Cotton Farmers: పత్తి రైతుకు ఎంత కష్టం!
ABN, Publish Date - Nov 05 , 2024 | 03:26 AM
సాగులో భారీగా పెరిగిన పెట్టుబడి వ్యయం.. ఆపై అకాల వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పడిపోయిన దిగుబడులతో దిగాలుగా ఉన్న పత్తిరైతు వచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే మద్దతు ధర కరువవుతోంది.
అకాలవర్షాలతో పడిపోయిన దిగుబడులు
దొరకని మద్దతు ధర... సీసీఐ కొర్రీల ఫలితమే
తేమ, నాణ్యత పేరుతో తక్కువ ధరకు కొనుగోళ్లు
నిబంధనలు చూపి కౌలు రైతులకు మొండిచేయి
మిల్లులకు కాసులు కురిపిస్తున్న సీసీఐ వైఖరి
వరంగల్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): సాగులో భారీగా పెరిగిన పెట్టుబడి వ్యయం.. ఆపై అకాల వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పడిపోయిన దిగుబడులతో దిగాలుగా ఉన్న పత్తిరైతు వచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే మద్దతు ధర కరువవుతోంది. సీసీఐ పలు నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతుండటంతో ఆశించిన ధర లభించడం లేదు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దారుణం. కౌలురైతుల నుంచి పత్తిని సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో ఆ రైతులు తలపట్టుకుంటున్నారు. సీసీఐ ఽవైఖరితో పత్తి రైతులు తమ దిగుబడులను జిన్నింగ్ మిల్లులు, ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలంలో 43,76,043 ఎకరాల్లో పత్తి సాగైంది. 25.33లక్షల మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని మార్కెట్ శాఖ అంచనావేసింది. మే నెలలో ఆశించిన స్థాయిలో చినుకులు పడకపోవడంతో విత్తిన గింజలు మొలకెత్తలేదు. ఫలితంగా జూన్ చివర్లో రైతులు మరోసారి పత్తి విత్తనాలు వేశారు.
మొక్కలు ఏపుగానే పెరిగినా సెప్టెంబరు, అక్టోబరులో అకాల వర్షాలు మంచి దిగుబడిపై పత్తి రైతులు పెట్టుకున్న ఆశల్ని చిదిమేశాయి. చేలల్లో నీరు చేరడంతో వేరు సంబధిత తెగుళ్లు విజృంభించాయి. గులాబీ పురుగు వ్యాప్తి కూడా పెరిగింది ఫలితంగా ఎకరానికి 8క్వింటాళ్ల నుంచి 12క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడి. నాలుగైదు క్వింటాళ్లకే పరిమితమవడం రైతులను కుంగదీసింది. పత్తికి కేంద్రం క్వింటాకు రూ.7,521 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర రైతులకు రావడం లేదు. కారణం పంటలో తేమ శాతం 8శాతం లోపే ఉండాలని, పత్తి పింజ పొడువు 29.5 మి.మీ నుంచి 30.5మి.మీ, మైక్రోనీర్ విలువ 3.5 నుంచి 4.3 ఉంటేనే మద్దతు ధర ఇస్తామని సీసీఐ ప్రకటించింది. తేమ పరంగా, పింజ పొడువు పరంగా కాస్త అటూ ఇటూ అయినట్టు అనిపిస్తే ధర తగ్గించేస్తున్నారు. గరిష్ఠంగా 7,421 నుంచి రూ.7471 వరకు మాత్రమే ఇస్తున్నారు. ఇక 12శాతానికి మించి తేమ ఉంటే పంటను కొనేందుకు సీసీఐ నిరాకరిస్తోంది. ఒకవేళ 12శాతం తేమ ఉన్నా పంట నాణ్యంగా ఉంటే రూ. 7,220.16 నుంచి రూ.7,124.16 వరకే ఇస్తోంది. ఇక పంట విక్రయించాక డబ్బులను రాబట్టుకోవడమూ రైతులకు ప్రహసనంగా మారింది. పత్తి విక్రయించిన రైతు తన ఆధార్‌కార్డు జిరాక్స్‌తో పాటు పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ లింక్ ఉన్న ఉన్న మొబైల్ తీసుకెళ్లాలి.
తీసుకెళ్లిన ఆధార్ సమాచారాన్ని సీఐడీఆర్ డేటా బేస్‌తో సరిపోల్చడం కోసం సీసీఐ డెమోగ్రాఫిక్ ధ్రువీకరణ ప్రక్రియ చేపడుతుంది. తర్వాత బయోమెట్రిక్ ధ్రువీకరణ కోసం రైతు వేలిముద్రలు లేదా ఐరి్‌స్, ఆధార్ డేటాతో సరిపోల్చడ ం చేయాలి. ఇక చివరగా ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ కోసం రైతు ఆధార్ లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఉపయోగించి ధ్రువీకరించిన తర్వాతే పత్తిని కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ 320 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, చాలాచోట్ల కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఫలితంగా రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఏ పంటలను ఎవరు సాగు చేశారనేది ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కౌలు రైతు పత్తి సాగు చేసిన చోట కూడా పట్టాదారు పేరునే నమోదు చేశారు. ఫలితంగా వ్యవసాయశాఖ పోర్టల్‌లో పంట సాగు చేసినట్లుగా ఎవరి పేరు నమోదు చేసి ఉంటే వారి ఖాతాల్లోకే డబ్బులు వెళతాయని సీసీఐ చెబుతోంది. ఈ కారణంగా కౌలు రైతులు కూడా తమ పంటను అమ్ముకునేందుకు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గుజరాత్‌లో క్వింటా పత్తికి రూ.8వేల వరకు ధర లభిస్తోందని, రాష్ట్రంలో గరిష్ఠంగా రూ.7వేలకు మించి ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. తెలంగాణలో నాణ్యమైన పత్తి పింజ పొడువు 29 మి.మీల నుంచి 30.5మి.మీలకు పైగానే ఉంటుందని, గుజరాత్‌లో మాత్రం గరిష్ఠంగా 29మి.మీలే ఉంటుందని, అయినా ఆ రాష్ట్రంలో పండిన పత్తికి ఉన్న డిమాండ్ తెలంగాణలో ఉండటం లేదని పత్తి రైతులు వాపోతున్నారు.
జిన్నింగ్ మిల్లులకు పండుగే..
సీసీఐ నిబంధనలు జిన్నింగ్ మిల్లుల వారికి, ప్రైవేటు వ్యాపారుల పాలిట వరంగా మారాయన్న చర్చ జరుగుతోంది. చాలా చోట్ల జిన్నింగ్ మిల్లుల వద్దే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుంది. సీసీఐ కొర్రీలతో రైతులు జిన్నింగ్ మిల్లుల వద్ద కాంటా పెడుతున్నారు. అయితే సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు కుమ్ముక్కై రైతుల నుంచి పత్తిని సీసీఐ కొనుగోలు చేయకుండా నాణ్యత ప్రమాణాలు, తేమశాతం పేరుతో తిరస్కరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగానే రైతులు జిన్నింగ్ మిల్లులు, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కూడా కొన్నేళ్లుగా సీసీఐ, ప్రైవేటు వ్యాపారుల మధ్య ఒప్పందం ప్రకారమే జరుగుతోందన్న చర్చ ఉంది.
Updated Date - Nov 05 , 2024 | 03:26 AM