Vinayaka: ఖైరతాబాద్ గణపతిని చూశారా.. ఎలా ఉందంటే..
ABN, Publish Date - Sep 06 , 2024 | 07:40 PM
ఖైరతాబాద్‌లో సప్తముఖ మహాశక్తి రూపంలో వినాయకుడు కొలువై ఉన్నాడు. గణపతి కుడివైపున శ్రీనివాస కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణ ప్రతిమలను నెలకొల్పారు. అయోధ్యలో ప్రతిష్టించిన బాల రాముడు, రాహువు, కేతువును ప్రతిష్టించారు.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. వినాయక ప్రతిమలు కొనుగోలు చేసే బిజీలో భక్తులు ఉన్నారు. పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు మహిళలు పోటెత్తారు. వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణపతి (Khairatabad Lord Ganesh). ఈ సారి 70 అడుగుల్లో వినాయకుడు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు అవుతున్నందున 70 అడుగుల పొడవుతో ప్రతిమను ఏర్పాటు చేశారు. సప్తముఖ మహాశక్తి రూపంలో లంబోదరుడు దర్శనం ఇస్తోన్నారు.
7 తలలు, 14 చేతులు
ఖైరతాబాద్‌లో సప్తముఖ మహాశక్తి రూపంలో వినాయకుడు కొలువై ఉన్నాడు. గణపతి కుడివైపున శ్రీనివాస కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణ ప్రతిమలను నెలకొల్పారు. అయోధ్యలో ప్రతిష్టించిన బాల రాముడు, రాహువు, కేతువును ప్రతిష్టించారు. గతంలో సప్తముఖ మహా గణపతిని రూపొందించారు. ఈ సారి రూపొదించిన ప్రతిమ అందుకు భిన్నంగా ఉంది. ప్రపంచశాంతితోపాటు ప్రజలకు ఆయురారోగ్యాలు కలిగేలా గణపతిని సప్తముఖాలతో పూజించాలని దివ్యజాన సిద్దాంతి గౌరీభట్ట విఠల శర్మ సూచించారు. ఆ ప్రకారం కమిటీ, ప్రధాన శిల్పి రాజేంద్రన్ వినాయకుడి ప్రతిమను తయారు చేశారు. వినాయకుడికి 7 తలలు, 14 చేతులు, తలలపై నాగ సర్పాలతో కలిసి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి ప్రతిమ నెలకొల్పారు. ఖైరతాబాద్ గణేశుడికి పద్మశాలి సంఘం 75 అడుగుల జంజం, 50 అడుగుల కండువాను సమర్పిస్తారు.
తొలి పూజ
శనివారం ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ గణపతి తొలి పూజ నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు తొలి పూజలో పాల్గొంటారు. గతంలో గవర్నర్లు తొలి పూజలో పాల్గొనేవారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖైరతాబాద్ గణపతిని గవర్నర్ దర్శించుకుంటారు. ఖైరతాబాద్ వినాయకుడి ప్రతిమ అత్యంత శోభాయమానంగా ఉంది. చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. లంబోదరుడి ప్రతిమను చూసేందుకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పోలీసులు, అధికారులు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
Updated Date - Sep 06 , 2024 | 10:09 PM