Nirmal: జీవో 510తో అన్యాయం.. జీవితం ముగిస్తున్నా
ABN, Publish Date - Dec 10 , 2024 | 05:00 AM
జీవో 510తో తనలాంటి ఒప్పంద ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ వకుళాభరణం భరత్‌కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్‌లో సోమవారం జరిగిందీ విషాదం.
నిర్మల్‌లో ఆరోగ్య ఒప్పంద ఉద్యోగి భరత్‌కుమార్ ఆత్మహత్య
తన చావుతోనైనా అందరికీ న్యాయం జరగాలంటూ సూసైడ్‌నోట్
నిర్మల్ , డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జీవో 510తో తనలాంటి ఒప్పంద ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ వకుళాభరణం భరత్‌కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్‌లో సోమవారం జరిగిందీ విషాదం. వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన భరత్.. ఆరేళ్లుగా తాను ఎంత మనోవేదనకు గురైందీ సూసైడ్ నోట్‌లో రాశా డు. ‘‘2018 డీఎస్సీ ద్వారా.. ఆరోగ్యశాఖ ఆర్‌ఎన్‌టీసీపీ విభాగంలో సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్‌సూపర్‌వైజర్‌గా ఉద్యోగం పొందాను. ఇదే శాఖలో నాకన్నా హోదా తక్కువ ఉన్నవారికి జీతం ఎక్కువగా రావడం.. నా జీతం మాత్రం పెరగకుండా కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉండిపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాను. నాలాంటి వాళ్లను రెగ్యులరైజ్ చేసే విషయంలో జీవో 510 అన్యాయం చేసింది’’ అని భరత్ ఆ లేఖ లో పేర్కొన్నాడు.
ఆ జీవోవల్ల తీవ్రంగా నష్టపోయామని.. జీవో 16ను కూడా అమలు చేయొద్దంటూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తీరని అన్యాయానికి గురయ్యామని వాపోయాడు. ‘‘ఉద్యోగం రెగ్యులర్ అవుతుందని ఎంతో ఆశతో ఎదురు చూశా కానీ అది జరగక తీవ్ర మనోవేదనకు గురయ్యాను. నా భర్య పల్లవికి అన్యాయం చేస్తున్నాను. కొడుకు దేవా(2)ను వదిలి వెళ్లిపోతున్నాను’’ అని ఆవేదన వెలిబుచ్చాడు. తనకు రావాల్సిన పీవోఎల్ బకాయిలను తన భార్యకు, తల్లికి ఇప్పించాలని సహచర ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలను ఆ లేఖలో కోరాడు. ‘‘నా ఆత్మహత్యతో అయినా మిగతా వారికి న్యాయం జరగాలి. ఈ విషయం రాష్ట్రస్థాయిలో తెలిసేలా చూడండి’’ అంటూ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. తన సహచర ఉద్యోగులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు అందరికీ రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. భరత్ కుటుంబానికి న్యాయం చేయాలని.. రూ.10 లక్షలు పరిహారం, అతడి భార్యకు ఉద్యోగం ఇవ్వాలని కృష్ణమోహన్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Updated Date - Dec 10 , 2024 | 05:00 AM