Kunamneni :పేదల మాటున ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర
ABN, Publish Date - Oct 21 , 2024 | 04:49 AM
బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
ప్రతిపక్షాలతో సీఎం జాగ్రత్తగా ఉండాలి: కూనంనేని
హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పేద ప్రజల భుజాలపై తుపాకులు పెట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయాలని ఆ పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూలుస్తోందంటూ బడాబాబులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం ఈ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాక హైడ్రా చర్యలను కూడా కనిపెట్టుకొని ఉండాలని సూచించారు. చీకటి ఒప్పందం చేసుకున్న బీఆర్‌ఎస్, బీజేపీలు పైకి విమర్శించుకున్నట్టు నాటకమాడుతూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పేదల జోలికి వస్తే సీపీఐ ఉపేక్షించదని, మిత్రపక్షంగా ఉన్నా సరే పేదల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై అభ్యర్థుల అనుమానాలను ప్రభుత్వమే నివృత్తి చేయాలని కూనంనేని సూచించారు.
Updated Date - Oct 21 , 2024 | 04:49 AM