ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber Crime: సైబర్‌ దందాకు బ్యాంకర్ల అండ!

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:36 AM

రాజధాని హైదరాబాద్‌కు చెందిన మునావర్‌ మహ్మద్‌, అరుళ్‌ దాస్‌, షమీర్‌ ఖాన్‌, ఎస్‌.సుమైర్‌ స్నేహితులు. మునావర్‌ స్నేహితుడు.

  • అడ్డగోలుగా ఖాతాలు తెరిచేలా కొందరి సహకారం

  • ఆ ఖాతాలతో రూ.వందల కోట్ల అక్రమ లావాదేవీలు

  • వాటిపై పోలీసు నోటీసులకూ స్పందించని వైనం

    సామాన్యుడు బ్యాంకు ఖాతా తెరవాలంటే బ్యాంకు సిబ్బంది సవాలక్ష షరతులు చెబుతారు! ‘‘ఆ కాగితం తీసుకురా.. చిరునామా ధ్రువీకరణ పత్రం సరిగ్గా లేదు.. ఆధార్‌, పాన్‌ కార్డుల్లో పేరు సరిపోలలేదు..’’ అంటూ కొర్రీలతో విసిగిస్తారు. కానీ.. షెల్‌ కంపెనీలు పెట్టి, తప్పుడు చిరునామాలు, సంతకాలతో పెద్ద సంఖ్యలో ఖాతాలు తెరిచే సైబర్‌ నేరగాళ్లు ఇచ్చే ఆమ్యామ్యాలకు ఆశపడి ఆ దందాలో పాత్రధారులు అవుతున్నారు. ఆ మోసం బయట పడ్డాక పోలీసులు అడిగినా స్పందించట్లేదు. ఈ నేపఽథ్యంలో నకిలీ ఖాతాల కట్టడికి ఆర్‌బీఐ ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని పోలీసులు సూచిస్తున్నారు.

(హైదరాబాద్‌ సిటీ- ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌కు చెందిన మునావర్‌ మహ్మద్‌, అరుళ్‌ దాస్‌, షమీర్‌ ఖాన్‌, ఎస్‌.సుమైర్‌ స్నేహితులు. మునావర్‌ స్నేహితుడు.. లఖ్‌నవూకు చెందిన నయీమ్‌ ఒకసారి అతడికి ఫోన్‌ చేశాడు. ‘‘లఖ్‌నవూలో చిన్న పని ఉంది. అది పూర్తి చేసుకొని వెళ్తే డబ్బులు కూడా వస్తాయి. నీతోపాటు మరో ముగ్గురిని తీసుకురా’’ అని చెప్పాడు. తన మాట విని లఖ్‌నవూకు చేరుకున్న నలుగురు స్నేహితులకూ రాచమర్యాదలు చేశాడు. మనీష్‌, వికాస్‌, రాజేశ్‌ అనే మరో ముగ్గురు వ్యక్తులను వారికి పరిచయం చేశాడు. వారు ఈ నలుగురి పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారుచేసి.. వాటి ఆధారంగా 33 షెల్‌ కంపెనీలు సృష్టించి, వారి సంతకాలతో 61 బ్యాంకు ఖాతాలు తెరిచారు. బ్యాంకు అధికారుల చేతులు తడిపి.. ఈ ప్రక్రియలో వారి సహకారం కూడా తీసుకున్నారు.


వచ్చిన పని అయిపోయిందని చెప్పి ఆ నలుగురు స్నేహితుల చేతిలో కొంత డబ్బు పెట్టారు. ‘‘కంపెనీలకు బ్యాంకు ఖాతాలు తీయడానికి పిలిచాం. వాటి వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు’’ అని చెప్పి పంపేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. మునావర్‌ బృందాన్ని అరెస్టు చేశారు. ఇదేంటని ప్రశ్నించగా.. లఖ్‌నవూలో తెరిచిన బ్యాంకు ఖాతాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు దేశవ్యాప్తంగా రూ.128 కోట్లు కొల్లగొట్టారని చెప్పారు. అంతేకాదు.. బ్యాంకర్ల సహకారంతో ఆ సైబర్‌ నేరగాళ్లు వివిధ ప్రాంతాల్లో 109 బ్యాంకు ఖాతాలను తెరిచి, కేవలం రెండేళ్లలో రూ.712 కోట్లు కాజేసినట్లు వెల్లడించారు. కేవలం కొంతమంది బ్యాంకర్ల అవినీతి, నిర్లక్ష్యం కారణంగా.. దేశవ్యాప్తంగా 15వేల మంది మోసపోయారని, ఆ రూ.712 కోట్లూ విదేశాలకు తరలిపోయాయని తెలిపారు. అంతేకాదు.. ఈ వ్యవహారంపై ఈడీకి కూడా సమాచారమిచ్చారు. అయితే.. దీనిపై బ్యాంకర్లకు నోటీసులు ఇచ్చినా బ్యాంకుల నుంచిగానీ, ఆర్‌బీఐ నుంచి గానీ ఇసుమంతైనా స్పందన లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇటీవలికాలంలో వెలుగులోకి వస్తున్న పలు సైబర్‌ మోసాల్లో నేరగాళ్లు ఇలాగే వేరొకరి ఖాతాలో డబ్బులు వేయించి వారినీ ఇరికిస్తున్నారు.


  • ఖాతాలే నేరగాళ్లకు ఆధారం..

సైబర్‌ నేరగాళ్లు అమాయకులను దోచుకోవాలన్నా.. దోచుకున్న సొమ్మును తీసుకోవాలనుకున్నా.. విదేశాలకు తరలించాలన్నా బ్యాంకు ఖాతాలే ఆధారం. అవే లేకపోతే సైబర్‌ నేరాల్లో డబ్బులు కొల్లగొట్టడం అసాధ్యం. అందుకే వారు బ్యాంకు ఖాతాలు తెరవడానికి దళారీ వ్యవస్థను ఆశ్రయిస్తారు. వారి ద్వారా డబ్బుల ఆశ చూపి.. ఆ ప్రలోభానికి లొంగే బ్యాంకర్లకు వలవేస్తారు. వారితో కుమ్మక్కై నకిలీ ధ్రువపత్రాలతో, ఎలాంటి విచారణలూ లేకుండా ఖాతాలు తెరుస్తున్నారు. వాటి క్రెడెన్షియల్స్‌ (డెటిట్‌ కార్డు, చెక్‌బుక్‌, ఫోన్‌నంబర్‌ వంటివి) తీసుకొని.. ఆ ఖాతాలను సైబర్‌ నేరాలకు వినియోగిస్తున్నారు. ఇలా నకిలీ ద్రువపత్రాలతో బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేయడం ఒకెత్తు అయితే.. ఆయా ఖాతాల్లో రోజూ రూ. లక్షల్లో డబ్బులు వచ్చిపడుతున్నా బ్యాంకర్లు పట్టించుకోకపోవడం మరొక ఎత్తు. నిజానికి ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ప్రతి బ్యాంకు ఖాతాపైనా అధికారుల నిఘా ఉండాలి.


దీనివల్ల ఆయా ఖాతాల్లో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వచ్చినా, ఆ ఖాతాల నుంచి పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నా.. బ్యాంకు అధికారులకు అనుమానం వస్తుంది. అప్పుడు ఆయా ఖాతాలపై నిఘాపెట్టి ఆరా తీస్తారు. అనుమానం నిజమని తేలితే ఖాతాలను స్తంభింపజేసి పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. అక్రమ లావాదేవీలు నిజమని తేలినా.. అ ఖాతాను ఇతర ప్రాంతాల్లో ఉన్న సైబర్‌ క్రిమినల్స్‌ వినియోగిస్తున్నట్లు తేలినా సబంధిత వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయొచ్చు. ఇలా తరచూ చేయడం వల్ల సైబర్‌ క్రిమినల్స్‌లో భయం పుడుతుంది. కానీ.. పోలీస్‌ ఉన్నతాధికారులు ఎన్ని నోటీసులు జారీ చేసినా, ఎన్నిసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి.. సైబర్‌ క్రిమినల్స్‌ బ్యాంకు ఖాతాలను ఎలా వినియోగిస్తున్నదీ చెప్పినా కొన్ని బ్యాంకుల్లో పర్యవేక్షణ కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో.. ఆర్బీఐ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సైబర్‌ నేరాలను అడ్డుకోవడానికి, కరెంట్‌ ఖాతాలను పర్యవేక్షించడానికి, అక్రమ ఖాతాలపై నిఘాపెట్టి సైబర్‌ క్రిమినల్స్‌ వినియోగిస్తున్న ఖాతాలను గుర్తించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని పోలీసులు సూచిస్తున్నారు.


  • బ్యాంకర్లు అప్రమత్తంగా ఉంటే..

ఇటీవల హైదరాబాద్‌ నగరంలోని ఒక బ్యాంకు అధికారులు.. కొన్ని ఖాతాల నుంచి పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారులు ఆదేశాలతో సైబర్‌ సెక్యూరిటీ పోలీసులకు వాటిపై సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరా తీయగా.. అవన్నీ సామాన్య ప్రజల పేరుతో ఉన్న ఖాతాలని, వారికి రూ.లక్షల్లో లావాదేవీలు జరిపే స్థోమత లేదని గుర్తించారు. అంతే కాదు.. ఆయా ఖాతాల్లోంచి డబ్బు ఎక్కడికి వెళ్తోందో పరిశీలించగా.. అవన్నీ సైబర్‌ క్రిమినల్స్‌ నకిలీ ఖాతాలని తేలింది. దీంతో వాటిని ఫ్రీజ్‌ చేశారు. ఇదే విధంగా బ్యాంకర్లు అప్రమత్తంగా వ్యవహరించి నకిలీ ఖాతాలను, అక్రమ లావాదేవాలను గుర్తిస్తే సైబర్‌ క్రిమినల్స్‌ చెక్‌ పెట్టడంతో పాటు.. నకిలీ ఖాతాలను అడ్డుకోవచ్చని సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 03:36 AM

Advertising
Advertising