ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

ABN, Publish Date - Dec 07 , 2024 | 02:49 AM

‘‘డ్రగ్స్‌, గంజాయి కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉంది. సదరు కేసులు కూడా నాలుగైదేళ్ల విచారణ తర్వాత న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. ఇకపై అలా కుదరదు. డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.

  • ఆరు నెలల్లోనే నిందితులకు శిక్ష పడేలా ఏర్పాట్లు

  • విద్యాసంస్థల్లో డ్రగ్స్‌ దొరికితే యాజమాన్యందే బాధ్యత

  • పీఈటీల లాగా డ్రగ్స్‌ గుర్తించేవారిని నియమించాలి

  • ఠాణాల్లో డాబు, దర్పం ప్రదర్శిస్తే లోపలేసెయ్యండి

  • ఫ్రెండ్లీ పోలీసింగ్‌ బాధితులకే.. నేరగాళ్లకు కాదు

  • హోం గార్డుల రోజువారీ వేతనం వెయ్యికి పెంపు

  • ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి రూ.5 లక్షలు

  • ట్రాన్స్‌జెండర్లకు ఇందిరమ్మ ఇల్లు: సీఎం రేవంత్‌ రెడ్డి

  • 2వేల మందితో ఎస్‌డీఆర్‌ఎఫ్‌.. వాహనాల ప్రారంభం

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘‘డ్రగ్స్‌, గంజాయి కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉంది. సదరు కేసులు కూడా నాలుగైదేళ్ల విచారణ తర్వాత న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. ఇకపై అలా కుదరదు. డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. 6 నెలల్లో నిందితులకు శిక్షలు పడేలా వీటి ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించాం. అంతేనా.. న్యాయ వ్యవస్థ, న్యాయవాదులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సి ఉంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. పీఈటీ తరహాలో విద్యా సంస్థల్లో మత్తు పదార్థాలను గుర్తించే వారిని కచ్చితంగా నియమించుకోవాలన్నారు. విద్యా సంస్థల్లో మత్తు పదార్థాలు పట్టుబడితే యాజమాన్యాల్ని బాధ్యుల్ని చేయాలని ఆదేశించారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా నెక్లెస్‌ రోడ్డులోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో హోంశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, డీజీపీ జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగుతోందని, ఆరు గ్యారెంటీలతోపాటు ఏడో గ్యారెంటీగా 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చే బాధ్యత తమదని చెప్పారు.


నాడు పోలీ్‌సలు రాజకీయ ఒత్తిళ్లు, ఆదేశాల మేరకే పని చేశారని, ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాది కాలంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా పైరవీలకు తావు లేకుండా సమర్థతను బట్టి వారికి తగు హోదా కల్పించామని చెప్పారు. పైరవీలకు ఆస్కారం లేకుండా పాలనను దృష్టిలో ఉంచుకుని నియామకాలు చేశామన్నారు. ‘‘నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు, హత్యలు, రేప్‌లు, ఆర్థిక నేరాలు ఉండేవి. ఇప్పుడు సైబర్‌, డ్రగ్స్‌ నేరగాళ్లు కనిపిస్తున్నారు. వీరిని కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరించాలి. అలాగే, ఇప్పుడు బీటెక్‌, ఎంటెక్‌, పీజీ, పీహెచ్‌డీలు చేసిన వారు కానిస్టేబుల్‌ ఉద్యోగంలో చేరుతున్నారు. ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌, ఏసీబీ, సీఐడీ తరహాలో వీరిలో కొందరికి డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వండి’’ అని సూచించారు. సైబర్‌ నేరాల్లో గత ఏడాది రూ.12 కోట్లు రికవరీ చేస్తే ఈ ఏడాది రూ.100 కోట్లు చేశారని తెలిపారు. ప్రమాదకర సింథటిక్‌ డ్రగ్స్‌ తెలంగాణను పట్టిపీడిస్తున్నాయని, అందుకే టీజీ న్యాబ్‌ ఏర్పాటు చేశామని, వందలాది మంది సిబ్బందిని కేటాయించామని, దాంతో, మత్తు పదార్థాలు విక్రయించే వారు రాష్ట్రంలోకి రావాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఈ వ్యసనం కాలేజీల్లోనే కాకుండా స్కూళ్లకూ పాకిందని, పిల్లలు మత్తుకు బానిసలైతే అభివృద్ధికి భంగం కలుగుతుందని, దీనిపై విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.


  • డాబు, దర్పం ప్రదర్శిస్తే లోపలెయ్యండి

పోలీస్‌ స్టేషన్లకు వచ్చి డాబు, దర్పం ప్రదర్శించే వారిని నిర్దాక్షిణ్యంగా లోపలెయ్యాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి నిర్దేశించారు. ‘‘పోలీసులు బాధితుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే క్రిమినల్స్‌తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. బాధితులకు, అన్యాయం జరిగిన వారు స్టేషన్‌కు వచ్చినప్పుడు వారికి న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉండాలి. కబ్జాకోరులు, హంతకులు, ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు’’ అని స్పష్టం చేశారు. కొందరు పోలీసుల తీరుతో అందరూ విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొందని హెచ్చరించారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ప్రజా ప్రతినిధి కూడా మర్యాదగా వ్యవహరించాలని, వాళ్లు అమర్యాదగా వ్యవహరించినప్పుడు మీరు మర్యాదగా ఉంటే కొన్ని సందర్భాల్లో చేతగానితనంగా సమాజానికి సందేశం ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు. నేరగాళ్లు ఎంతవారైనా.. రాజకీయ నాయకులైనా హోదాతో సంబంధం లేకుండా లోపలెయ్యాలని నిర్దేశించారు. ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా తీసుకున్నామని, భవిష్యత్తులో వారికి మరిన్ని అవకాశాలు పెంచుతామని, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా పలువురు ట్రాన్స్‌జెండర్లకు సీఎం రేవంత్‌ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.


  • హోంగార్డులకు రోజుకు వెయ్యి

‘‘పోలీసులతో సమానంగా అవసరమైతే అంతకంటే ఎక్కువగా హోం గార్డులు పనిచేస్తున్నారు. వారికి ప్రస్తుతం ఇస్తున్న రోజువారీ గౌరవ వేతనం రూ.921 నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతున్నాం. వీక్లీ పరేడ్‌ అలవెన్స్‌ను రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం. హోంగార్డులు ప్రమాదవశాత్తు చనిపోతే కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ప్రమాదంలో చనిపోయే హోంగార్డులకు ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం చెల్లించే విధానం లేదు. అందుకే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’’ అని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌ కార్డు ఇచ్చేందుకు విధివిధానాలు తెస్తున్నామని, హోం గార్డులకు కూడా హెల్త్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ వంటి మెరుగైన వైద్య సహాయం అందిస్తామని ప్రకటించారు. వీటన్నిటినీ జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామన్నారు. హోం గార్డు నుంచి డీజీపీ వరకు వారి పిల్లలు చదువుకునేందుకు హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ని తలదన్నేలా యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.


  • తుపాకీ పట్టి..

హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పోలీస్‌ స్టాల్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి సందర్శించారు. ఆయా విభాగాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ వద్ద వారి పనితీరును సిబ్బంది సీఎంకు వివరించారు. పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలను ప్రదర్శించగా.. సీఎం వాటిని ఆసక్తిగా పరిశీలించారు. కొన్నిటిని చేతిలోకి తీసుకుని వాటిని ఎక్కుపెట్టారు. గ్రేహౌండ్స్‌ బలగాలు, పోలీస్‌ జాగిలాల విన్యాసాల్ని తిలకించారు.


  • ఎస్‌డీఆర్‌ఎఫ్‌ వాహనాలు, లోగో ప్రారంభం

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ తరహాలో అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి నేతృత్వంలో 2 వేల మంది సిబ్బందితో ప్రత్యేకంగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వం నూతనంగా వాహనాలు, ఇతర పరికరాలు కేటాయించింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నూతన వాహనాలను సీఎం రేవంత్‌ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నూతనంగా రూపొందించిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ లోగోను ఆవిష్కరించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల ప్రత్యేక విన్యాసాల్ని తిలకించారు.


  • శాంతి భద్రతల సమస్యలు తెచ్చేందుకు కుట్రలు: భట్టి

పోలీసుల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ వ్యవస్థను బలోపేతం చేశామని, విపత్తులు వస్తే కేంద్ర బలగాలపై ఆధారపడాల్సిన పరిస్థితిని అధిగమించామని తెలిపారు. సైబర్‌ నేరాలు సవాల్‌గా మారుతున్నాయని, వాటిని అదుపు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్‌లో గందరగోళ పరిస్థితులు సృష్టించి శాంతి భద్రతల సమస్యలు తెచ్చేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, వాటిని సాగనివ్వబోమని స్పష్టం చేశారు. డయల్‌-100కు వచ్చే ఫోన్‌ల విషయంలో వేగంగా స్పందిస్తున్నామని డీజీపీ జితేందర్‌ తెలిపారు. టెక్నాలజీ వాడకంలో తెలంగాణ పోలీ్‌సలు దేశంలోనే ముందున్నారని చెప్పారు. హోం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, నిఘా విభాగం చీఫ్‌ శివధర్‌ రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, అదనపు డీజీపీ మహేష్‌ భగవత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 02:49 AM