Investment Scam: స్టాక్ బ్రోకింగ్ పేరుతో.. ఘరానా మోసం!
ABN, Publish Date - Oct 09 , 2024 | 04:20 AM
తమ స్టాక్ బ్రోకింగ్ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ నమ్మించారు. సంవత్సరానికి 120% వడ్డీ.. అర్ధ సంవత్సరానికి 54%, నెలకు 7% వడ్డీతో కలిపి లాభాలు ఇస్తామంటూ స్కీములు పెట్టారు.
అధిక లాభాలు అంటూ వందలకోట్లు కొల్లగొట్టిన ఘనుడు
హైదరాబాద్‌లో ఆరు కోట్లు స్వాహా
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): తమ స్టాక్ బ్రోకింగ్ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ నమ్మించారు. సంవత్సరానికి 120% వడ్డీ.. అర్ధ సంవత్సరానికి 54%, నెలకు 7% వడ్డీతో కలిపి లాభాలు ఇస్తామంటూ స్కీములు పెట్టారు. ఇలా దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వేలమందిని మోసం చేసి రూ. వందలకోట్లు కొల్లగొట్టారు. కొంతకాలంగా రిటర్న్స్ ఇవ్వడం మానేయడం, అడిగి నా ఎవరూ స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సీపీ ఆదేశాలతో ఈవోడబ్ల్యూ(ఆర్థిక నేరాల విభాగం) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ మోసం వివరాలు ఇలా ఉన్నాయి.. మణికొండ పుప్పాలగూడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పంచాక్షర్.. గౌహతి కేంద్రంగా పనిచేస్తున్న డీబీ స్టాక్ బ్రోకింగ్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. వారు పెట్టిన స్కీములు నచ్చి రూ. 11 లక్షలు ఇన్వెస్ట్ చేశారు.
కొద్ది రోజులు లాభదాయకమైన రిటర్న్స్ అందుకున్న పంచాక్షర్‌కు ఆ తర్వాత అసలు, వడ్డీ ఇవ్వడంలేదు. ఇదేంటని ప్రశ్నించినా ఎవరూ స్పందించలేదు. దాంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు ఈ ఏడాది సెప్టెంబరు 23న సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన కేసు తీవ్రతను గుర్తించి ఆర్థిక నేరాల విభాగానికి అప్పగించారు. డీసీపీ కె. ప్రసాద్ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఈవోడబ్ల్యూ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించగా 2018లో 39 ఏళ్ల దీపాంకర్ అనే వ్యక్తి ఈ డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ప్రారంభించినట్లు తేలింది. అసోం రాష్ట్రం గౌహతి సహా.. బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లలో అధిక వడ్డీ స్కీముల పేరుతో వేలాది మందిని ఆకట్టుకొని వందలకోట్లు సేకరించినట్లు అంచనా వేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలో 10 మంది ఈ సంస్థ బారినపడి రూ. 6 కోట్లు మోసపోయినట్లు గుర్తించారు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి గౌహతి పోలీసులతో సమన్వయం చేసుకొని సాంకేతిక ఆధారాలతో సైబరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Oct 09 , 2024 | 04:20 AM