Tummidihatti Dam: వార్ధా నదిపై బ్యారేజీ..?
ABN, Publish Date - Aug 16 , 2024 | 03:10 AM
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి.. ఆ నీళ్లను గ్రావిటీతో ఎల్లంపల్లికి తరలిస్తామని చెబుతున్న కాంగ్రెస్ సర్కారు.. దానికి ప్రత్యామ్నాయంగా మరో రెండు ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అక్కడి నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీరు
తుమ్మిడిహెట్టి దిగువన రబ్బర్ డ్యామ్
గ్రావిటీతో సుందిళ్లకు ప్రాణహిత నీరు
అధికారుల పరిశీలనలో కొత్త ప్రాజెక్టులు
తుమ్మిడిహెట్టి బ్యారేజీపై పునరాలోచన
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి.. ఆ నీళ్లను గ్రావిటీతో ఎల్లంపల్లికి తరలిస్తామని చెబుతున్న కాంగ్రెస్ సర్కారు.. దానికి ప్రత్యామ్నాయంగా మరో రెండు ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తుమ్మిడిహెట్టి ఎగువన వార్ధా నదిపై ఒక బ్యారేజీ, దిగువన ప్రాణహితపై ఒక రబ్బర్ డ్యామ్ కడితే ఎలా ఉంటుందని యోచిస్తున్నట్లు సమాచారం. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండటం తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర అంగీకారం తెలిపినా.. పనులు ప్రారంభిస్తే ఆ రాష్ట్రం సహకరించే అవకాశాల్లేవని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ బ్యారేజీ నిర్మాణంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
కొత్త ప్రతిపాదనల ప్రకారం.. వార్ధా ప్రాజెక్టులో భాగంగా కట్టే బ్యారేజీ నుంచి నీటిని ఎల్లంపల్లికి మళ్లించనున్నారు. దీనికోసం ఇప్పటికే ప్రాణహిత-చేవెళ్ల కింద 71.5 కి.మీ. దాకా(మైలారం దాకా) కట్టిన కాల్వలను వినియోగించుకోనున్నారు. మైలారం వద్ద పంప్‌హౌస్ నిర్మించి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయనున్నారు. తుమ్మిడిహెట్టి దిగువన ప్రాణహితపై కట్టే రబ్బర్ డ్యామ్ నుంచి గ్రావిటీతో నీటిని.. గోదావరిపై ఎల్లంపల్లి దిగువన ఉన్న సుందిళ్ల బ్యారేజీకి మళ్లించనున్నారు. రబ్బర్ డ్యామ్‌కు మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపే అవకాశాలుండవని భావిస్తున్నారు.
గతంలోనే వార్ధాపై కసరత్తు..
ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేట వద్ద రూ.4,874 కోట్లతో వార్ధా నదిపై ప్రాజెక్టు కట్టాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. డీపీఆర్‌ను సిద్ధం చేసి, అనుమతుల కోసం 2023 మే 11న కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో దాఖలు చేసింది. సీడబ్ల్యూసీలోని కొన్ని విభాగాలు డీపీఆర్ పరిశీలనను పూర్తిచేసినప్పటికీ.. గత ప్రభుత్వం వార్ధాకు పాలనా అనుమతులు ఇవ్వలేదు. దీంతో ప్రాజెక్టుకు టెండర్లు పిలవలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును యధాతథంగా కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. వార్ధాపై బ్యారేజీ, ప్రాణహితపై రబ్బర్ డ్యామ్ కట్టే ప్రతిపాదనలకు అధికారులు ఏకకాలంలో తుదిరూపు ఇచ్చి.. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అందిస్తారని తెలుస్తోంది.
తక్కువ వ్యయంతో.. ఎక్కువ ఆయకట్టు..
ప్రాజెక్టుల నిర్మాణానికి భారీగా నిధులు సమకూర్చే ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో లేవు. పెద్ద మొత్తంలో అప్పులు ఉండటంతో తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాధించే సూత్రంతోనే రబ్బర్ డ్యామ్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. గత ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులపై రూ.1.80 లక్షల కోట్లకు పైగా ఖర్చుచేసినా.. ఆశించిన స్థాయిలో ఆయకట్టుకు నీరందలేదని కాంగ్రెస్ సర్కారు గుర్తించింది.
అయితే కీలక ప్రాజెక్టుల హెడ్‌లు కట్టినా.. కాలువల నిర్మాణం చేపట్టలేదు. అందువల్లే సొమ్మంతా హెడ్‌వర్క్‌లకే ఆవిరై పోయింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో లింక్-1లో రూ.27 వేల కోట్లను మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ఖర్చుచేయగా.. కీలకమైన మేడిగడ్డ కుంగిపోయింది. దీన్ని శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించడానికి మూడేళ్లకుపైగా పట్టే అవకాశం ఉంది. దాంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఇచ్చే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించే తుమ్మిడిహెట్టికి దిగువన రబ్బర్ డ్యామ్ చేపట్టే ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారని సమాచారం.
Updated Date - Aug 16 , 2024 | 03:10 AM