ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: తప్పెవరిది.. శిక్ష ఎవరికి?

ABN, Publish Date - Aug 27 , 2024 | 03:12 AM

ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల కొనుగోలు అంటే డబ్బున్నోళ్లకు పెట్టుబడులేమోగానీ.. సామాన్యులు, మధ్యతరగతివారికి ఒక జీవితకాల స్వప్నం!

హైదరాబాద్‌ చందానగర్‌లో జీహెచ్‌ఎంసీ అనుమతులతో నిర్మించిన జి+3, జి+4 భవనాలను ఇటీవలే హైడ్రా కూల్చేసింది! ఆ భవనాలు ఈర్ల చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో ఉన్నందునే కూల్చేశామని హైడ్రా చెబుతోంది! అంతేకాదు.. ఆ భవనాల నిర్మాణ పనులు పూర్తి కాకముందే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం గమనార్హం.

ప్రగతినగర్‌లో.. హెచ్‌ఎండీఏ అనుమతులతో స్టిల్ట్‌ ప్లస్‌ ఐదంతస్తులతో నిర్మించిన 3 భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది! ఇక్కడా.. ఆ విభాగం చెప్పిన మాట అదే.. ఆ భవనాలు ఎర్రకుంట చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని!!

చెరువులను పునరుద్ధరించాలన్న సర్కారు ఆలోచన మంచిదే! నిబంధనలను మీరి అడ్డగోలుగా నిర్మించిన అక్రమ కట్టడాలను చట్టప్రకారం కూల్చివేయడాన్నీ ఎవరూ తప్పు పట్టరు! కానీ.. అవి అడ్డగోలు నిర్మాణాలని తెలిసీ అనుమతులు ఇచ్చిన అధికారులపై మరి చర్యలు ఏవి? బిల్డర్లు, అధికారులు కుమ్మక్కై కట్టిన ఇళ్లు, ఫ్లాట్లను జీహెచ్‌ఎంసీ/ హెచ్‌ఎండీఏ/ రెరా అనుమతులు ఉన్నాయి అనే భరోసాతో కొన్న సామాన్యుల పరిస్థితి ఏంటి? వాటిని చూపి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాక.. హైడ్రా వచ్చి కూల్చేస్తే రుణాలు ఎలా తీర్చాలి? సామాన్యులు చేతులెత్తేస్తే.. బ్యాంకులకూ నష్టమే కదా? ఇక్కడ తప్పెవరిది? శిక్ష ఎవరికి?

  • అధికారులు అడ్డదారి తొక్కి అనుమతులిస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి?

  • హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ ఆమోదం లభించిందన్న ధైర్యంతో ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు కొనేవారి పరిస్థితేంటి?

  • బ్యాంకులు లోన్లు ఇవ్వడానికీ ఆధారం అవే!

  • కొన్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే ఏంచేయాలి?

  • లోన్‌ తీర్చకుంటే బ్యాంక్‌ ఊరుకుంటుందా?

  • రుణాల ఎగవేతతో బ్యాంకులూ నష్టాల్లోకి

  • అధికార్లపై సర్కారు చర్యలెందుకు తీసుకోదు?

  • తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సామాన్యులు

హైదరాబాద్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల కొనుగోలు అంటే డబ్బున్నోళ్లకు పెట్టుబడులేమోగానీ.. సామాన్యులు, మధ్యతరగతివారికి ఒక జీవితకాల స్వప్నం! అందుకే వాటిని కొనుగోలు చేయడానికి ముందు వారు చూసేది ఒక్కటే.. అన్ని అనుమతులూ ఉన్నాయా లేవా అని. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అనుమతులు ఉన్న లే-అవుట్లలో నిర్మించిన ఇళ్లు, రెరా అనుమతి ఉన్న అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నామంటే.. వారికి ఒక భరోసా!! బ్యాంకులు సైతం ఆ అనుమతులు చూసే లోన్లు ఇస్తాయి.


రూ.50 లక్షలో.. రూ.60 లక్షలో లోన్‌ తీసుకుని వాటిని కొనుగోలు చేసే వేతనజీవులు.. దాదాపు 20 ఏళ్లపాటు నెలవారీ కిస్తీల రూపంలో తాము తీసుకున్న రుణానికి రెట్టింపుపైగానే చెల్లిస్తారు!! తీరా.. తాము కొన్న ఇల్లు ఏ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనో, బఫర్‌ జోన్‌లోనో ఉందంటూ ప్రభుత్వానికే చెందిన మరో విభాగం వచ్చి దాన్ని కూల్చేస్తే? ప్రస్తుతం హైదరాబాద్‌లో లక్షలాది మంది ఆందోళన ఇది! ఒకప్పుడు వందలాది చెరువులు, కుంటలతో కళకళలాడిన హైదరాబాద్‌ కాలక్రమంలో ఎనెన్నో ఆక్రమణలు, కబ్జాలకు గురైంది. నగరంలో ఇప్పుడు ఏ భవనం ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంది? ఏది బఫర్‌ జోన్‌? ఎక్కడ చెరువును ఆక్రమించి వెంచర్‌ వేశారు?.. తదితర ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం.


ఏది సీలింగ్‌ ల్యాండ్‌? ఏది ప్రభుత్వ భూమి? ఎఫ్‌టీఎల్‌/బఫర్‌ జోన్‌ నిబంధనలేమిటి?.. లాంటి విషయాలు సామాన్యులకు తెలిసే అవకాశమే లేదు. అందుకే.. హెచ్‌ఎండీఏ/జీహెచ్‌ఎంసీ అనుమతుల ఆధారంగా గుడ్డిగా ఆయా ప్రాజెక్టుల్లో కొనుగోలుకు సిద్ధమవుతారు. కానీ, తాజా పరిణామాలు చూస్తుంటే ఆయా సంస్థలు ఇస్తున్న అనుమతులకు విలువ లేదా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదో ఒక ఉల్లంఘన పేరుతో హైడ్రా అధికారులు భవనాలను కూల్చి వేస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఆ ఉల్లంఘనల సంగతి తెలియక.. రూ.లక్షలు, రూ.కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు/ఫ్లాటు కొనుగోలు చేసిన వారికి కంటిమీద కునుకులేకుండా పోతోంది.


ఉదాహరణకు.. రెండు దశాబ్దాల క్రితం ఒక రాజకీయ నాయకుడు వనస్థలిపురం పరిధిలో ఉన్న కప్పల చెరువును పూడ్చివేసి లే-అవుట్‌ వేసి స్థలాలు విక్రయించాడు. ఆ స్థలంలో ప్లాట్లు వేసి విక్రయాలు చేసిన వారు కొందరైతే.. ఇళ్లు నిర్మించి అమ్మకాలు చేసిన వారు మరికొందరు. నాడు అక్కడ ఇల్లు నిర్మించుకున్న వారు ఇప్పుడు అసలు విషయం తెలిసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అలాగే సరూర్‌నగర్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ అధికారులు యథేచ్ఛగా అనుమతులివ్వడంతో అక్కడ బిల్డర్లు పెద్ద ఎత్తున ఫ్లాట్లు, ఇళ్లు నిర్మించి విక్రయించారు.


అలాంటి నిర్మాణాలు 1000కిపైగా ఉన్నట్టు సమాచారం. వాటిని కొన్నవారంతా ఇప్పుడు భయపడుతున్నారు. నిజానికి ఆ భూమిలో ఎలాంటి కట్టడాలకూ అనుమతి ఇవ్వొద్దని 2011 ఆగస్టు 20న అప్పటి హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎల్‌ఆర్‌ నంబర్‌ ఎస్‌8/10057/2010/2631 ద్వారా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. అయినా జీహెచ్‌ఎంసీ అధికారులు యథేచ్ఛగా అనుమతులు ఇచ్చేయడం గమనార్హం. ఆ రెండుచోట్లే కాదు.. రామాంతపూర్‌, మల్కాజ్‌గిరి, అత్తాపూర్‌, శేర్‌లింగంపల్లి.. ఇలా భాగ్యనగరంలో అనేక చోట్ల వందల చెరువులు కబ్జాకు గురై కనుమరుగయ్యాయి. వాటికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అడ్డగోలుగా ఎన్‌వోసీలు ఇచ్చారు.


  • విలువ ఉందా?

సాధారణంగా పంచాయతీ అనుమతులతో నిర్మించే ఫ్లాట్లు/ఇళ్ల ధర తక్కువగా ఉంటుంది. అదే హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అనుమతులతో నిర్మించేవాటిలో ధర ఎక్కువగా ఉంటుంది. అయినా ప్రభుత్వ అనుమతులున్నాయనే భరోసాతో సామాన్యులు వాటిని కొనుగోలు చేయడానికే మొగ్గుచూపుతారు. ఇదే అవకాశంగా.. పలువురు బిల్డర్లు తప్పుడు మార్గాల్లో, లంచాలు మేపి.. కావాల్సిన అనుమతులు పొంది భవనాలు కట్టి, అమ్మకాలు సాగిస్తున్నారు. నిర్మాణాలు మొదలు కాకముందే ప్రీలాంచింగ్‌ ఆఫర్ల పేరుతో భారీగా లాభాలు పొందుతున్నారు.


కానీ తాజా పరిణామాలతో.. అసలు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, రెరా ఇస్తున్న అనుమతులకు విలువ ఉందా? లేదా? అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులే అడ్డదారి తొక్కితే కొనుగోలుదారులు ఇక ఎవరిని నమ్మాలి? అధికారులను నమ్మి కొన్నాక హైడ్రా కూల్చివేస్తే బ్యాంకు లోను దేని కోసం కట్టాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనివల్ల.. బ్యాంకులు కూడా తీవ్ర నష్టాలను మూటకట్టుకునే పరిస్థితి ఉందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఇలా వందలాది భవనాలను కూల్చేస్తే ఆస్తి పన్ను వసూళ్లపైనా ప్రభావం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


  • 111 జీవో పరిధిలో నిర్మాణాలకుహైడ్రా దూరం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా.. ప్రస్తుతానికి 111 జీవో పరిధిలోని నిర్మాణాల జోలికి వెళ్లే ఆలోచనలో లేనట్లు తెలిసింది. హైడ్రా పరిధికి సంబంధించి విధానపరమైన స్పష్టత రావాల్సి ఉండటంతో ఆ జీవో పరిధిలోని 84 గ్రామాల్లో ఉన్న నిర్మాణాలపై హైడ్రా ఇప్పుడు దృష్టి సారించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Aug 27 , 2024 | 07:00 AM

Advertising
Advertising
<