LB Stadium: తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే!
ABN, Publish Date - Aug 03 , 2024 | 02:52 AM
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి వచ్చానని, ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని చెప్పారు.
ప్రభుత్వానికి టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు
సర్కారు బడుల్లో చేరడం గౌరవంగా
భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి
తెలంగాణ బలపడేందుకు కృషి చేయాలి
15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల
అంశాన్ని పరిష్కరించాం: సీఎం రేవంత్
ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం
ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి వచ్చానని, ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు. తెలంగాణ భవిష్యత్తు ఎక్కడ ఉందని ఈ క్షణం తనను అడిగితే.. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతానని అన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనం, ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్తును ఉపాధ్యాయుల చేతుల్లో పెట్టారని తెలిపారు.
‘‘ప్రత్యేక రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం. ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నాం. ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్య లాంటి వారికి గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నాం. కానీ, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశాం. గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశాం. తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో కాదు.. మీ చేతుల్లో ఉందని చెప్పేందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం’’ అని సీఎం రేవంత్ అన్నారు. ఉపాధ్యాయులంతా 90శాతం పైగా నిబద్ధతతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం ఆత్మగౌరవమని భావించే విధంగా స్కూళ్లను తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించినట్టు చెప్పారు.
‘‘ప్రభుత్వ అధీనంలో ఉన్న 30 వేల పాఠశాలల్లో.. 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటుంటే.. 10 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా? మీకంటే చదువు తక్కువ ఉన్నవారు ప్రైవేట్ టీచర్లుగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. ఆడపిల్లలు చదువుకునేందుకు పాఠశాలల్లో కనీస వసతులు లేవు. తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా ఉంది’’ అని సీఎం అన్నారు. టీచర్లు తేనెతుట్టె లాంటివారని, హాని చేయాలని చూస్తే తేనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రాగానే.. ప్రతినెలా 1వ తేదీనే జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నామని, 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించామని చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యత అప్పగించామని, ప్రభుత్వ పాఠశాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించామని గుర్తు చేశారు.
టీచర్లు ప్రభుత్వానికి సహకరించాలి..
తెలంగాణ బలపడాలంటే అందరం కార్యదీక్షతో పనిచేయాలని ఉపాధ్యాయులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మరోసారి ప్రజా ప్రభుత్వం రావాలంటే.. పేదలకు చదువు చెప్పాలని, అందుకు టీచర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ‘మాకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు’ అని సీఎం వ్యాఖ్యానించారు. చాలా కార్పొరేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారని, అందుకే రాష్ట్రంలో డ్రగ్స్‌పై ఉక్కువాదం మోపామని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చక్కదిద్దుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల దశాబ్దకాలం నాటి కల.. ప్రమోషన్లు, బదిలీల విషయంలో ప్రత్యేక చొరవ చూపించి పూర్తిచేశారని పేర్కొన్నారు.
మిగిలిన ప్రమోషన్లతోపాటు ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 2014 నుంచి ప్రమోషన్ల కోసం తనను చాలామంది టీచర్లు అడిగేవారని, జీవితకాలంలో ఒక్కసారైనా పదోన్నతి పొందుతామా, లేదా అని బాధపడేవారని చెప్పారు. గత ప్రభుత్వం చేయలేని పనిని సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మిగిలిన ఎస్‌జీటీ టీచర్లకు కూడా పదోన్నతులు కల్పించాలని, సర్వీస్ రూల్స్‌ను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Updated Date - Aug 03 , 2024 | 02:52 AM