Hyderabad: కత్తులు, తుపాకీతో హడలెత్తించినా ధైర్యంగా మడతబెట్టేసి..!
ABN , Publish Date - Mar 22 , 2024 | 05:00 AM
ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు ఆగంతకుల్లో ఒకరు మహిళ తలపై తుపాకీ గురిపెట్టాడు. మరో ఆగంతుకుడు ఆమె కుమార్తెను కత్తితో బెదిరించాడు.
ఇద్దరు ఆగంతకులపై తిరగబడ్డ తల్లి, కూతురు
ఒక దొంగ పరార్.. దొరికిన మరొకడు
బేగంపేటలో ఘటన
బేగంపేట, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు ఆగంతకుల్లో ఒకరు మహిళ తలపై తుపాకీ గురిపెట్టాడు. మరో ఆగంతుకుడు ఆమె కుమార్తెను కత్తితో బెదిరించాడు. ‘ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు, విలువైన వస్తువులివ్వండి.. లేదంటే కాల్చిపారేస్తాం.. పొడిచేస్తాం’ అని గట్టిగా అరిచారు. ఆ తల్లీకూతుళ్లు బెదరలేదు సరికదా ఆ ఇద్దరిపై ఒక్కసారిగా తిరగబడ్డారు. హడలెత్తిపోయిన ఆగంతకుల్లో ఒకరు అక్కడి నుంచి పరారవ్వగా.. మరొకరిని ఆ తల్లీకూతుళ్లు స్థానికుల సాయంతో పట్టుకున్నారు. బేగంపేట పోలీ్‌సస్టేషన్ పరిధిలోని పైగా కాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పైగా కాలనీలోని ప్లాట్ నంబర్ 5లో ఆర్కే జైన్ కుటుంబం నివసిస్తోంది. జీడిమెట్ల పారిశ్రామికవాడలో వీరికి రబ్బరు ఫ్యాక్టరీ ఉంది.
గురువారం మధ్యాహ్నం 1.30 సమయంలో ఇంట్లోని వంట గదిలో పనిమనిషి, మరో గదిలో ఆర్కే జైన్ భార్య అమిత్ మహోత్, కుమార్తె ఉన్నారు. కొరియర్ అంటూ ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. రాగానే తుపాకీని పని మనిషికి చూపిస్తూ బెదిరించాడు. పనిమనిషి పెద్దగా అరవడంతో అమిత్ మహోత్, ఆమె కుమార్తె బయటకొచ్చారు. మరో ఆగంతుకుడు కత్తి చూపిస్తూ వారిని బెదిరించాడు. ఇంట్లో ఉన్న బంగారు నగలు, డబ్బులు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని, ఆయుధాలను చూపిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. అయితే, కత్తి పట్టుకుని ఇంట్లోకి వచ్చిన ఆంగతుకుడిని జైన్ భార్య గుర్తు పట్టింది.
ప్రేమ్‌చంద్ నువ్వా? ఎందుకొచ్చావు? అని పెద్దగా అరిచి అతడిపై తిరగపడింది. వంటగదిలో గన్ చేతబట్టి ఉన్న వ్యక్తిపై తల్లీ కుమార్తెలు తిరగబడటంతో అతను వారిని బెదిరిస్తూ బయటకొచ్చాడు. అయినా.. వారు అతడిని పట్టుకునేందుకు యత్నించగా పరారయ్యాడు. ఇంతలో కత్తి పట్టుకుని మరో వ్యక్తి బయటకు రావడంతో మహిళల అరుపులు విని స్థానికులు అక్కడకు చేరుకున్నారు. కత్తి చూపిస్తూ పారిపోయేందుకు యత్నించిన అతడిని స్థానికుల సాయంతో మహిళలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఇద్దరిలో ప్రేమ్‌చంద్ అనే వ్యక్తి గతంలో ఆర్కే జైన్ ఇంట్లోనే పనిచేశాడని పోలీసులు గుర్తించారు. మరో అగంతకుడిని వరంగల్ జిల్లా కాజిపేట రైల్వే స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.