ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DK Aruna: నియంతలా సీఎం రేవంత్‌ ప్రవర్తన

ABN, Publish Date - Nov 19 , 2024 | 02:51 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక నియంతలా ప్రవర్తిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు.

  • రైతులకు సీఎం సోదరుడి బెదిరింపులు: అరుణ

  • లగచర్లపై పార్లమెంటులో తీర్మానం: ఈటల

  • సంగారెడ్డి జిల్లా జైల్లో గ్రామస్థులకు పరామర్శ

కంది, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక నియంతలా ప్రవర్తిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌, అధికారులపై దాడి కేసులో అరెస్టై సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల గ్రామస్థులను ఆమె సోమవారం ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఫార్మా పరిశ్రమకు భూములు ఇవ్వబోమని 8 నెలలుగా రైతులు, పేదలు ఆందోళన చేస్తున్నారన్నారు. కానీ వారి భూములను లాక్కునేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. భూములను బలవంతంగా లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారన్నారు. అధికారులపై దాడి ఘటనలో కాంగ్రెస్‌ వాళ్లు కూడా ఉన్నారని, వారిని విడిచిపెట్టి మిగతా పార్టీల వారిని అరెస్ట్‌ చేశారని ఆరోపించారు.


దాడి జరిగిన రోజున అర్ధరాత్రి పోలీసులు గ్రామస్థుల ఇళ్లలోకి చొరబడి దాడి చేశారన్నారు. అరెస్ట్‌ చేసిన వారిపై ‘థర్డ్‌ డిగ్రీ’ ప్రయోగించి వారి కాళ్లు, చేతులు కమిలిపోయేలా కొట్టారన్నారు. సీఎంకు తనను ఓటేసి గెలిపించిన ప్రజల కంటే ఫార్మా కంపెనీలపైనే ప్రేమ ఎక్కువైందన్నారు. రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన 11 నెలలకే పేదల ఉసురుపోసుకుంటున్నారన్నారు. సీఎం అహంకారం వీడి లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్‌ చేశారు. ఫార్మా సిటీ పేరుతో భూములను సేకరించి వాటిని రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లకు అప్పనంగా ఇస్తే ఊరుకోమని ఎంపీ ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. కొడంగల్‌ నియోజకవర్గంలో సీఎం సోదరుడి అరాచకాలు ఎక్కువయ్యాయని, ఆయన ప్రజలపై దౌర్జన్యం చేస్తూన్నాడని ఆరోపించారు. లగచర్ల ఘటన తర్వాత అక్కడికి వెళ్లాడానికి పోలీసులు ఎవ్వరినీ అనుమతించకపోయినా, సీఎం సోదరుడు మాత్రం 50 వాహనాల్లో వెళ్లి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడన్నారు. సీఎం బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ విషయమై పార్లమెంటులో హక్కుల తీర్మానం ప్రవేశపెడతామన్నారు.


  • లగచర్ల వెళ్తున్న ఈటల, డీకే అరుణ అరెస్టు

మొయినాబాద్‌/నార్సింగ్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): లగచర్ల రైతులను పరామర్శించేందుకు వెళుతున్న బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని మొయినాబాద్‌ పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం సాయంత్రం మొయినాబాద్‌ ఠాణా ఎదుట రోడ్డుపై బారికేడ్లు అడ్డుపెట్టి ఎంపీలు, ఎమ్మెల్యేల కార్లను ఆపేశారు. దీంతో వారు దిగకుండా కారులోనే కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు ఎంపీలు, ఎమ్మెల్యేను బలవంతంగా వారి కారుల్లో నుంచి దింపి అరెస్టు చేసి పోలీసు వాహనాల్లో నార్సింగ్‌ ఠాణాకు తరలించారు. డీకే అరుణ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఓ చేతకాని దద్దమ్మ అని, దమ్ముంటే రాజీనామా చేసి కొడంగల్‌లో మళ్లీ పోటీ చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ‘‘మేం రౌడీలం కాదు. పార్లమెంట్‌ సభ్యులం. మమ్మల్ని ఎలా అడ్డుకుంటార’ని పోలీసులపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 19 , 2024 | 02:51 AM