Damodara : రాజకీయాల కోసం ఆస్పత్రులను వాడుకోవడమా?
ABN, Publish Date - Sep 24 , 2024 | 02:48 AM
రాజకీయం కోసం బీఆర్‌ఎస్ ఆస్పత్రులను వేదికగా వాడుకుంటోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ హయాంలో వైద్యరంగం నిర్వీర్యం
సౌకర్యాలు, అధ్యాపకులు లేకుండానే కాలేజీల ఏర్పాటు
మేం వచ్చాక వాటిని భర్తీ చేస్తున్నాం
కేటీఆర్‌పై మంత్రి దామోదర ఫైర్
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాజకీయం కోసం బీఆర్‌ఎస్ ఆస్పత్రులను వేదికగా వాడుకుంటోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రి మరణాలను ప్రభుత్వ వైద్యుల వైఫల్యంగా చిత్రీకరించడం బీఆర్‌ఎస్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిందని, తామువ్యవస్థను గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని డాక్టర్లు విజ్ఞప్తి చేసినా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తలకు ఎక్కడం లేదని మండిపడ్డారు. తప్పుడు సమాచారంతో ట్వీట్ చేసి, అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్.. తన తప్పును కవర్ చేసుకునేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ పేరిట డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేళ్ల పాలనా వైఫ్యల్యాలను పది నెలల ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ హయాంలో 2017లో కోటి మెటర్నిటీ ఆస్పత్రిలో మూడు రోజుల్లో ఆరుగురు బాలింతలు.. అదే ఏడాది ఐదు రోజుల వ్యవధిలో నిలోఫర్ దవాఖానాలో ఐదుగురు బాలింతలు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. 2022లో కుటుంబ నియంత్రణ కోసం డీపీఎల్ పద్ధతిలో చేసిన ఆపరేషన్‌లతో నలుగురు మహిళలు మరణించారని.. దీంతో ఆ పిల్లలు అనాథలయ్యారన్నారు. 2019 జూన్, జూలైలో డెంగ్యూ మరణాల సంఖ్య వందకు పైగా ఉందని.. బీఆర్‌ఎస్ నిర్వాకం వల్ల పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మిగిలిందన్నారు. ఆరోగ్యశాఖలో ఖాళీలకు బాధ్యులెవరు? అని మంత్రి ప్రశ్నించారు. మూడేళ్లలో హడావుడిగా 25 మెడికల్ కళాశాల ఏర్పాటుకు జీవోలు ఇచ్చి చేతులు ఎత్తేశారన్నారు. కొత్త కళాశాలలకు 3,368 మంది టీచింగ్ స్టాఫ్ అవసరమైతే, కేవలం 1078 మందిని మాత్రమే భర్తీ చేశారన్నారు. అధ్యాపకులు, సౌకర్యాలు లేకుండానే మొక్కుబడిగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ ఎస్ దక్కుతుందని విమర్శించారు.
Updated Date - Sep 24 , 2024 | 02:48 AM