Hyderabad: పాల లాభం.. గాడిద గుడ్డు
ABN, Publish Date - Nov 16 , 2024 | 05:12 AM
బర్రెపాలు చిక్కటివైతే లీటరు ఎక్కువకు ఎక్కువ రూ.80! మరి.. గాడిద పాలు లీటరు ధర ఎంతో తెలుసా రూ.1,600! ఓ షెడ్డు కట్టుకొని 20-30 గాడిదలు కొనుక్కొని పాలు పితికి ఇస్తే డబ్బులిచ్చే పూచీ మాది!
గాడిదలను అంటగట్టి రూ.100కోట్లకు కుచ్చుటోపీ!
లీటరు పాలు రూ.1600కు కొంటామని హామీ
ఒక్కో జీవికి రూ. లక్షన్నర.. రూ.5 లక్షలు డిపాజిట్
షెడ్డుకు రూ.10 లక్షలు.. మొత్తం రూ.కోటి పెట్టుబడి
చేతులెత్తేసిన తమిళనాడులోని ‘ది డాంకీ ప్యాలెస్’
తమకు న్యాయం చేయాలంటూ బాధితుల గగ్గోలు
పంజాగుట్ట, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): బర్రెపాలు చిక్కటివైతే లీటరు ఎక్కువకు ఎక్కువ రూ.80! మరి.. గాడిద పాలు లీటరు ధర ఎంతో తెలుసా రూ.1,600! ఓ షెడ్డు కట్టుకొని 20-30 గాడిదలు కొనుక్కొని పాలు పితికి ఇస్తే డబ్బులిచ్చే పూచీ మాది! తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన ‘ది డాంకీ ప్యాలెస్’ సామాజిక మాధ్యమాల్లో ఇలానే ప్రచారం చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ఎగబడ్డారు. పెద్ద పెద్ద షెడ్లు నిర్మించి.. రూ.80వేల నుంచి రూ.1.50 లక్షల చొప్పున వెచ్చించి గాడిదలు కొనుక్కున్నారు! కొద్దిరోజులు చెప్పినట్లుగానే పాలు తీసుకున్న ‘ది డాంకీ ప్యాలెస్’ నిర్వాహకులు తర్వాత తూచ్ పొమ్మన్నారు! ఫలితంగా నమ్మి గాడిదలు కొనుకున్న వారంతా తలా రూ.50 లక్షల నుంచి రూ.కోటి దాకా నష్టపోయారు! అయితే.. ‘గాడిద’ మాటలతో నమ్మించి ‘ది డాంకీ ప్యాలెస్’ వారు రూ.100 కోట్ల దాకా పోగేసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు, ఫ్రాంచైజీ సభ్యులు గోడు వెళ్లబోసుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరోనా తర్వాత జనాలకు రోగ నిరోధక శక్తి పెరుగుదల, పోషక పదార్థాలు అవసరం చాలా ఉంటుందని.. ఇవి గాడిద పాలల్లో పుష్కలంగా ఉంటాయని.. ఔషధాల తయారీలోనూ గాడిద పాలు వాడతారని ఫలితంగా డిమాండ్ బాగా ఉంటుందంటూ ది డాంకీ ప్యాలెస్ నిర్వాహకుడు బాబు ఉలఘనాథన్, సభ్యులు గిరి సుందర్, బాలాజీ, సోనిక రెడ్డి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ఫలితంగా చాలామంది ఫ్రాంచైజీలు తీసుకున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ కట్టారు, షెడ్లు నిర్మించుకున్నారు, వారి వద్దనే గాడిదలు కొనుగోలు చేశారు. మూడు నెలలు వారి వద్ద నుంచి పాలు ేసకరించి డబ్బులు చెల్లించినా తర్వాత స్పందించడం, డబ్బులు చెల్లించడం మాని వేశాడని బాధితులు ఆరోపించారు. వారు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అప్పు చేసి మరి ఫ్రాంచైజీలో చేరామని.. సెక్యురిటీ డిపాజిట్ కింద రూ.5 లక్షలు తీసుకున్నారని వారు చెప్పిన విధంగా అన్ని సౌకర్యాలతో సుమారు రూ.10 లక్షలు వెచ్చించి షెడ్లు కూడా నిర్మించామని అన్నారు. 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు మూడు, నాలుగు నెలల పాటు లీటరుకు రూ.1600 చొప్పున ఒక్కొక్కరికి సుమారు రూ.4లక్షలు-రూ5లక్షల దాకా చెల్లించారని చెప్పారు. భారీగా లాభాలు వస్తాయని నమ్మించడంతో తాము తీసుకున్న డబ్బులను తిరిగి వ్యాపారంలోనే పెట్టించారని చెప్పారు. 2023 ఏప్రిల్, మే తర్వాత నుంచి ఇప్పటి వరకు సరఫరా చేసిన పాల డబ్బులు, నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం లేదని చెప్పారు. తమతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఇచ్చిన జీఎస్టీ సంఖ్య కూడా నకిలీదని, అసలు గాడిద పాలతో వ్యాపారం చేయడానికి మన దేశంలో అనుమతి లేదని తెలుసుకున్నామని అన్నారు.
చివరికి.. మోసపోయామని గ్రహించి ప్రశ్నిస్తే తమకు బ్యాంకు చెక్కులు ఇచ్చారని, తమ బ్యాంకు ఖాతాలో వేస్తే అవి బౌన్స్ అయ్యాయని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు వంద మందికి పైగా రూ.100 కోట్ల వరకు నష్టపోయామన్నారు. ఇదో పెద్ద కుంభకోణమని, దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తమిళనాడులో పోలీసులకు ఫిర్యాదు చేేసందుకు వెళ్తే వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని, తమ సమస్య మీద మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రులు స్పందించి తమకు న్యాయం చేయాలని, తమ డబ్బులు తమకు ఇప్పించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. లేకపోతే తమకు బలవన్మరణాలే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు గాడిదలను పోషించలేక విడిచి పెట్టామని తేజస్విని అనే బాధితురాలు చెప్పారు. కాగా తిరునల్వేలి కలెక్టర్ విష్ణు గోపాలన్ డాంకీ ప్యాలెస్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారని బాధితులు చెప్పడం గమనార్హం. కొసమెరుపు ఏమిటంటే.. గాడిదల పేరుతో కోట్లు కొల్లగొట్టిన ‘ది డాంకీ ప్యాలెస్’ నిర్వాహకుడు బాబు ఉలఘనాథన్ పెద్దగా చదువుకోలేదట! ఏడో తరగతి ఫెయిల్ అయ్యాడట!
Updated Date - Nov 16 , 2024 | 05:12 AM