Hyderabad: హైదరాబాద్ ఆపిల్..
ABN, Publish Date - Jun 23 , 2024 | 02:46 AM
హైదరాబాద్ శివార్లో మీకు కనీసం అర ఎకరం ఫామ్ హౌస్ ఉందా? ఆ తక్కువ స్థలంలోనే ఎక్కువ రాబడి వచ్చే పంట ఏదైనా సాగు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీరు భేషుగ్గా ఆపిల్ తోట సాగు చేయొచ్చు! రాష్ట్రంలోని రైతన్నలూ ఈ దిశగా ఆలోచన చేయొచ్చు.
నగర శివారు కందుకూరులో సాగు
వేడిని తట్టుకునే అన్నా, హరిమాన్-99 రకాలు
ఒక్కో మొక్క ఖరీదు రూ.200.. 3 ఏళ్లలో ఫలసాయం
చెట్టుకు 200 కాయలు.. జూన్, డిసెంబరులో పండ్లు
పూర్తి సేంద్రియ పద్ధతిలో.. ఎరువుగా ఆవుపేడ మాత్రమే
కీటకాల నివారణ కోసం నీమ్ ఆయిల్ పిచికారీ
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/ కందుకూరు)
హైదరాబాద్ శివార్లో మీకు కనీసం అర ఎకరం ఫామ్ హౌస్ ఉందా? ఆ తక్కువ స్థలంలోనే ఎక్కువ రాబడి వచ్చే పంట ఏదైనా సాగు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీరు భేషుగ్గా ఆపిల్ తోట సాగు చేయొచ్చు! రాష్ట్రంలోని రైతన్నలూ ఈ దిశగా ఆలోచన చేయొచ్చు. మరి.. కశ్మీరు, హిమాచల్ ప్రదేశ్‌లో మాదిరిగా మనది శీతల వాతావరణం కాదు కదా? సాగుకు మన వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయా? సాగు పద్ధతులూ సంక్లిష్టమేమో? అనే సందేహాలు రావొచ్చు. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పులిమామిడిలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆపిల్ తోటను విజయవంతంగా సాగు చేస్తోంది. ఆ సంస్థ పేరు శ్రీనిఖిల్ చేతన! తమ సంస్థలోని ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా ఆపిల్ తోట సాగు చేస్తున్నారు.
మూడేళ్లలో ఫలసాయం వచ్చే రకాన్ని ఎంచుకొని, 2021లో సాగు చేశారు. ఇప్పుడక్కడ చెట్లన్నీ విరగకాసిన కాయలతో ఉండటాన్ని చూసి సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి ఫలసాయం మొదలయ్యాక ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు)లో ఫలసాయం వస్తుంది. కోసిన వెంటనే పూత మొదలవుతుంది. తాము సాగు చేసిన విధానాన్ని సంస్థ నిర్వాహకులు శార్దూల్ జోషీ వివరించారు. ఆయన వివరాల ప్రకారం.. ఎండ ఎక్కువగా ఉండే స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు ప్రత్యేకంగా అన్నా, హరిమాన్ 99 అనే రకాల మొక్కలను సాగు కోసం ఎంచుకున్నారు. ఈ రెండు రకాలను కూడా హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు. ఒక్కో మొక్క (అంటుకట్టిన) కోసం రూ. 150 నుంచి 200 వరకు చెల్లించారు. 2021లో ఎకరా విస్తీర్ణంలో 160 మొక్కలు నాటారు. మొక్కకు మొక్కకు మధ్య 11 అడుగుల దూరం, సాలుకు సాలుకు మధ్య 16 అడుగుల దూరం పాటించారు. మొక్కలకు డ్రిప్ విధానంలో నీరు పెడుతున్నారు.
ఎరువుగా ఆవుపేడనే వాడుతున్నారు. దోమలు, ఇతర కీటకాల నివారణ కోసం నిమ్మ నూనె పిచికారీ చేస్తున్నారు. 25 మిల్లీలీటర్ల నిమ్మ ఆయిల్ 25 లీటర్ల నీటిలో కలిపి.. పూత నుంచి కాత వరకు మూడు, నాలుగుసార్లు పిచికారీ చేస్తున్నారు. ఎలాంటి క్రిమిసంహాకర మందులు వాడటం లేదు. ఆవులు వారి ప్రాంగణంలోనే ఉండటంతో వాటి పేడనే ఎరువుగా వేస్తున్నారు. భవిషత్తులో దీన్ని గ్రీన్ హౌస్ లేదా పాలీహౌ్‌సగా మార్చి మరింత దిగుడులు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నగర శివార్లలో కొవిడ్ తర్వాత విల్లాలు, ఫామ్‌హౌ్‌సల కల్చర్ బాగా పెరిగింది. వేయి గజాలపైనే విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించకుకుంటున్నారు. వీరంతా ఇపుడు ద్రాక్షా, యాపిల్ తోటలను తమ పెరట్లోనే పెంచుకునేందుకు ఆసక్తిచూపుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కూడా తోడైతే కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో పండే ఆపిల్ హైదరాబాద్ శివార్లలో కూడా విరివిగా సాగు చేసేందుకు అవకాశాలు మెరుగుపడతాయి.
Updated Date - Jun 23 , 2024 | 02:46 AM