ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nirmal: ఇథనాల్‌ పరిశ్రమపై కిం కర్తవ్యం?

ABN, Publish Date - Nov 29 , 2024 | 03:02 AM

నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటు అంశంపై ఏం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ నడుస్తోంది. పెట్రోలులో కలిపేందుకు ఇథనాల్‌ తయారీ కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తే.

  • కేంద్రం నుంచి కేవలం ఇథనాల్‌ తయారీకి అనుమతి..

  • గత ప్రభుత్వ హయాంలో ఇతర ఉత్పత్తులకూ ఓకే

  • ఇప్పుడు ఈ మేరకు అనుమతులను రద్దు చేయాలా?

  • పూర్తిగా రద్దుకు కేంద్రానికి సిఫారసు చేయాలా?

  • రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో చర్చ

  • ఇథనాల్‌ పరిశ్రమ డైరెక్టర్లుగా

  • తలసాని కొడుకు, వియ్యంకుడి కొడుకు

  • గ్రామసభ పెట్టకుండా కేటీఆర్‌ అనుమతిచ్చారు

  • రాష్ట్రంలో దాడుల వెనుక రాజకీయ కుట్రలు

  • వాటిని త్వరలో బయటపెడతాం: మంత్రి సీతక్క

హైదరాబాద్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటు అంశంపై ఏం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ నడుస్తోంది. పెట్రోలులో కలిపేందుకు ఇథనాల్‌ తయారీ కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తే.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్యం తయారీలో అవసరమయ్యే ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌, ఇండస్ట్రియల్‌ అబ్జల్యూట్‌ ఆల్కహాల్‌ లాంటి ఉత్పత్తుల తయారీకీ అనుమతులిచ్చింది. పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభమైతే వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతుందన్న స్థానికుల ఆందోళనతో నిర్మాణ పనులకు బ్రేక్‌ పడింది. అయితే దీని అనుమతులను కేంద్ర ప్రభుత్వమే ఇచ్చినందున రద్దు నిర్ణయం కూడా కేంద్రానిదే అని రాష్ట్ర ప్రభుత్వంలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్‌ వినియోగంతో వెలువడుతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే అందులో కొంత శాతం ఇథనాల్‌ కలపాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానం. పెట్రోల్‌లో 1.53 శాతం ఇథనాల్‌ కలిపేందుకు 2013-14లో కేంద్రం అనుమతించగా.. దీన్ని 2020-21లో 8.04 శాతానికి పెంచింది. దీంతో దేశంలో ఇథనాల్‌ డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. 2025 నాటికి దీన్ని 20 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే దేశ అవసరాలకు సరిపడా ఇథనాల్‌ అందుబాటులో లేదు. ప్రస్తుత అవసరాలకు సరిపడా కావాలన్నా దిగుమతి చేసుకోవాల్సిందే. ఇథనాల్‌ను దేశీయంగా తయారు చేయాలన్న లక్ష్యంతో కేంద్రం గత కొన్నేళ్లుగా రాష్ట్రాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే గతంలో నిర్మల్‌ జిల్లాలో ఇథనాల్‌ పరిశ్రమకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. పాడైన, మిగులు వ్యవసాయ ఉత్పత్తులతో ఇథనాల్‌ తయారుచేయవచ్చని కేంద్రం అనుమతిస్తోంది. మన దేశంలో ముఖ్యంగా చెరకు, మొక్కజొన్న లాంటి వ్యవసాయ ఉత్పత్తులతో తయారుచేస్తున్నారు. దీంతో ఈ వ్యాపారంలో ఎక్కువ ప్రయోజనం రైతులకే కలుగుతోందని, కాలుష్యం తగ్గుతోందని కేంద్రం సమర్థించుకుంటోంది. కోటి లీటర్ల ఇథనాల్‌ కలిపిన పెట్రోలు 20 వేల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను తగ్గిస్తుందని పేర్కొంటోంది. అయితే నిపుణులు, పర్యావరణవేత్తలు మాత్రం మరోలా చెబుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించే ఇథనాల్‌ పరిశ్రమల నుంచి వాయు కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వెలువడే హానికారక రసాయనాలతో స్థానికులకు శ్వాసకోశ వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కాగా, 2013-14లో దేశంలో 13 కోట్ల లీటర్ల ఇథనాల్‌ విక్రయాలు జరగ్గా అది 2020లో 21 వేల కోట్ల లీటర్లకు చేరింది.


  • పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ పేరుతో..

నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్‌ ఇథనాల్‌ పరిశ్రమకు అనుమతించింది. దీని ప్రకారం పెట్రోల్‌లో కలిపేందుకు అవసరమయ్యే ఇథనాల్‌ మాత్రమే తయారుచేయాలి. దీనికోసం ప్రత్యేక రాయితీలూ ఇచ్చింది. అయితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇందులో మరిన్ని ఉత్పత్తుల తయారీకి అనుమతులు ఇచ్చింది. మద్యం తయారీలో అవసరమయ్యే ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌, ఇండస్ట్రియల్‌ అబ్జల్యూట్‌ ఆల్కహాల్‌ ఉత్పత్తికీ అనుమతులిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక గ్రామ పంచాయతీ అనుమతులు, నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకోకపోవడం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే పరిశ్రమలను స్థాపించవచ్చని గత ప్రభుత్వం మినహాయింపులు సైతం ఇచ్చింది. 2022 డిసెంబరులో పీఎంకే డిస్టిలేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఈ అనుమతులు జారీ చేసింది. దీని ఆధారంగా జూన్‌ 15, 2023న నీటిపారుదల శాఖ నీటి కేటాయింపులు కూడా చేసేసింది. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకపోవడంపై స్థానికుల్లో ఇప్పటికే తీవ్ర ఆగ్రహం ఉండగా.. అకస్మాత్తుగా పరిశ్రమ ప్రహరీ గోడ నిర్మించడంతో ఆందోళన తీవ్రరూపం దాల్చింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసినా.. రద్దు అధికారం మాత్రం కేంద్రం చేతుల్లోనే ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం అనుమతించిన విధంగా కేవలం ఫ్యూయల్‌ ఇథనాల్‌ ఉత్పత్తికి మాత్రమే అనుమతించి ఇతరవాటి అనుమతులు రద్దు చేయడమా? పరిశ్రమ అనుమతులు పూర్తిగా రద్దు చేయాలని కేంద్రానికి సిఫారసు చేయడమా? అన్న విషయంపై ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో చర్చ నడుస్తోంది.


  • దాడుల వెనుక రాజకీయ కుట్రలు త్వరలో బయటపెడతాం: మంత్రి సీతక్క

హైదరాబాద్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి జరుగుతున్న దాడులు, ఘటనల వెనుక రాజకీయ కుట్రలు దాగి ఉన్నాయని, త్వరలో వాటిని బయట పెడతామని మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా దిలావర్పూర్‌లో గ్రామసభ పెట్టకుండానే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2022లోనే ఇథనాల్‌ ఫ్యాక్టరీకి అనుమతులిచ్చిందని ఆరోపించారు. గురువారం సీతక్క విలేకరులతో మాట్లాడుతూ ఇథనాల్‌ పరిశ్రమ డైరెక్టర్లుగా బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కొడుకు, తలసాని వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ కొడుకు ఉన్నారని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం గ్రామసభ పెట్టకుండా అప్పటి మంత్రి కేటీఆర్‌ అనుమతించారని, దానిపై అప్పటి సీఎం కేసీఆర్‌ సంతకం చేశారని ఆరోపించారు. ఇథనాల్‌ ఫ్యాక్టరీ అనుమతికి బీజేపీ మద్దతు తెలిపిందని విమర్శించారు. గ్రామసభ పెట్టకుండా అనుమతి ఇచ్చినందుకు నిరసనగా అప్పట్లో తాము ధర్నాలు చేసినట్టు చెప్పారు. బీఆర్‌ఎస్‌ వాళ్లే అనుమతించి.. నేడు వారే మళ్లీ అధికారులపై దాడులకు తెగడుతున్నారని మండిపడ్డారు. గ్రామసభ నిర్వహించకుండా అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై త్వరలో కేసీఆర్‌ సంతకాలతో ఉన్న ఆధారాలన్నీ బయటపెడతామన్నారు. ఈ విషయాలపై అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు. కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్పూర్‌ రావాలని, తాము కూడా వస్తామని, ఎవరు అనుమతి ఇచ్చారో తేలుద్దామని సవాల్‌ విసిరారు. కేటీఆర్‌ ఇప్పటికైనా తప్పును ఒప్పుకోవాలని సీతక్క సూచించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు 50మంది విద్యార్థులు మృత్యువాతపడితే మంత్రులెవ్వరూ వెళ్లలేదన్నారు. వాంకిడి విద్యార్థిని చనిపోవడం దురదృష్టకరమన్నారు. ఆ విద్యార్థినికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు రూ.4 లక్షలు ఖర్చు చేశామని, అయితే కార్డియాక్‌ అరె్‌స్టతో చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


  • ఇథనాల్‌ పరిశ్రమతో సంబంధం లేదు: తలసాని

హైదరాబాద్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఇథనాల్‌ పరిశ్రమతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాజమండ్రి దగ్గర డిస్టిలరీస్‌ కంపెనీలో 8 మంది డైరెక్టర్లలో ఒకరిగా గతంలో తన కుమారుడు ఉండడం వాస్తవమేనని, 2016లోనే రాజీనామా చేశారని తెలిపారు. గురువారం విలేకర్ల సమావేశంలో తలసాని మాట్లాడారు. ఇథనాల్‌ పరిశ్రమ తన కుటుంబానిదని నిరూపిస్తే దాన్ని రాసిస్తానని, దిలావర్‌పూర్‌ గ్రామ ప్రజలకు జవాబు చెప్పాల్సింది ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఇథనాల్‌ పరిశ్రమకు పర్మిషన్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని, రాష్ట్రంలో ప్రజల దృష్టి మరల్చే రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి సంవత్సరమైందని, రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 03:02 AM