ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Group-1: జీవో 29పై వివాదం అందుకే!

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:11 AM

రాష్ట్రంలో గ్రూప్‌-1 ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 29 పెద్ద వివాదాన్నే రేపుతోంది. ఈ జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, దీనిని రద్దు చేయాలని అభ్యర్థులు చేస్తున్న ఆందోళన రాజకీయ రంగు పులుముకుంది.

  • మెయిన్స్‌కు మెరిట్‌ను గంపగుత్తగా

  • అమలు చేయడంపై అభ్యంతరం!

  • అన్యాయం జరుగుతోందంటున్న బీసీ, ఎస్సీ,

  • ఎస్టీ అభ్యర్థులు.. జీవో 29 రద్దుకు డిమాండ్‌

  • జీవో 55 సరైనదన్న విశ్లేషణలు

హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రూప్‌-1 ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 29 పెద్ద వివాదాన్నే రేపుతోంది. ఈ జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, దీనిని రద్దు చేయాలని అభ్యర్థులు చేస్తున్న ఆందోళన రాజకీయ రంగు పులుముకుంది. సోమవారం నుంచి నిర్వహించ తలపెట్టిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేసి.. మళ్లీ పరీక్షలను రీ షెడ్యూల్‌ చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవో 29లో ఏముంది? దీనిపై వివాదం ఎందుకు తలెత్తిందన్న అంశాలను పరిశీలిస్తే.. గ్రూప్‌-1 ఉద్యోగాలకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 563 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.


ఇందులో 354 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా ఇతర రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. ఇవి పోగా మిగిలిన 209 పోస్టులకుగాను 1ః50 నిష్పత్తిలో ప్రిలిమినరీ పరీక్షలో టాప్‌ 10,450 ర్యాంకులు సాధించిన వారందరినీ మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. వీరిలో టాప్‌ మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కూడా ఉంటారు. ఇక 354 పోస్టులకు 1ః50 నిష్పత్తి చొప్పున 17,700 మంది రిజర్వ్‌డ్‌ కేటగిరీల అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ జీవో నెంబర్‌ 29 కింద మొత్తం 563 పోస్టులకూ రిజర్వేషన్‌ కేటగిరీతో నిమిత్తం లేకుండా 1ః50 నిష్పత్తి ప్రకారం మొత్తం టాప్‌ 28,150 ర్యాంకులు సాధించిన వారందరినీ గుంపగుత్తగా మెయిన్స్‌కు ఎంపిక చేశారని అభ్యర్థులు చెబుతున్నారు.


అయితే ఈ విధానంలో ఒకవేళ ఏదైనా రిజర్వ్‌డ్‌ కేటగిరీకి అభ్యర్థులు తక్కువ పడితే 28,150 తరువాతి వారిని తీసుకుంటున్నారని, ఓపెన్‌ కేటగిరీ కింద అర్హత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులను రిజర్వేషన్‌ కేటగిరీలో కలుపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇది రూల్‌ ఆప్‌ రిజర్వేషన్‌కు పూర్తి విరుద్ధమని పేర్కొంటున్నారు. అందువల్ల జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జీవో 55కు అనుగుణంగా మొత్తం 563 పోస్టులకు ఎంపిక చేపడితే 28,150 మందికి మాత్రమే మెయిన్స్‌కు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. కానీ.. జీవో 29వల్ల అదనంగా మరో 3,233 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేశారని, దీంతో మొత్తం అభ్యర్థులు 31,383 మంది అయ్యారని వివరిస్తున్నారు. జీవో 55 ప్రకారమే మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయాలంటున్నారు.


  • జీవోలు ఏం చెబుతున్నాయి?

జీవో 29లో రిజర్వేషన్‌ల ప్రకారం కాకుండా.. నేరుగా మల్టీజోన్‌ పోస్టుల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్పుడు రిజర్వుడు కేటగిరీల్లో అభ్యర్ధుల సంఖ్య 1ః50 నిష్పత్తి కంటే తక్కువగా ఉంటే, ఆ తరువాత మెరిట్‌ వారిని కూడా అదనంగా తీసుకుంటారు. తెలంగాణ స్టేట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనల్లోని రూల్‌ 22, 22ఏ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. ఇందుకోసం జీవో 55లోని అంశం ‘బి’లో మార్పులు చేసి జీవో 29ని ప్రభుత్వం జారీ చేసింది. జీవో 55 ప్రకారమైతే.. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను మల్టీజోన్‌ వారీగా ఉన్న పోస్టులకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అనుసరిస్తూ కమ్యూనిటీ, జెండర్‌, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, స్పోర్ట్స్‌ తదితర కేటగిరీల్లో 1ః50 నిష్పత్తిలో గుర్తిస్తారు. దీని ప్రకారం గతంలో 503 పోస్టులకు 1ః50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండేది.

Updated Date - Oct 21 , 2024 | 03:11 AM