CPI Narayana: కేటీఆర్ తానే ముఖ్యమంత్రిని అనుకుంటున్నారు..!! సీపీఐ నారాయణ సెటైర్లు
ABN, Publish Date - Jan 29 , 2024 | 11:12 AM
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీపీఐ అగ్ర నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ తానే ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారు. ఆయన మాట తీరు అలా ఉందని సీపీఐ నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తోందని, రేవంత్ రెడ్డి సీఎం పదవీ చేపట్టారని కేటీఆర్‌కు గుర్తుచేశారు.
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (KTR) సీపీఐ అగ్ర నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ తానే ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని మండిపడ్డారు. ఆయన మాట తీరు అలా ఉందని సీపీఐ నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తోందని, రేవంత్ రెడ్డి సీఎం పదవీ చేపట్టారని కేటీఆర్‌కు గుర్తుచేశారు. కుల గణన చేపట్టాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సీపీఐ నారాయణ స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీలో సమస్యలు ఉన్నప్పటికీ సరిదిద్దుకొని ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ నేతలు కలుపుకొని వెళ్లడంతో విజయం సాధించారని సీపీఐ నారాయణ వివరించారు. బీఆర్ఎస్ ఓటమి అనుభవాలను కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఉంచుకొని పాలించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ ఐదు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు 17ఏ కోసం ఉద్యమించాలని సీపీఐ నారాయణ సూచించారు.
బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సీపీఐ నారాయణ మండిపడ్డారు. కక్కిన కూడు తినేందుకు నితీశ్ ఆశపడ్డారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయోధ్య రామాలయం ఎన్నికల స్టంట్ అని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార బ్రాండ్ అంబాసిడర్‌గా అయోధ్య రామాలయం పనిచేస్తుందన్నారు. అందుకోసమే ఇంటింటికీ రాముడి అక్షింతలు పంపి లబ్ధి పొందాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నించాయని నారాయణ ధ్వజమెత్తారు. తీర్పులు చెప్పే న్యాయ మూర్తులు కూడా అయోధ్యకు వెళ్లొచ్చారని గుర్తుచేశారు. కోర్టులు, దర్యాప్తు సంస్థలు బీజేపీ గుప్పిట్లో ఉన్నాయని మండిపడ్డారు. అయోధ్య రావాలని బీజేపీ అగ్రనేత అద్వానీని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. రాముడి పేరు చెప్పి ఓట్లు అడగడాన్ని బీజేపీ ప్రారంభించిందని తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో పబ్లిక్ సెక్టార్ అమ్మడం తప్ప కొత్తగా స్థాపించినవి ఏమీ లేవని విమర్శించారు. భారతదేశం హిందూ దేశం కాదని, ఇక్కడ అన్ని మతాల వారు ఉన్నారని సీపీఐ నారాయణ వివరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అన్ని మతాలు, వర్గాలు ఏకమై పోరాడాయని గుర్తుచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 29 , 2024 | 11:15 AM