ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: 9 రోజుల వేడుక

ABN, Publish Date - Nov 25 , 2024 | 02:15 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • డిసెంబరు 1 నుంచి 9 వరకు.. రాష్ట్రమంతా ప్రజాపాలన విజయోత్సవాలు

  • ఏడాది పాలన సందర్భంగా సర్కారు సంబరాలు

  • పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

  • పెద్దపల్లిలో యువతతో సీఎం రేవంత్‌రెడ్డి సభ

  • గ్రూప్‌-4 అభ్యర్థులకు నియామక పత్రాలు

  • 26 నియోజకవర్గాల్లో గురుకులాలకు శ్రీకారం

  • గోషామహల్లో ఉస్మానియా ఆస్పత్రికి భూమిపూజ

  • కేబీఆర్‌ పార్కు చుట్టూ కూడళ్ల అభివృద్ధికీ..

  • దామరచర్లలో విద్యుత్తు కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఉత్సవాల్లో భాగంగా కీలకమైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 9 రోజుల పాటు జరిగే సంబరాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కీలక భూమికగా ఉండేలా కార్యాచరణను రూపొందిస్తోంది. ఈ మేరకు శాఖలవారీగా ఒకటో తేదీ నుంచి వరుసగా నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సమీకృత గురుకుల పాఠశాల సముదాయాల భవనాలకు భూమి పూజ నిర్వహిస్తారు. ఇప్పటికే 28 నియోజకవర్గాల్లో ఈ భవనాల పనులు మొదలయ్యాయి. మరో 26 నియోజకవర్గాల పరిధిలో సమీకృత గురుకులాలలను ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో వీటికి శంకుస్థాపన చేయనున్నారు.


ఒకటో తేదీ నుంచి 7 వరకు అన్ని గ్రామాల్లో సీఎం కప్‌ క్రీడా పోటీలను నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా స్పోర్ట్స్‌ అథారిటీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలను నిర్వహిస్తుంది. డిసెంబరు 4న పెద్దపల్లిలో యువతతో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. గ్రూప్‌-4 ఉద్యోగాలు సాధించిన వారికి ఈ సభలో నియామకపత్రాలను అందజేయనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 16 కొత్త నర్సింగ్‌ కాలేజీలతో పాటు, 28 పారా మెడికల్‌ కాలేజీలను నెలకొల్పనున్నారు. వీటితో పాటు కొత్తగా 213 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువస్తారు. ట్రాన్స్‌జెండర్లకు వైద్య సేవలు అందించేందుకు జిల్లాకో ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు వీరిని వాలంటీర్లుగా నియమిస్తారు. అలాగే గోషామహల్‌లో నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి భూమి పూజ చేస్తారు. ఆరంఘర్‌-జూపార్క్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఇటీవల నిర్మాణం పూర్తయిన ఆరు మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ప్రారంభిస్తారు. కేబీఆర్‌ పార్కు సమీపంలో ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌లతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు రూ.826 కోట్ల భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక సమీపంలో దాదాపు 106 స్టాళ్లతో ఇందిరా శక్తి మహిళా బజార్లను ప్రారంభిస్తారు.


తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ భవనానికి శంకుస్థాపనతో పాటు అటవీ పర్యాటక శాఖల ఆధ్వర్యంలో సఫారీ థీమ్‌ పార్క్‌, బొటానికల్‌ గార్డెన్లను ప్రారంభిస్తారు. ఘట్‌కేసర్‌లో బాలికలకు ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే పనులు జరుగుతున్న మల్లేపల్లి, మేడ్చల్‌, నల్లగొండ ఏటీసీలను ప్రారంభిస్తారు. దామరచర్లలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్‌ను జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 237 సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో తరగతులను ప్రారంభిస్తారు. కొత్తగా తలపెట్టిన స్పోర్ట్‌ యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు. ఐటీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏఐ సిటీ ఏర్పాట్లతో పాటు పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. విజయోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీల్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. అన్ని స్థాయిల్లోని విద్యార్థులను ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. శాఖల వారీగా నిర్ణీత ప్రణాళిక ప్రకారం సంబంధిత మంత్రుల సారథ్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. మంత్రులతో పాటు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని అధికారులకు సీఎం పిలుపునిచ్చారు.

Updated Date - Nov 25 , 2024 | 02:15 AM