Sridhar Babu: మన రోడ్లపైనా డ్రైవర్ రహిత కార్లు
ABN, Publish Date - Aug 27 , 2024 | 03:56 AM
ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్)లో జరుగుతున్న పరిశోధనలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
దేశానికి ఆదర్శంగా ఐఐటీహెచ్ పరిశోధనలు
కొనియాడిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డితో
కలిసి డ్రైవర్ రహిత వాహనాల పరిశీలన
జపాన్ సహకారంతో ‘టీ-హాన్’ పరిశోధనలు
ఆయనతో కలిసి ఐఐటీహెచ్‌ను సందర్శించిన జగ్గారెడ్డి
కంది, ఆగస్టు 26: ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్)లో జరుగుతున్న పరిశోధనలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది పరిధి ఐఐటీహెచ్‌లోని టీహాన్ (టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఇన్ అటానమస్ నావిగేషన్) విభాగంలో.. సుజుకిమోటార్‌కార్పొరేషన్(జపాన్) భాగస్వామ్యంతో నిర్వహించిన డ్రైవర్ రహిత వాహనాల పనితీరును సోమవారం ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి పరిశీలించారు. టీహాన్ ఆధ్వర్యంలో తయారుచేసిన అటానమస్ నావిగేషన్ వాహనాలు, డ్రోన్లు, ఈ సైకిళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐఐటీహెచ్ ప్రాంగణంలో చోదకరహిత (డైవ్రర్‌లెస్ టెక్నాలజీతో నడిచే) వాహనంలో మంత్రి ప్రయాణించారు.
విదేశాల్లో జరుగుతున్న పరిశోధనలకు దీటుగా.. ఐఐటీహెచ్ పరిశోధకులు తయారుచేసిన డ్రైవర్‌లెస్ టెక్నాలజీ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి సలహాలతో.. టీహాన్ అధినేత రాజ్యలక్ష్మి నేతృత్వంలోని పరిశోధకులు గ్రామీణ రోడ్లు, పట్టణాల్లోని ట్రాఫిక్‌పై మూడేళ్లపాటు అధ్యయనం చేసి, జీపీఎస్, సెన్సర్లు అమర్చి ఈ వాహనాలను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. త్వరలోనే మన రహదారులపై చోదక రహిత వాహనాలు పరుగులు తీయడాన్ని చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఐఐటీహెచ్ పరిశోధనలు రాష్ట్రంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొస్తాయని వ్యాఖ్యానించారు.
పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో ఐఐటీహెచ్ శాస్త్రవేత్తల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. సాంకేతికతను ఉపయోగించి హెల్త్‌కేర్, రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్, వ్యవసాయ రంగాల్లో మెరుగ్గా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. ఐఐటీహెచ్ శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఐఐటీ హైదరాబాద్ కోసం భూమి కావాలని కోరగా.. అప్పటి ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి కందిలోని రైతులను ఒప్పించి దాదాపు 600 ఎకరాలు సేకరించి ఇచ్చారని గుర్తుచేశారు.
ఇప్పుడు మన దగ్గరా..
డ్రైవర్‌లెస్ కార్లంటే పాశ్చాత్యదేశాలే గుర్తొచ్చే పరిస్థితి. కానీ, ఐఐటీహెచ్ పరిశోధకుల కృషితో ఇప్పుడు ఆ సాంకేతిక పరిజ్ఞానం మనకూ అందుబాటులోకి వచ్చింది. ‘టీ-హాన్’లో డ్రైవర్‌రహిత వాహనాలు రూపుదిద్దుకుంటున్నాయి.సోమవారం ఈ వాహనాలను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇందుకోసం టీ-హాన్ వద్ద ట్రాఫిక్ సిగ్నళ్లు, స్పీడ్ బ్రేకర్లు, గుంతలు, మూలమలుపుల రోడ్లను ఏర్పాటు చేశారు. ఈ వాహనాలు..దారిలో ఎదురొచ్చే పశువులు, మనుషులు, ఇతర వాహనాలను 40మీటర్ల దూరం నుంచే పసిగడతాయి.
15 మీటర్ల దూరంలో వాటంతటవే ఆగిపోతాయి. కాగా.. ఈ వాహనాలను ఐఐటీహెచ్ విద్యార్థులు, అధ్యాపకులు మెయిన్‌గేట్ నుంచి ఐఐటీహెచ్‌లోని అన్ని విభాగాలకూ చేరుకోవడానికి వినియోగిస్తున్నారు. ఇవే కాక..వినూత్న డ్రోన్లు, ఈ సైకిల్, ఈ బైక్‌లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి వెల్లడించారు.
Updated Date - Aug 27 , 2024 | 03:56 AM