Dil Raju: ఐటీ, ఫార్మాలానే సినీ పరిశ్రమకూ సీఎం సహకరిస్తామన్నారు
ABN, Publish Date - Dec 27 , 2024 | 04:06 AM
బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల పెంపు అనేది చిన్న విషయం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ ఎజెండా అని టాలీవుడ్ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(టిఎ్‌ఫడిసి) చైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు.
ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు
హైదరాబాద్: బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల పెంపు అనేది చిన్న విషయం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ ఎజెండా అని టాలీవుడ్ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(టిఎ్‌ఫడిసి) చైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు. ఆయన నేతృత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తెలంగాణ ముఖ్య మంత్రి సీఎం రేవంత్‌రెడ్డితో గురువారం సమావేశమయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారని సమావేశం అనంతరం దిల్ రాజు మీడియాకు వెల్లడించారు. తెలుగు సినిమాకు జాతీయ గౌరవం దక్కుతోందని సీఎం అన్నారని ఆయన తెలిపారు. తెలుగు సినిమాను జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం కలసి పని చేయాలని సీఏం సూచించారని, ఆ దిశగా కలసి పనిచేయబోతున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో తెలుగుతోపాటు బాలీవుడ్, తమిళ్, కన్నడ, ఇతర భాషా చిత్రాల షూటింగ్‌లు కూడా జరుగుతున్నాయి, భారతీయ సినిమాలే కాదు హాలీవుడ్ చిత్రాలు కూడా ఇక్కడ షూటింగ్ చేసేలా ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై ఇండస్ట్రీ నుంచి సలహాలు ఇవ్వాలని సీఎం కోరినట్లు ఆయన చెప్పారు. దీనిపై తాము త్వరలో సమావేశమై ఏమేం చేస్తే బాగుంటుందో చర్చించుకుని ఎఫ్‌డీసీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.
చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను ఒక ఇంటర్నేషనల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని దిల్ రాజు అన్నారు. డ్రగ్స్ వ్యతిరేఖ క్యాంపెయిన్‌లో, ప్రభుత్వ అభివృద్ధి ప్రచార కార్యక్రమాల్లో ఇండస్ట్రీ నుంచి భాగస్వామం కావాలని సీఎం అడిగారని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మా నుంచి సహకారం ఉంటుందని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి హీరోలు, డైరెక్టర్లు ప్రత్యేకంగా ఎవరి ద్వారా చెప్పిస్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌కు ఐటీ ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమ కూడా అంతే కీలకమని సీఎం అన్నారని పేర్కొన్నారు. ఈ మధ్య జరిగిన అనుకోని సంఘటన వల్ల సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ పెరిగిందనే అపోహ తలెత్తిందని, తాను ఎఫ్‌డీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుని వారం రోజులే అవుతోందని, తాను యూఎస్ నుంచి రాగానే వెంటనే సీఎంని కలసి సమయం తీసుకున్నానని చెప్పారు. నేటి సమావేశంలో ఇండస్ట్రీకి ఏమేం కావాలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా సీఎంకి విన్నవించామన్నారు. ప్రభుత్వం, ఇండస్ట్రీకి మధ్య చర్చల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని, గద్దర్ అవార్డులు ఎఫ్‌డీసీతో అనుసంధానంగా జరగాలని సీఎం సూచించారని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశంలో పాల్గొన్న మొత్తం సభ్యుల్లో ఒక్క మహిళా ఆర్టిస్టు గానీ, హీరోయిన్‌గానీ, మహిళా డైరెక్టర్‌గానీ లేరు. 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించిన ఏ ఒక్క విభాగం నుంచి అయినా మహిళలను ఆహ్వానించకపోవడం గమనార్హం.
Updated Date - Dec 27 , 2024 | 04:06 AM