బిడ్డా.. మీ ఫాంహౌ్‌సల్లో జిల్లేళ్లు మొలిపిస్తా. మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రేవంత్‌రెడ్డి ఊరుకోరు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
పదేళ్లలో ఎందుకు పెట్టలేదు?
‘‘ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అనుకున్నాడంట. నేను ఆ దిక్కుమాలినోడిని అడుగుతున్న. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి పదేళ్లు పడుతుందా? రూ.లక్ష కోట్లు దిగమింగి కాళేశ్వరాన్ని కట్టినవ్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టకుండా పదేళ్లలో ఏ గాడిద పళ్లు తోమినవ్? ఆ సన్నాసి సొంత విగ్రహాన్ని పెట్టుకుందామని ఈ స్థలాన్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నడు. ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధి లేనోడి విగ్రహాన్ని పెట్టుకోవాలని వారి ఆలోచన. సచివాలయం ముందు దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ విగ్రహాన్ని పెట్టడం సముచితం కాదా అని తెలంగాణవాదులందరినీ అడుగుతున్నా?’’ అని రేవంత్ అన్నారు. ‘‘వాస్తవానికి ఆ గాడిదలే రాజీవ్ విగ్రహాన్ని పెట్టాలి. కానీ, మనం పెట్టిన విగ్రహాన్ని తొలగిస్తామంటున్నారు.
ఎవడ్రా తొలగించేది? ఎవడొస్తడో నేను చూస్తా. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపలే పెట్టాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణ తల్లుల కడుపు కోతను దృష్టిలో పెట్టుకుని, ఒక తల్లిగా ఆలోచించిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం డిసెంబరు 9. తెలంగాణ ప్రకటన వచ్చిందీ అదే రోజు. అందుకే అదే రోజున లక్షలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. మా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆదేశాలిస్తున్నా.. డిసెంబరు 9 నాటికి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి. ప్రపంచమంతా అబ్బురపడేలా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నది మా ప్రతిన. రాజీవ్ విగ్రహం సాక్షిగా, సోనియా వారసులుగా ప్రజలకు మేం మాట ఇస్తున్నాం’’ అని రేవంత్ ప్రకటించారు.
ఇంతటి దుర్మార్గుడు, నీచుడు భూమ్మీద ఉంటాడా?
‘‘ఇక్కడే కొండా లక్ష్మణ్ బాపూజీ కేసీఆర్‌కు పార్టీ పెట్టుకోమని ఇల్లు ఇచ్చిండు. అది కూలిపోతే, నిలువ నీడ లేకపోతే, కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే.. కనీసం ఆఖరి చూపులకు పోలేదు. ఇంతకంటే దుర్మార్గుడు, నీచుడు భూమ్మీద ఎవడైనా ఉంటాడా?’’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘అలాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్‌కు పెట్టాం. మహిళా యూనివర్సిటీకి వీర నారి చాకలి ఐలమ్మ పేరు పెట్టినం. సురవరం ప్రతా్‌పరెడ్డి పేరును తెలుగు యూనివర్సిటీకి పెట్టుకుంటున్నం. పదేళ్లలో ఇలాంటి గొప్ప వ్యక్తుల పేర్లు పెడతామంటే వద్దన్నారా? అన్నింటికీ నువ్వు, నీ కుటుంబమే కనబడాలి. తెలంగాణ మొత్తాన్ని దిగమింగాలన్న ఆలోచన మీ కుటుంబానిది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బండకేసి కొడతారని వాళ్లు ఊహించలేదు. ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఫాంహౌ్‌సలో ఆయనకు షాక్ ట్రీట్‌మెంట్స్ జరుగుతున్నాయి. కొంత మంది చిల్లరమల్లరగాళ్లతో మన గురించి మాట్లాడిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలారా జాగ్రత్తగా ఉండండి’’ అని రేవంత్ అన్నారు.
పంచాయతీలకు నేరుగా నిధులిచ్చింది రాజీవ్
‘‘దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, సమూలమైన మార్పులు రావాలని భావించి ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గంచింది రాజీవ్ కాదా? అని ఈ సన్నాసులు, సోయి లేనోళ్లను అడగదల్చుకున్నా. ఢిల్లీ నుంచి గ్రామ పంచాయతీలకే నేరుగా నిధులు వెళ్లేలా రాజ్యాంగ సవరణలు చేసింది రాజీవ్ కాదా? మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత ఆయనది కాదా? అని ఈ సన్నాసులకు గుర్తు చేయదల్చుకున్నా. ఐదేళ్లు ఒక మహిళకు మంత్రి పదవి కూడా ఇవ్వని సన్నాసులకు మహిళా గౌరవం ఎలా తెలుస్తుంది?’’ అని రేవంత్ అన్నారు.
కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: కోమటిరెడ్డి
రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై అడ్డగోలుగా మాట్లాడిన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజీవ్‌గాంధీ దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించారన్నారు. అలాంటి కుటుంబం గురించి పనికిరానివాళ్లు, తెలంగాణ కోసం దొంగ నాటకాలు వేసినవారు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నిమజ్జనంలో ఇబ్బందులుండొద్దు.. అధికారులకు సీఎం ఆదేశం
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులు, అధికారులను ఆదేశించారు. సోమవారం నిమజ్జన ఏర్పాట్లు, పర్యవేక్షణపై కమాండ్‌కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. నగరంలో 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సీఎంకు చెప్పారు. ట్యాంకు బండ్‌తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సీఎం సూచించారు.
Updated Date - Sep 17 , 2024 | 02:14 AM