Suspension: కామారెడ్డి డీసీఆర్‌బీ డీఎస్పీ మదన్‌లాల్ సస్పెన్షన్
ABN, Publish Date - Oct 24 , 2024 | 03:35 AM
కామారెడ్డి జిల్లాలోని డీసీఆర్‌బీ (డిస్ట్రిక్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో) విభాగంలో పనిచేస్తున్న డీఎస్పీ మదన్‌లాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పలు అవినీతి ఆరోపణలతో మూడు రోజుల క్రితమే ఆయన్ను సస్పెండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రూ. 6 లక్షలకే కిలో బంగారం ఇస్తానని వ్యక్తిని మోసగించిన డీఎస్పీ
రూ.20 లక్షల విలువైన బంగారానికి ఒప్పందం.. రూ.17లక్షల వసూలు
బంగారం ఇవ్వకపోయే సరికి డీఎస్పీపై ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు
ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీపై కేసు
డీజీపీ కార్యాలయం నుంచి డీఎస్పీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
కామారెడ్డి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలోని డీసీఆర్‌బీ (డిస్ట్రిక్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో) విభాగంలో పనిచేస్తున్న డీఎస్పీ మదన్‌లాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పలు అవినీతి ఆరోపణలతో మూడు రోజుల క్రితమే ఆయన్ను సస్పెండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మదన్‌లాల్ డీసీఆర్‌బీ డీఎస్పీగా ఏడు నెలల క్రితం కామారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు. కామారెడ్డిలోనే నివాసం ఉంటూ వ్యాపారి మధుసూదన్‌తో పరిచయం పెంచుకున్నారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని అతడికి నమ్మ బలికాడు. దొంగల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం ఉందని.. గుప్త నిధుల నుంచి లభించిన మరికొంత బంగారం ఉందని ఆ వ్యాపారిని నమ్మించాడు.
రెండు కిలోల వరకు బంగారం ఉంటుందని.. రూ. 6 లక్షలకే కిలో చొప్పున ఇప్పిస్తానని చెప్పాడు. తక్కువ ధరకు బంగారం వస్తుందనే భావనతో మధుసూదన్ మూడు కిలోలలకు పైగా బంగారం కోసం రూ. 20 లక్షలకు డీఎస్పీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బంగారం తన వద్ద సేఫ్‌గా ఉందని, మొత్తం డబ్బులు ముట్టజెప్పిన తర్వాతే బంగారం ఇస్తానని వ్యాపారికి డీఎస్పీ మదన్‌లాల్ స్పష్టం చేశాడు. ఫలితంగా సదరు వ్యాపారి తొలుత రూ. 17 లక్షలను డీఎస్పీకి ముట్టజెప్పాడు. నెలలు గడుస్తున్నా బంగారం ఇవ్వకపోవడంతో డీఎస్పీపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో సదరు బాధితుడు మధుసూదన్ పోలీసు అధికారులను ఆశ్రయించాడు.
ఈ విషయం కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ దృష్టికి రావడంతో.. ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు జరిగిన ఘటనపై సింధూశర్మ ఇటీవల విచారణ చేపట్టారు. కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపట్టారు. కమిటీ నివేదిక ఆధారంగా జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. అంతకుముందే మదన్‌లాల్‌ను ఐజీ కార్యాలయానికి సరెండర్ చేశారు. జిల్లా పోలీసు శాఖ నివేదిక ప్రకారం మూడు రోజుల క్రితం డీఎస్పీ మదన్‌లాల్‌ను సస్పెండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీఎస్పీ మదన్‌లాల్ జిల్లాలోని పోలీసు శాఖలోనే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు కూడా విచారణలో తెలిసింది. సదరు డీఎస్పీకి కామారెడ్డికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు సహకరించినట్లు సమాచారం.
Updated Date - Oct 24 , 2024 | 03:35 AM