ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం

ABN, Publish Date - Dec 07 , 2024 | 02:30 AM

బంగారు రంగు అంచుతో ఆకుపచ్చ చీర! రెండు చేతులకు ఎరుపు, ఆకు పచ్చ రంగు గాజులు! ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ కంకులు! కాళ్లకు మెట్టెలు, పట్టీలు! మెడలో బంగారపు గొలుసులు!

  • తెలంగాణ తల్లి కొత్త విగ్రహ నమూనా విడుదల

  • 9న ఆవిష్కరణ.. ఉట్టిపడుతున్న తెలంగాణతనం

  • బంగారు వర్ణం అంచుతో ఆకుపచ్చ చీర, గాజులు

  • ఎడమ చేతిలో వరి సహా చిరు ధాన్యాల కంకులు

  • అభయహస్తంగా కుడి చేయి.. మెడలోన నగలు

  • దిమ్మె పైన పోరాటాన్ని ప్రతిఫలించేలా పిడికిళ్లు

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బంగారు రంగు అంచుతో ఆకుపచ్చ చీర! రెండు చేతులకు ఎరుపు, ఆకు పచ్చ రంగు గాజులు! ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ కంకులు! కాళ్లకు మెట్టెలు, పట్టీలు! మెడలో బంగారపు గొలుసులు! నుదుట రూపాయి కాసంత ఎర్రటి బొట్టుతో నిండైన గ్రామీణ మహిళ రూపం! ఇది.. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఈనెల తొమ్మిదో తేదీన ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి తాజా విగ్రహం! సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. 3 అడుగుల గద్దెపై 17 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్న కాంస్య విగ్రహ నమూనాను శుక్రవారం విడుదల చేసింది. గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలతో ఉందని, తెలంగాణ ఆనవాలు లేదంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి రాగానే అసలైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి, ఆవిష్కరిస్తామని చెప్పింది. అన్నట్లుగానే.. గత ఏడాది డిసెంబరులో అధికారం చేపట్టిన వెంటనే విగ్రహం రూపకల్పనపై దృష్టిసారించింది.


తెలంగాణ గ్రామీణ మహిళ రూపాన్ని ప్రతిబింబించేలా దీనిని రూపొందించింది. గతంలోలా ఒక దేవత రూపంలోనో, రాచరిక పోకడలతోనో కాకుండా అచ్చం సగటు సామాన్య స్త్రీలా ఉండేలా తయారు చేయించింది. గతంలో ఒక చేతిలో బతుకమ్మ ఉన్నప్పటికీ, మరో చేతిలో మొక్కజొన్న కంకి మాత్రమే ఉండేది. కానీ, తెలంగాణ అంటేనే చిరుధాన్యాల పంటలకు పెట్టింది పేరు. ఇక్కడి మహిళలు పండుగల సమయంలో మెడ చుట్టూ బంగారు గొలుసులను ధరిస్తారు. అవన్నీ ప్రతిబింబించేలా..తెలంగాణలోని సామాన్య స్త్రీ ఎలా ఉంటుందో ఆ రూపంలోనే ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది. అలాగే, పోరాటానికీ ఇందులో పెద్దపీట వేసింది. విగ్రహం దిమ్మెను ప్రజలు పట్టుకున్నట్లు రూపొందిస్తూనే.. దాని కింద ఉద్యమానికి గుర్తుగా బిగించిన పిడికిళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విగ్రహ పనులన్నీ పూర్తవ్వగా.. పచ్చిక బయళ్లు, లైటింగ్‌, వాటర్‌ ఫౌంటెయిన్‌ పనులు జరుగుతున్నాయి. ఈనెల 9న సాయంత్రం లక్ష మంది మహిళల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


  • భావితరాలకు స్ఫూర్తిగా విగ్రహం: శిల్పి రమణా రెడ్డి

తెలంగాణ తల్లి తాజా విగ్రహాన్ని శిల్పి రమణారెడ్డి రూపొందించారు. సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌ గాంధీ విగ్రహం సహా ఎన్నో ప్రముఖ విగ్రహాలను ఆయన తయారు చేశారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి తాజా విగ్రహం రాష్ట్ర సంప్రదాయాన్ని, బహుజనుల ఉద్యమ భాగస్వామ్యాన్ని, పోరాట స్ఫూర్తిని వ్యక్తపరుస్తుందని తెలిపారు. ‘‘కొత్త విగ్రహం సగటు స్త్రీమూర్తిగా, సబ్బండ వర్గాల ఆకాంక్షల స్ఫూర్తిగా, భావితరాల విశ్వాస స్ఫూర్తిగా అందరినీ ఆకట్టుకుంటుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలోనూ ప్రొఫెసర్‌ గంగాధర్‌ రూపొందించారు. అప్పట్లో నాటి సీఎం ఆకాంక్షల మేరకు రూపకల్పన జరిగింది. ఆ విగ్రహాన్ని ప్రజల సంస్కృతికి భిన్నంగా రాచరికపు హావభావాలతో ధనిక స్ర్తీగా చిత్రీకరించారు. అందుకే ఆ విగ్రహం ప్రజల మన్ననలు పొందలేదు. తెలంగాణ తల్లి అంటే ప్రజల మాతృమూర్తి. దశాబ్ధాల పోరు, పోరాటాల చరిత్ర ఈ రాష్ట్రానిది. తొలి, మలిదశ ఉద్యమాల్లో వేలమంది అమరుల త్యాగాలతో, సోనియా గాంధీ ఆశీర్వాదంతో రాష్ట్రం సిద్ధించింది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు సహా సకల బహుజనులు సాధించిన విజయమిది. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగానే దీనిని రూపొందించాం’’ అని ఆయన వివరించారు.

Updated Date - Dec 07 , 2024 | 02:30 AM