వైద్యులకూ సాఫ్ట్‌వేర్ సిండ్రోమ్..!
ABN, Publish Date - Nov 25 , 2024 | 03:10 AM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లంటే... గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయాలి.. శారీరక శ్రమ తక్కువ.. మానసిక ఒత్తిడి అధికం. దీంతో 45 ఏళ్ల వయసుకే వారు బీపీ, షుగర్, గుండె జబ్బుల బారిన పడుతుంటారు. దీన్నే వైద్య పరిభాషలో సాఫ్ట్‌వేర్ సిండ్రోమ్ అని పిలుస్తారు.
45 ఏళ్లకే బీపీ, షుగర్, గుండె జబ్బుల బారిన
సుప్రసిద్ధ కార్డియాలజిస్ట్ సోమరాజు ఆందోళన
గుంటూరు మెడికల్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లంటే... గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయాలి.. శారీరక శ్రమ తక్కువ.. మానసిక ఒత్తిడి అధికం. దీంతో 45 ఏళ్ల వయసుకే వారు బీపీ, షుగర్, గుండె జబ్బుల బారిన పడుతుంటారు. దీన్నే వైద్య పరిభాషలో సాఫ్ట్‌వేర్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ రోగం.. వైద్యరంగంలోకీ ప్రవేశించింది. ‘డాక్టర్లు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మాదిరిగా శారీరక శ్రమకు దూరమవుతున్నారు. దీంతో వీరిలోనూ బీపీ, షుగర్, స్థూలకాయం, గుండెజబ్బులు పెరుగుతున్నాయి’ అని సుప్రసిద్ధ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బీ సోమరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీని గుంటూరు జింకానా ఆడిటోరియంలో జరుగుతున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర 66వ వార్షిక సదస్సులో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యుల ఆరోగ్య భద్రతపై ప్రసంగించారు. భారత్‌లో వ్యక్తి సగ టు జీవితకాలం 65 ఏళ్లు కాగా.. వైద్యుల విషయంలో ఇది 59 ఏళ్లుగా ఉందని సోమరాజు తెలిపారు.
అనేక రకాల ఒత్లిళ్ల మధ్య రోగుల చికిత్సలో తలమునకలై ఉండే వైద్యులు నవ్వడం కూడా మర్చిపోతున్నారని తెలిపారు. చాలా మంది డాక్టర్లు శారీకంగా తగినంత ఫిట్‌గా ఉండడం లేదన్నారు. నెలకోసారైనా తమ బీపీ చెక్ చేసుకోవడం లేదన్నారు. మంచి ఆహారం తీసుకోవడం, మిత్రులతో సమయం సరదగా గడపటం, రోజూ వ్యాయామం చేయడం అలవర్చుకోవాలని సోమరాజు వైద్యులకు సూచించారు. జలుబు, దగ్గు తర్వాత ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఆరోగ్య సమస్య నడుంనొప్పి అని మల్లిక స్పైన్ సెంటర్ అధినేత, ప్రముఖ వెన్ను వైద్యనిపుణులు డాక్టర్ జే నరేశ్ బాబు తెలిపారు. ‘నడుంనొప్పి-అపోహలు, వాస్తవాలు’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. నడుం నొప్పిలో నాలుగు రకాలు ఉన్నా.. 90 శాతం మంది రోగులు మెకానికల్ బ్యాక్ పెయిన్‌తో బాధపడుతుంటారని ఆయన వివరించారు. వెన్నునొప్పికి కారణం తెలుసుకొంటే చికిత్స సులువే అన్నారు. స్టాండింగ్ ఎంఆర్‌ఐ స్కాన్ అందుబాట్లోకి వచ్చాక వెన్ను నొప్పి వ్యాధి నిర్ధారణ సులువుగా మారిందన్నారు.
Updated Date - Nov 25 , 2024 | 03:10 AM