Sangareddy: ఆరేళ్ల బాలికపై హత్యాచారం.. దోషికి మరణ శిక్ష
ABN, Publish Date - Sep 13 , 2024 | 04:58 AM
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది.
సంగారెడ్డి క్రైం, సెప్టెంబరు 12: ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. నేరం రుజువు కావడంతో కఠిన శిక్ష విధిస్తూ సంగారెడ్డిలోని ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయాధికారి జయంతి గురువారం తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీహార్‌లోని జమోయి జిల్లా సికిందర్ తాలూకాకు చెందిన గఫార్ అలీఖాన్(56) బీడీఎల్‌లో కూలీ పనులు చేస్తుండేవాడు. 2023 అక్టోబరు 16వ తేదీన సంగారెడ్డి జిల్లా భానూరు బీడీఎల్‌కు చెందిన ఆరు సంవత్సరాల బాలికకు కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికైనా చెబుతుందని భయపడి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బీడీఎల్ భానూరు పోలీసులు వివిధ సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి దర్యాప్తు జరిపారు. పోలీసులు సమర్పించిన అన్ని ఆధారాలను పరిశీలించిన న్యాయాఽధికారి నిందితుడు గఫార్ అలీఖాన్‌కు మరణ శిక్ష విధించారు. బాధితురాలి కుటుంబీకులకు పది లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ రూపేష్ హైకోర్టును ఆశ్రయించి సత్వర విచారణ జరిగేలా అనుమతి తీసుకున్నారు. దీంతో కేవలం 11 నెలల్లోనే కోర్టులో విచారణ పూర్తయింది.
Updated Date - Sep 13 , 2024 | 04:58 AM