CM Revanth Reddy: దీక్షలు మీరే చేయొచ్చుగా!
ABN, Publish Date - Aug 27 , 2024 | 05:02 AM
గత పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వనివారు.. తాము ఉద్యోగ నియామకాలకు పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయాలంటూ ధర్నాలు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
హరీశ్, కేటీఆర్‌కు పదవులు పోగానే విద్యార్థులు గుర్తుకొస్తున్నారా?
అభ్యర్థులూ.. వారి కుట్రలో పడొద్దు
90 రోజుల్లో 30 వేల కొలువులు ఇచ్చాం
35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ
10-15 రోజుల్లో వర్సిటీలకు వీసీలు
రాజీవ్ సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్
అభ్యర్థులకు సాయంలో సీఎం రేవంత్ ప్రిలిమ్స్ పాసైన 135 మందికి రూ.లక్ష
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): గత పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వనివారు.. తాము ఉద్యోగ నియామకాలకు పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయాలంటూ ధర్నాలు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. గతంలో రెచ్చగొట్టి, పిల్లల ప్రాణాలు బలి తీసుకొని పదవులు పొందారని, ఇప్పుడు పదవులు పోగానే మళ్లీ విద్యార్థులు, వారి ప్రాణాలు గుర్తుకొస్తున్నాయని మండిపడ్డారు. ‘‘మళ్లీ ఆమరణ దీక్షలకు పిల్లలందరూ ఎందుకు? మీరున్నరు కదా.. బావబామ్మర్దులిద్దరు ఆమరణ దీక్షలు చే యొచ్చు కదా! ఉద్యోగాలు వాయిదా వేయాలని కోరితే మీకే నష్టం.
మీరు ఏ సూచనలు చేసినా.. వినడానికి, మంచి సూచన ఉంటే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం’’ బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావునుద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. పరీక్షలు వాయిదా వేయించాలనే వారి కుట్రలో విద్యార్థులు పడొద్దని, సొంతంగా ఆలోచన చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్) నిధులతో సివిల్స్ మెయిన్ ్స పరీక్ష రాయడానికి అర్హత సాధించిన 135 మంది అభ్యర్థులకు ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం కింద రూ.లక్ష ఉపకార వేతనం అందించే కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘పదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయలేదని, తాము నెల రోజుల్లోనే రూ.2 లక్షల దాకా రుణమాఫీ చేశామని తెలిపారు. నిరుద్యోగ యువకులు, యూనివర్సిటీలు, రైతులే తమ ప్రభుత్వ పాధాన్యతలని పేర్కొన్నారు.
ఇంటర్వ్యూలకు ఎంపికైతే మళ్లీ సాయం
సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికయ్యాక ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారికి మళ్లీ సాయం చేస్తామని సీంఎ చెప్పారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులై తెలంగాణ ప్రతిష్ఠను పెంచాలని, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎ్‌సలుగా ఎంపికై దేశంలో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ‘‘భవిష్యత్తుకు మీరే పునాదులు. మీరు ఆదర్శంగా నిలవాలి. మీరు ఎంపికైతే.. గ్రామానికి, రాష్ట్రానికి గర్వకారణం. గతంలో ఎస్‌ఐ ఫలితాల్లో 50 శాతం మంది నల్లగొండ జిల్లా వారే విజయం సాధించేవారు. 30 ఏళ్లుగా ఒకరిని చూసి.. మరొకరు పోటీ పడుతూ ఎస్‌ఐ పోస్టుల్లో సగం పోస్టులను నల్లగొండ జిల్లా ప్రజలే దక్కించుకునేవారు. మీరు సివిల్స్‌కు పోటీ పడి, ఉద్యోగాలు సాధిస్తే.. ఆ ప్రభావం మీ సమీపంలోని వారందరిపై ఉంటుంది.
మీ తల్లిదండ్రులకు , గ్రామానికి, రాష్ట్రానికి గౌరవం పెరుగుతుంది’’ అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి 175 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారని, వారిలో 135 మందికి ఉపకార వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో విద్య సర్టిఫికెట్ కోర్సులకు పరిమితమవుతోందని, ఇంజనీరింగ్ సర్టిఫికెట్ తీసుకొని బయటికి వస్తున్నా.. నైపుణ్యాలు ఉండటం లేదని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పరిశ్రమలకు తగ్గ నైపుణ్యం కలిగిన మానవ వనరులు దొరకడం లేదని, నియామకాల కోసం ఎవరూ రావడం లేదని పరిశ్రమలు చెబుతున్నా యి. అందుకే విద్యార్థులకు, పరిశ్రమలకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి, చదువుతోపాటు శిక్షణ కోసం, ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ నమూనాలో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేశాం’’ అని రేవంత్ అన్నారు.
నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందే నియామకాల కోసమని సీఎం రేవంత్ అన్నారు. ‘‘90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. 35 వేల గ్రూప్-1, గ్రూప్-2, టీచర్ ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తు న్నాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. రానున్న 10-15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తామని, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 20-25 ఎకరాల్లో యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయాలు నిర్మిస్తామని తెలిపారు.
గత ప్రభుత్వంలో ఫాంహౌ్‌సలు ఎలా కట్టుకున్నారో, ఆర్థికంగా ఎలా ఎదిగారో, ఉద్యమం ముసుగులో టీవీలు, పేపర్‌లు, పదవులు, ఆస్తులు, బంగళాలు ఎలా వచ్చాయో మీరు కళ్లారా చూశారంటూ విద్యార్థులనుద్దేశించి వ్యాఖ్యానించారు. కొత్త సచివాలయం నిర్మించాక గతంలో తనను, సీతక్కను లోపలికి రానివ్వలేదని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘ఈ సచివాలయం తెలంగాణ ప్రజలది. దూరం నుంచి పోతే ఇదేదో పరాయి ఆస్తిలాగా ఉంటది. లోపలికి వస్తే విశ్వాసం పెరుగుతుంది. మనమేదో గడీల బయటి నుంచి వెళ్లిపోయే బానిసల్లా కాకుండా బాజాప్తాగా లోపలికి వస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుందనే సచివాలయంలో విద్యార్థులతో కార్యక్రమాలు పెట్టాం. ఇది గతంలో లాగా కొద్దిమందికి పరిమితమైన గడీ కాదు’’ అని రేవంత్ అన్నారు.
2028 ఒలింపిక్ క్రీడలే లక్ష్యం..
ఒలింపిక్స్‌లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, చిన్న చిన్న దేశాలు చాలా పతకాలు సాధిస్తే... మనకు అవమానం జరిగిందన సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అత్యధిక పతకాలు సాధిండచమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 15 ఏళ్లుగా నిరుపయోగంగా మారిన క్రీడా స్టేడియాలను మళ్లీ వినియోగంలోకి తెస్తామని తెలిపారు. ‘‘గత పదేళ్లలో పౌలీ్ట్రఫామ్‌ల కన్నా అఽధ్వాన్నంగా గురుకులాలు పెట్టారు. 200 మంది విద్యార్థులుంటే రెండు బాత్‌రూమ్‌లు లేవు. మౌలిక వసతులు కల్పించలేదు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు విద్యనందించడానికి 20-25 ఎకరాల్లో రూ.100 కోట్లు వెచ్చించి వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మేధోసంపత్తిని ప్రోత్సహించడంలో భాగంగానే ఉపకార వేతనం అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన వారెవరూ ఈ ఆలోచన చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 27 , 2024 | 05:37 AM