Sangareddy: సింగూరు ప్రాజెక్టు భద్రమేనా?
ABN, Publish Date - Sep 05 , 2024 | 05:05 AM
మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
భారీగా వరద.. పొంచి ఉన్న ప్రమాదం!
గత ఏడాది ఆనకట్టకు బుంగ
నాడు తాత్కాలిక మరమ్మతులతో సరి
శాశ్వత మరమ్మతులు చేపట్టని వైనం
ప్రస్తుతం 29.9 టీఎంసీలకు 27 టీఎంసీల రాక
ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులో 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉంది. తాజా వర్షాలతో భారీగా వరద నీరు పోటెత్తుతోంది. 29.917 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో ప్రస్తుతం 27 టీఎంసీలకు చేరడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అలల తాకిడితో గత ఏడాది కట్ట లోపలి భాగంలోని రివిట్‌మెంట్ దెబ్బతిని బుంగపడింది.
అప్పుడు చిన్న పరిమాణంలో ఉన్న కంకర చిప్స్‌ను సంచుల్లో నింపి దానికి అడ్డుగా వేశారు. అయితే ఆ సంచులన్నీ చిరిగిపోయి కంకర చిప్స్ చెల్లాచెదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ రిజర్వాయర్‌లో అలల తాకిడి పెరిగింది. ఈసారీ కంకర చిప్స్ సంచులతో తాత్కాలిక మరమ్మతులు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నాడు సమయం లేకపోవడంతో కంకర చిప్స్ బ్యాగులతో తాత్కాలిక మరమ్మతులకే పరిమితమయ్యారు కానీ శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. ఈసారి కూడా కొత్తగా కంకర చిప్స్‌ను నింపి దెబ్బతిన్న రివిట్‌మెంట్ వద్ద పరిచారు.
కట్టకు ఇబ్బంది తలెత్తకుండా గ్రౌట్ కర్టెన్ విధానం ద్వారా రివిట్‌మెంట్‌ను సరిచేయొచ్చు. కానీ ఇది పట్టని వ్యవహారంగా మారింది. ఇందుకు అధికారుల అలసత్వమా.. నిధుల లోపమా అనేది చర్చనీయాంశమవుతోంది. గతేడాది అప్పటి సంగారెడ్డి కలెక్టర్ శరత్ రిజర్వాయర్ కట్టకు పడిన బుంగను పరిశీలించారు. ఇక వర్షాలకు భారీగా వరద ప్రవాహం సింగూరుకు పోటెత్తుండటంతో ప్రాజెక్టులో నీరు 28 టీఎంసీలకు చేరగానే గేట్లు ఎత్తడానికి సిద్ధమవుతున్నారు. సుమారు 45వేల క్యూసెక్కుల వరద రావడంతో నేడు ప్రాజెక్టు ఫుల్‌ట్యాంక్ లెవల్‌కు చేరనుంది. వరద ప్రవాహం కొనసాగితే నాటి బుంగ మళ్లీ బయటపడే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే కట్టకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఇక ప్రాజెక్టుకు 17 గేట్లు ఉండగా ఒక గేటు నుంచి నీరు లీకేజీ అవుతున్నా గుర్తించలేకపోయారు. రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో ప్రస్తుతం లీకేజీకి మరమ్మతులు చేసే పరిస్థితి లేకుండాపోయింది.
Updated Date - Sep 05 , 2024 | 05:05 AM