Agriculture budget: రైతు.. రాజధాని!
ABN, Publish Date - Jul 26 , 2024 | 03:15 AM
అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే అతి క్లిష్టమైన రుణ మాఫీ పథకాన్ని పట్టాలపైకి ఎక్కించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లోనూ వ్యవసాయ రంగానికే పెద్దపీట వేసింది.
రేవంత్‌రెడ్డి సర్కారు బడ్జెట్లో వీటికి పెద్దపీట
వ్యవసాయ అభివృద్ధికి నాలుగో వంతు.. రూ.72,659 కోట్లు
రుణ మాఫీకి రూ.26 వేల కోట్లు.. కూలీలకు ఏటా రూ.12 వేలు
సన్నాలకు బోనస్, సబ్సిడీ విత్తనాలు స్కీములకు కేటాయింపులు
రైతు భరోసాలో ఆంక్షలుంటాయని స్పష్టీకరణ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి రూ.65,119 కోట్లు
మహాలక్ష్మి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇంటి పథకాలకు నిధులు
యువ వికాసం, పింఛన్ల పెంపు ఈ ఏడాదికి లేనట్లేనా!?
బీఆర్‌ఎస్ పథకాలు గొర్రెల పంపిణీ, దళిత బంధుకు రాంరాం
కేంద్ర గ్రాంట్లు, పన్నేతర రాబడి కింద ఎప్పట్లాగే కేటాయింపులు
లోటు భర్తీకి మద్యం, రిజిస్ట్రేషన్ పన్నుల్లో పెంచిన అంచనాలు
రేవంత్ సర్కారు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి
ఆరు గ్యారెంటీల్లో కొన్నింటికి లేని బడ్జెట్ కేటాయింపులు
హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్లు
రైతు.. రాజధాని! సంక్షేమం కూడా! తొలి బడ్జెట్‌లో రేవంత్ రెడ్డి సర్కారు ప్రాధాన్యాలివే! బడ్జెట్లో ఏకంగా నాలుగో వంతు నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించి తమ తొలి ప్రాధాన్యం అన్నదాతకేనని స్పష్టం చేసింది! దాని కంటే కాస్త తక్కువ నిధులను కేటాయించి మలి ప్రాధాన్యం సంక్షేమ రంగమేనని చాటి చెప్పింది! ఇక, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే! అందుకే, మూడో ప్రాధాన్యంగా నగరాభివృద్ధిని ఎంచుకుంది! జీహెచ్‌ఎంసీ సహా అన్నిటికీ కేటాయింపులను భారీగా పెంచింది! వెరసి, బడ్జెట్లో ఇటు పల్లెకు, అటు పట్టణానికి పెద్దపీట వేసింది! ఈ మూడు అంశాలకే దాదాపు 50 శాతం నిధులను కేటాయించింది!
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే అతి క్లిష్టమైన రుణ మాఫీ పథకాన్ని పట్టాలపైకి ఎక్కించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లోనూ వ్యవసాయ రంగానికే పెద్దపీట వేసింది. మొత్తం బడ్జెట్లో ఒక్క వ్యవసాయ రంగానికే 24.95 శాతం నిధులను కేటాయించింది. రుణ మాఫీ పథకాన్ని సుసాధ్యం చేస్తామని రైతాంగానికి భరోసా ఇచ్చింది. ఇప్పటికే మొదలు పెట్టిన ఈ పథకానికి బడ్జెట్‌లో అన్ని స్కీముల కంటే ఎక్కువగా రూ.26 వేల కోట్లను కేటాయించింది. రుణ మాఫీ, రైతు భరోసా, రైతు కూలీల సంక్షేమం, పంటల బీమా, వరి పంటకు బోనస్, ధరణి, రైతు నేస్తం వంటి పథకాలు, కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను రూపొందించింది. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఫిబ్రవరిలో రూ.2,75,891 కోట్లతో ‘ఓట్-ఆన్-అకౌంట్’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆయన.. ఇప్పుడు దానికి రూ.15,268 కోట్ల (5.53ు)ను పెంచి రూ.2,91,159 కోట్ల పద్దును సమర్పించారు.
ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.33,457 కోట్లు! ఇందులో ఒక్క వ్యవసాయ రంగానికే రూ.72,659 కోట్లను కేటాయించింది. రైతు భరోసా, పంటల బీమా, రైతు కూలీల సంక్షేమం, ఫసల్ బీమా వంటి పథకాలతోపాటు గతానికి భిన్నంగా విద్యుత్తు సబ్సిడీని, నీటి పారుదల శాఖ కేటాయింపులను కూడా ఇందులోనే కలిపేయడం గమనార్హం. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సర్కారు.. అందుకు అనుగుణంగా బడ్జెట్లో రూ.1200 కోట్లను కేటాయించింది. ఇక, సన్నాలకు బోనస్ ఇస్తామని ప్రకటించిన సర్కారు.. దానికి కూడా బడ్జెట్లో చోటు కల్పించింది. ఆ పథకం కింద రూ.1800 కోట్లను కేటాయించింది. మరోవైపు, అర్హులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని బడ్జెట్లో తేల్చి చెప్పారు. నిజానికి, గత బడ్జెట్లో రైతు బంధు పథకానికి రూ.15,075 కోట్లు కేటాయించారు. అప్పట్లో ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తే.. కాంగ్రెస్ సర్కారు రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. అంటే, ఆ మేరకు బడ్జెట్లో నిధులను పెంచి చూపించాలి. కానీ, ఈసారి బడ్జెట్లో కూడా 15,075 కోట్లు మాత్రమే కేటాయించారు. అర్హుల పేరిట రైతు భరోసా లబ్ధిదారులపై కోత పడనుందని స్పష్టమవుతోంది.
సంక్షేమమే సగం బలం
వ్యవసాయం తర్వాత రేవంత్ సర్కారు వివిధ వర్గాల సంక్షేమానికి బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమ రంగాలకు ఏకంగా రూ.65,119 కోట్లను కేటాయించింది. వ్యవసాయానికి, సంక్షేమానికి కలిపి 47.32 శాతం నిధులను కేటాయించింది. ఎస్సీల సంక్షేమానికి అత్యధికంగా రూ.33,124 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. అయినా, గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది కాస్త తక్కువే. గత బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.6.229 కోట్లను కేటాయించగా.. ఈసారి దానిని రూ.9,200 కోట్లకు పెంచారు. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు కేటాయించిన సర్కారు.. చాలా ఏళ్ల తర్వాత ఉస్మానియా, మహిళా విశ్వవిద్యాలయాలకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించడం గమనార్హం. అలాగే, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన ఆరు హామీల్లో నాలుగింటికే గ్యారెంటీ ఇచ్చారు. రూ.500కే గ్యాస్ సిలిండర్లు; బస్సుల్లో ఉచిత ప్రయాణం; గృహ జ్యోతి; ఇందిరమ్మ ఇంటి పథకానికి నిధులు కేటాయించిన సర్కారు.. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డులిచ్చే యువ వికాసం, పింఛన్ల పెంపు గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదు. తద్వారా, ఈ ఏడాదిలో వీటి అమలు ఉంటుందా లేదా అనే దానిపై సందిగ్ధం ఏర్పడింది. వెరసి, ఆరు గ్యారెంటీల అమలుకే దాదాపు రూ.47 వేల కోట్లను కేటాయించింది. రాబోయే ఐదేళ్లలో మహిళలకు లక్ష కోట్ల వడ్డీలేని రుణాలను ఇస్తామని ప్రకటించింది.
హైదరాబాద్ చుట్టూ...
రేవంత్ రెడ్డి సర్కారు బడ్జెట్లో అధిక భాగం హైదరాబాద్ నగరం చుట్టూ తిరిగింది. హైదరాబాద్ అభివృద్ధికే రూ.10 వేల కోట్లను కేటాయించింది. గత సర్కారు ఇందుకు నాలుగైదు వేల కోట్లను కేటాయిస్తే.. రేవంత్ సర్కారు దాన్ని దాదాపు రెట్టింపు చేసింది. భూగర్భ డ్రైనేజీని ప్రక్షాళన చేస్తామని సంకల్పం చెప్పుకొంది. ఇందులో భాగంగా గత సర్కారు కేవలం రూ.182 కోట్లు కేటాయించిన జీహెచ్‌ఎంసీకి భారీగా రూ.3,086 కోట్లను కేటాయించడం విశేషం. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్న మూసీ అభివృద్ధి పథకానికి బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించడం విశేషం. అలాగే, ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో రూ.1525 కోట్లను కేటాయించింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హైడ్రాకు రూ.200 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ మెట్రోకు గతంతో పోలిస్తే కేటాయింపులు తగ్గడం గమనార్హం. నగర శివార్లలో టౌన్‌షి్‌పల నిర్మాణానికీ సంకల్పం చెప్పుకొన్నారు. నిజానికి, గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, శివారుల్లోనే కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇక్కడి మెజారిటీ సీట్లను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో, రేవంత్ సర్కారు హైదరాబాద్, శివారు ప్రాంతాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిందని, నిధుల కేటాయింపులో పెద్దపీట వేయడం ఇందులో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్‌ఎస్ సర్కారు పథకాలకు రాం రాం
బీఆర్‌ఎస్ సర్కారు అమలు చేసిన కొన్ని పథకాలకు రేవంత్ ప్రభుత్వం స్వస్తి పలికింది. అందులో ఒకటి, గొర్రెల పంపిణీ పథకం. దీనికి సంబంధించి బడ్జెట్లో అసలు ప్రస్తావన కూడా లేదు. బీఆర్‌ఎస్ సర్కారు నిరుద్యోగ భృతి కింద రూ.3000 ఇస్తామని ఐదేళ్ల కాలంలోనూ అమలు చేయలేదు. అయినా, కాంగ్రెస్ సర్కారు భృతి కింద రూ.4000 ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, బడ్జెట్లో దాని ఊసు కూడా లేదు. బీఆర్‌ఎస్ సర్కారు దళిత బంధు కింద గత బడ్జెట్లో 17,700 కోట్లు కేటాయించింది. కానీ, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అయినా, ఆ పథకం పేరు మార్చి ‘అంబేడ్కర్ అభయ హస్తం’ పేరిట పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పింది. కానీ.. దీని గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదు. కానీ, రూ.2000 కోట్లు కేటాయించారు. ఐతే ఈ నిధులను దేనికి ఖర్చు పెడతారనే స్పష్టత కరువైంది. కేసీఆర్ కిట్ వంటి పథకాలకు పేర్లు మార్చారు. అయినా.. వాటికి కూడా బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం గమనార్హం. అంతేనా.. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఇటీవల ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సల ధరలనూ సవరించారు. అయినా.. ఈ పథకానికి నిధులను పెంచడానికి బదులు తగ్గించడం విశేషం. గత ప్రభుత్వం ఈ పథకానికి రూ.1,463 కోట్లను కేటాయిస్తే.. ఈసారి రూ.1,065 కోట్లకే పరిమితం చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కల్యాణమస్తుగా పేరు మార్చినా.. గతంతో పోలిస్తే రూ.375 కోట్లను తగ్గించారు. ఈ పథకం అమల్లో భాగంగా తులం బంగారం ఇస్తామని ప్రకటించినా.. బడ్జెట్లో దాని ఊసు లేదు. కేంద్ర సాయంతో కలిపి ఇందిరమ్మ ఇళ్లకు రూ.9,184 కోట్లు కేటాయించారు. నియోజకవర్గానికి ఈ ఏడాదిలో 3,500 ఇళ్లు నిర్మిస్తామని చెప్పినా ఈ నిధులు సగం ఇళ్లకే సరిపోతాయి.
కేటాయింపులు సరే.. నిధులేవీ!?
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను విమర్శించి.. తాము వాస్తవిక దృష్టితో బడ్జెట్ రూపొందిస్తామని కాంగ్రెస్ నాయకులు గతంలో ప్రకటించారు. కానీ, గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే కాస్త ఎక్కువే పెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌కు ఇది రూ.763 కోట్లు (0.26ు) ఎక్కువ. కొన్ని కేటాయింపుల్లోనూ వాస్తవానికి దూరంగానే గణాంకాలు చూపించారు. ఉదాహరణకు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద గత బడ్జెట్లో బీఆర్‌ఎస్ సర్కారు రూ.41,259 కోట్లు చూపించింది. కానీ, వచ్చింది రూ.9,729 కోట్లే. అయినా, తాజా బడ్జెట్లో రూ.21,636 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఎంతో కొంత తగ్గించినా.. గతానుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఊహాజనితంగానే ఈ గణాంకాలు ఉండడం గమనార్హం. అలాగే, పన్నేతర రాబడి కింద బడ్జెట్‌లో రూ.35,208 కోట్లను అంచనా వేశారు. ప్రభుత్వ భూముల అమ్మకం, లీజుకివ్వడం, తనఖా పెట్టడం, హామీగా పెట్టడం (సెక్యూరిటైజేషన్) తదితరాల ద్వారా ఈ నిధులను సాధించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలోనూ పన్నేతర రాబడిని భారీగా పెట్టినా.. ఆచరణకు వచ్చేసరికి అంచనాను ఎప్పుడూ అందుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్‌లోనూ ఇదే పునరావృతమైంది. కేంద్రం గ్రాంట్లు, పన్నేతర రాబడి కిందే దాదాపు రూ.57 వేల కోట్లను ప్రతిపాదించారు. ఇందులో ఎంతమేర కోత పడితే.. ఆ మేరకు వివిధ శాఖల కేటాయింపుల్లో తగ్గించాల్సి వస్తుంది. ఇక, గత ప్రభుత్వం చేసిన అప్పు అసలు, వడ్డీకి కలిపి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.42 వేల కోట్లను కట్టామని, తాము కేవలం రూ.35 వేల కోట్లను మాత్రమే కొత్తగా అప్పు తెచ్చామని, తద్వారా దాదాపు రూ.7000 కోట్ల బాకీని అదనంగా తీర్చామని చెప్పడం బడ్జెట్ ప్రసంగంలో ఊరట.
మద్యం, రిజిస్ట్రేషన్ బాదుడు ఉంటుందా!?
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారీ బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. అందులోని గణాంకాలు భారీగా కనిపిస్తున్నా.. ఆచరణకు, ఏడాది చివరికి వచ్చేసరికి ఎప్పట్లాగే భారీ వ్యత్యాసం ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంచనాకు, ఖర్చుకు మధ్య భారీ లోటు ఉంటుందని విశ్లేషిస్తున్నారు. దానిని పూడ్చుకోవడానికి బడ్జెట్లో పరోక్షంగా ప్రతిపాదనలు పెట్టారని అంటున్నారు. మద్యం రేట్లతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీల సవరణ, మోటారు వెహికిల్ ట్యాక్సుల్లో మార్పులు ఉండవచ్చని చెబుతున్నారు. ఉదాహరణకు, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.19,884 కోట్ల రాబడి వస్తుందని గత బీఆర్‌ఎస్ బడ్జెట్లో అంచనా వేశారు. ఈసారి దానిని రూ.25,617 కోట్లకు పెంచేశారు. తద్వారా, మద్యం ధరలను పెంచుతారా!? అనే సందేహాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే, గత బడ్జెట్లో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ రాబడిని రూ.18,500 కోట్లుగా అంచనా వేసినా చివరకు రూ.14,295 కోట్లు మాత్రమే వచ్చింది. అయినా, ఈసారి రూ.18,228 కోట్లుగా అంచనా వేశారు. భూముల మార్కెట్ విలువలకు సంబంధించి ఇప్పటికే కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రేట్లను కూడా సవరించే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. అమ్మకం పన్ను, ట్రేడ్ ట్యాక్సులను కూడా భారీగా పెంచిన నేపథ్యంలో మోటారు వాహనాల పన్నుల విషయంలో ఏమైనా మార్పులు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరిగా, ఏపీ నుంచి రూ.20 వేల కోట్లకుపైగా వస్తాయని గత బడ్జెట్లో ప్రతిపాదిస్తే.. ఈసారి బడ్జెట్లో దానిని ‘సున్నా’గా చూపించడం విశేషం!!
Updated Date - Jul 26 , 2024 | 12:32 PM