Car Accident: డివైడర్‌ను దాటి.. దూసుకెళ్లిన కారు
ABN, Publish Date - Jul 27 , 2024 | 03:55 AM
రాజీవ్ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్‌ను దాటి పక్క లైన్‌లోకి దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి.
ఎదురు లైన్‌లో వస్తున్న బైక్, బస్సుకు ఢీ
ఇద్దరి మృతి.. 10 మందికి గాయాలు
మూడుచింతలపల్లి, జూలై 26 : రాజీవ్ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్‌ను దాటి పక్క లైన్‌లోకి దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లిలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హకీంపేట్‌కు చెందిన మోహన్(25) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మౌలాలికి చెందిన దీపిక(25) గచ్చిబౌలిలోని ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది.
శుక్రవారం ఉదయం వీరిద్దరూ తమ ఇళ్లలో బయటకు వెళ్లి వస్తామని చెప్పారు. ఇద్దరూ కలిసి ఓ కారులో రాజీవ్ రహదారిపై వెళుతుండగా లాల్‌గడీ మలక్‌పేటలో ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. పక్క లైన్‌లోకి దూసుకెళ్లింది. ఎదురుగా హైదరాబాద్ నుంచి తుర్కపల్లి వైపు వస్తున్న ద్విచక్రవాహనంతో పాటు బయోలాజికల్-ఈ కంపెనీ బస్సును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కారు నడుపుతున్న మోహన్, పక్కనే ఉన్న దీపిక అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు, బయోలాజికల్-ఈ కంపెనీ బస్సులో వెళ్తున్న 44 మందిలో 8 మందికి గాయాలయ్యాయి. ఘటనతో రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Updated Date - Jul 27 , 2024 | 03:55 AM