CM Revanth Reddy: ప్రభువు ఆశీస్సులతోనే ప్రజా ప్రభుత్వం
ABN, Publish Date - Dec 26 , 2024 | 03:46 AM
‘‘నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మెదక్ చర్చికి వచ్చాను. మళ్లీ సీఎం హోదాలో ఇక్కడకు వచ్చేలా ఆశీర్వదించాలని ఆనాడు ప్రభువును మొక్కుకున్నాను.
క్రైస్తవ మిషనరీల స్ఫూర్తితో పేదలకు విద్య, వైద్యం
మెదక్ చర్చితో నాకు విడదీయరాని అనుబంధం
గతంలో పీసీసీ అధ్యక్షుడిగా వచ్చినప్పుడే..
ముఖ్యమంత్రి హోదాలో మళ్లీ వస్తానని మొక్కుకున్నా
సంక్షేమంలో దళిత, గిరిజన క్రైస్తవులకు ప్రాధాన్యం
మెదక్ చర్చిలో క్రిస్మస్ సంబరాల్లో సీఎం రేవంత్
ఏడుపాయల వనదుర్గమాత సన్నిధిలో పూజలు
సంగారెడ్డి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మెదక్ చర్చికి వచ్చాను. మళ్లీ సీఎం హోదాలో ఇక్కడకు వచ్చేలా ఆశీర్వదించాలని ఆనాడు ప్రభువును మొక్కుకున్నాను. ఆ ప్రభువు ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే మాట తప్పకుండా మళ్లీ మెదక్ చర్చికి వచ్చాను’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా మెదక్ చర్చి నూరేళ్ల వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ దిక్కూ లేనివారికి ప్రభువే దిక్కు అన్నట్లుగా క్రైస్తవ మిషనరీలు సేవాభావాన్ని చాటుతున్నాయని గుర్తుచేశారు. ఈ సేవల స్ఫూర్తితోనే రాష్ట్రంలో పేదవారికి విద్య, వైద్యం అందిస్తున్నామని తెలిపారు. గురుకులాల బలోపేతం, ఫీజు రీయింబర్స్‌మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీలకు స్ఫూర్తి క్రైస్తవ మిషనరీలేనని అన్నారు. దళిత, గిరిజన క్రైస్తవులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ, పంట బోనస్, రూ.21 వేల కోట్ల రుణమాఫీలోనూ ఈ వర్గాలకే అధికంగా లబ్ధి చేకూరిందని తెలిపారు. కాగా, వందేళ్ల కిందట ఈ ప్రాంత ప్రజలు కరువు, కాటకాలతో ఇబ్బందిపడుతూ తినడానికి తిండి కూడా లేని సమయాన చర్చి నిర్మాణం జరిగిందన్నారు. మెదక్ చర్చి నిర్మాణంలో పాల్గొన్న ప్రజలకు ప్రతిరోజూ భోజనం పెడుతూ పదేళ్లపాటు శ్రమించి అద్భుతమైన కట్టడాన్ని ఆవిష్కరించారని కొనియాడారు. పనికి ఆహార పథకం, ఉపాధి హామీ పథకాలకు ఈ చర్చి నిర్మాణ విధానమే బీజం వేసిందన్నారు. ఇలాంటి గొప్ప దేవాలయం దేశంలో ఉండడం మన తెలంగాణకే గర్వకారణమని ప్రశంసించారు. చర్చి అభివృద్ధికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి వైపు నడిచేలా ప్రభువు, భక్తుల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలోనూ తాము చిత్తశుద్దితో ఉన్నామన్నారు.
వనదుర్గ అమ్మవారి సన్నిధిలో రేవంత్..
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారి సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయానికి వచ్చిన తొలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే కావడం గమనార్హం. కాగా, ప్రభుత్వం తరఫున అమ్మవారికి సీఎం పట్టువస్ర్తాలు సమర్పించారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదమంత్రోచ్చారణల నడుమ ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. ఆయన వెంట టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, నీలం మధు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 03:46 AM