MBBS Doctors: ప్రభుత్వ వైద్యుల పోస్టులకు పెరిగిన పోటీ..
ABN, Publish Date - Jul 14 , 2024 | 04:23 AM
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంబీబీఎస్ వైద్యులకు డిమాండ్ తగ్గటంతో ప్రభుత్వ ఆస్పత్రులవైపు దృష్టి సారిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ వైద్యుల నియామకాలకు అభ్యర్థుల నుంచి వచ్చిన స్పందన దీనినే తెలియజేస్తోంది.
435 పోస్టులకు 4,800 దరఖాస్తులు
ప్రైవేటులోఎంబీబీఎస్‌లకు తగ్గుతున్న డిమాండ్
ప్రభుత్వ ఆస్పత్రులకు మరలుతున్న వైద్యులు
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంబీబీఎస్ వైద్యులకు డిమాండ్ తగ్గటంతో ప్రభుత్వ ఆస్పత్రులవైపు దృష్టి సారిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ వైద్యుల నియామకాలకు అభ్యర్థుల నుంచి వచ్చిన స్పందన దీనినే తెలియజేస్తోంది. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఈ నెల 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పది రోజుల్లో 4,800 దరఖాస్తులు వచ్చినట్లు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు వర్గాలు తెలిపాయి. అంటే ఒక్కొ పోస్టుకు సగటున 11 మంది పోటీ పడుతున్నారు. ఈ స్థాయిలో దరఖాస్తులు వస్తాయని అఽధికార వర్గాలు కూడా ఊహించలేకపోయాయి. ప్రభుత్వ వైద్యులుగా చేరితే ప్రైవేటు ప్రాక్టీస్ చేయకూడదన్న నిబంధన ఉండటంతో గతంలో చాలామంది సర్కారీ డాక్టర్ కొలువులపై ఆసక్తి చూపలేదు.
కానీ ఈసారి మాత్రం గట్టి పోటీ నెలకొందని వైద్యవర్గాలు తెలిపాయి. 2022లో 960 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా, ఐదువేలలోపే అప్లికేషన్లు వచ్చాయి. కానీ ఈసారి అందులో సగం పోస్టులకే 4,800 దరఖాస్తులొచ్చాయి. కాగా ఈనెలాఖరుకు దరఖాస్తులన్నింటిని పరిశీలించి నియామక ప్రక్రియ చేపట్టాలని మెడికల్ బోర్డును ఇప్పటికే సర్కారు ఆదేశించింది.
రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పెరగడంతో వైద్యుల సంఖ్య కూడా అందుకు తగ్గట్లే పెరుగుతోంది. దాంతో వారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉద్యోగావకాశాలు తగ్గుతున్నాయి. ఎంబీబీఎస్ చేసి.. పీజీ సీటు రాక, ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే పెద్దగా వేతనాలు ఇవ్వటం లేదు. కొన్ని ఆస్పత్రులైతే రూ.20-25 వేలే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నారు.
Updated Date - Jul 14 , 2024 | 04:23 AM