ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Offerings: తల్లుల బంగారం లెక్క చెప్పండి సారూ!

ABN, Publish Date - Nov 02 , 2024 | 04:34 AM

తిరుమలలో వెంకన్న, బెజవాడ దుర్గమ్మకు, యాదగిరీశుడికి, బాసరలో సరస్వతీ అమ్మవారికి.. ఇలా ప్రధాన ఆలయాల్లో కొలువై ఉన్న దేవుళ్లకు భక్తులు ఏటా సమర్పించుకుంటున్న బంగారం ఎంత?

మేడారం మహాజాతరకు ఇన్నాళ్లుగా వచ్చిన పసిడి ఎంత?.. భక్తులు సమర్పించే నగదులో మాత్రమేపూజారులకు వాటా

  • బంగారం, వెండి కానుకలన్నీ నేరుగా బ్యాంకు లాకర్‌లోకే!

  • 1968 నుంచి 10కిలోల పుత్తడి వచ్చిందంటున్న అధికారులు

  • ఆ లెక్కపై పూజారుల సందేహం.. గత 4 జాతరల్లోనే 3.2 కిలోల బంగారం, 200 కిలోల వెండి వచ్చినట్టు వెల్లడి

వరంగల్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తిరుమలలో వెంకన్న, బెజవాడ దుర్గమ్మకు, యాదగిరీశుడికి, బాసరలో సరస్వతీ అమ్మవారికి.. ఇలా ప్రధాన ఆలయాల్లో కొలువై ఉన్న దేవుళ్లకు భక్తులు ఏటా సమర్పించుకుంటున్న బంగారం ఎంత? ఆభరణాలెన్ని వస్తున్నాయో?.. ఇలా అన్నింటికీ ఒక లెక్క ఉంటుంది! మరి.. మేడారం మహజాతరకు భారీగా తరలివచ్చే భక్తులు సమర్పించే బంగారం, వెండి కానుకలు ఎన్ని? 1968 నుంచి.. జాతరకు వచ్చే ఆదాయ, వ్యయాల లెక్కలే చూపిస్తున్న అధికారులు బంగారం, వెండి కానుకల వివరాలను ఎందుకు వెల్లడించట్లేదు? ఈ 56 ఏళ్లుగా బ్యాంకుల్లో జమ చేసిన బంగారం ఎంత? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పట్లేదని గిరిజన పూజారులు వాపోతున్నారు.


ఆ వివరాలను వెల్లడించడంతోపాటు.. వాటిలోనూ తమకు వాటా ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. రెండేళ్లకొకసారి జరిగే మేడారం మహాజాతరలో.. భక్తులు బెల్లాన్నే బంగారంగా సమర్పిస్తారు. అయితే.. కొందరు భక్తులు మాత్రం నిజంగానే వెండి, బంగారాలను తల్లులకు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. జాతర తరువాత డబ్బు లెక్కలను వెల్లడించి.. వచ్చే ఆదాయంలో పూజారులకు 33 శాతం వాటా ఇస్తున్న దేవాదాయ శాఖ అధికారులు బంగారాన్ని బ్యాంకులో జమ చేస్తున్నారు. ఆ వివరాలనే ఇప్పుడు గిరిజన పూజారులు అడుగుతున్నారు. ఆ వెండి, బంగారాల్లో ఎవరి వాటా ఎంతనేది స్పష్టత లేదు.


  • పూజారుల్లో అనుమానాలు

1968 నుంచి మేడారం జాతర దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నా అప్పట్లో బంగారం, వెండి కానుకలు చాలా తక్కువగా వచ్చేవి. 1996లో ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి, ప్రత్యేకంగా నిధులిచ్చి, ఆర్టీసీ బస్సులను కేటాయించటంతో భక్తుల సంఖ్య కోటి దాటింది. 1968 నుంచి.. అంటే ఈ 56 ఏళ్లలో భక్తులు వనదేవతలు మొక్కుగా చెల్లించుకున్న బంగారం దాదాపు 10 కిలోలు, వెండి సుమారుగా 587 కిలోలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఆ లెక్కలపై గిరిజన పూజారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 2018 జాతర నుంచి పరిశీలిస్తే.. ఆ ఏడాది భక్తులు తల్లులకు 824 గ్రాముల బంగారం, 47 కిలోల వెండిని మొక్కులుగా చెల్లించారు. 2020లో 1,064 గ్రాముల బంగారం, 55 కిలోల వెండి.. 2022లో 631గ్రాముల బంగారం, 48 కిలోల వెండి, 2024లో 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండి వనదేవతలకు కానుకల రూపంలో వచ్చాయి. నాలుగు జాతరలకే 3,298 గ్రాముల బంగారం, 203 కిలోల వెండి తల్లులకు వస్తే.. 1968 నుంచి ఇప్పటిదాకా జరిగిన 28 జాతరల్లో వచ్చింది 10 కిలోల బంగారమేనా? అన్నది గిరిజన పూజారులు, కొందరు భక్తుల ప్రశ్న. తల్లుల బంగారానికి సంబంధించిన వాస్తవ వివరాలు వెల్లడించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.


  • 1994లో 10 కిలోల వెండి విక్రయం!

దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటి వరకూ ఎప్పుడూ బంగారం, వెండి కానుకల వివరాలు తెలుపలేదు. 1994 మహా జాతర సమయంలో జాతర నిర్వహణ కోసం 10 కిలోల వెండిని అమ్మినట్లు మాత్రం నాకు కొంత సమాచారం ఉంది. బ్యాంకులో ఎంత బంగారం ఉందో తెలియదు. పూర్తి వివరాలను తెలిపి,పూజారుల వాటా చెల్లించాలి.

-సిద్ధబోయిన జగ్గారావు,

మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు


  • వెండి, బంగారాల్లో వాటా ఇవ్వలే!

యాభై ఆరు సంవత్సరాలుగా డబ్బు రూపేణా వచ్చిన కానుకలను మాత్రమే తీసుకుంటున్నాం. నాకుగానీ, మా పూర్వీకులకుగానీ ఎప్పుడూ వెండి, బంగారు కానుకల్లో వాటా ఇవ్వలేదు. తల్లులకు సంబంధించిన బంగారం, వెండి బ్యాంకులో ఎంత ఉన్నాయో తెలియదు. ఆ వివరాలు వెంటనే వెల్లడించి పూజారులకు వాటా ఇవ్వాలి.

- కాక సారయ్య,

ప్రధాన పూజారి, ప్రధాన వాటాదారు


  • బ్యాంకు లాకర్‌లో భద్రం

మేడారం వనదేవతలకు భక్తలు సమర్పించిన బంగారం, వెండి మొత్తం బ్యాంక్‌ లాకర్‌లో భద్రపరించాం. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి 10 కిలోల మిక్స్‌డ్‌ బంగారం, 587 కిలోల మిక్స్‌డ్‌ వెండి ఉంది. పైఅధికారులకు నివేదికలు పంపాం. అనుమతులు రాగానే ప్యూరిఫై చేసి వివరాలు వెల్లడిస్తాం. ఆ బంగారం మొత్తాన్ని నగదీకరించి.. వచ్చే ఆదాయాన్ని మేడారం అభివృద్ధికి ఉపయోగించుకునేలా ప్రతిపాదనలు, నివేదికలు రూపొందించాం. పూజారులకు త్వరతోనే పూర్తి వివరాలు తెలియజేస్తాం.

రాజేంద్రం, మేడారం మహజాతర, ఈవో

Updated Date - Nov 02 , 2024 | 04:34 AM